Lok Sabha elections: నాల్గవ విడతలో 62శాతానికి పైగా పోలింగ్‌ !

May 14,2024 08:08 #Lok Sabha elections, #Phase 4

బెంగాల్‌లో చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు
బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికాం జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన నాల్గవ విడత పోలింగ్‌లో 62.84 శాతం ఓటింగ్‌ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.94 శాతం పోలింగ్‌ నమోదు కాగా, తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్‌ (68.63) వుంది. జమ్మూ కాశ్మీర్‌, మహారాష్ట్ర వరుసగా 36.58శాతం, 52.75 శాతాలతో వెనుకబడ్డాయి. బీహార్‌లో 55.90, జార్ఖండ్‌లో 63.37, ఒరిస్సాలో 63.85, తెలంగాణాలో 61.29, ఉత్తరప్రదేశ్‌లో 57.88శాతం పోలింగ్‌ నమోదైనట్లు సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. పోలింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశాలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, ఒరిస్సాలో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
మొత్తమ్మీద పోలింగ్‌ ప్రశాంతంగానే సాగినా, పశ్చిమ బెంగాల్‌లో అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌లో టిఎంసి, బిజెపి కార్యకర్తలు మధ్య దాడులు జరిగాయి. బోల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగిన బాంబు దాడిలో ఒక టిఎంసి కార్యకర్త మరణించాడు. పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్ని బూత్‌ల్లో ఇవిఎంలు పనిచేయలేదని వార్తలు కూడా అందాయి. పరుష పదజాలంతో కూడిన ప్రచార హోరు పెరుగుతుండడం, తక్కువ పోలింగ్‌ నమోదవుతుందనే ఆందోళనల మధ్య శ్రీనగర్‌లో ఓటింగ్‌ జరిగింది. కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లిం మెజారిటీకి చెందిన శ్రీనగర్‌ లోక్‌సభ సీటుకు, రెండు ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాలక బిజెపి పోటీ చేయడం లేదు.
ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో వరుసగా 66.14శాతం, 66.71శాతం, 65.68శాతం నమోదయ్యాయి. నాల్గవ దశలో మొత్తంగా 1,717 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. 17.70కోట్ల మంది అర్హులైన ఓటర్లు వుండగా, వారిలో 8.73కోట్ల మంది మహిళలే. తెలంగాణాలో 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25, యుపిలో 13, బీహార్‌లో ఐదు, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒరిస్సాలో 4, పశ్చిమ బెంగాల్‌లో 8, జమ్మూ కాశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటింగ్‌ జరిగింది. ఇప్పటివరకు నాలుగు దశల్లో 379 సీట్లకు పోలింగ్‌ ముగిసింది. ఇక మే 20, మే 25, జూన్‌ 1 తేదీల్లో మరో మూడు దశల్లో పోలింగ్‌ జరగాల్సి వుంది. జూన్‌ 4 ఓట్ల లెక్కింపు జరగనుంది.

➡️