ఉత్తర కర్ణాటకలో బిజెపికి రేవణ్ణ దెబ్బ

May 4,2024 03:05 #BJP, #Karnataka, #Prajwal Revanna
  • అంతర్గత కలహాలకు తోడు ప్రజ్వల్‌ సెక్స్‌ కుంభకోణం
  • మలి విడత ఎన్నికల్లో కమలం ఎదురీత

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి.దేవెగౌడ మనుమడు, సిట్టింగ్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ కుంభకోణం కర్నాటక రాజకీయాలను కుదిపేస్తోంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు రేవణ్ణ వ్యవహారం బహిర్గతం కావడంతో జెడిఎస్‌తో పాటు ఆ పార్టీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బిజెపి పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుక మాదిరి తయారైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ అంశం కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ, ఖర్గే వంటి జాతీయ నాయకులతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ నేతలు రేవణ్ణ సెక్స్‌ కుంభకోణంపై చీల్చిచెండాడుతున్నారు. దాంతో జెడిఎస్‌, ఆ పార్టీకి మిత్రపక్షమైన బిజెపి ఇరుకునపడ్డాయి. రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం బిజెపికి ఎన్నికలకు ముందే తెలిసినా పొత్తు పెట్టుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అసలు విషయం బయటికొచ్చాక ఏమీ తెలియదని బిజెపి బుకాయిస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

హసన్‌ మాజీ ఎంపి, ప్రస్తుత బిజెపి-జెడిఎస్‌ ఉమ్మడి అభ్యర్థి అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ వందలాది మంది మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా వాటిని వీడియోల రూపంలో చిత్రీకరించడం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు కొన్ని వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లు బయటకు రావడం పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యవహారం బయటకు పొక్కగానే రేవణ్ణ విదేశాలకు పారిపోయారు. కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసును జారీ చేసింది. ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో అక్కడ లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వేడిని మరింత రాజేస్తున్నాయి. రెండు విడతల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.

గతంలో ఇక్కడే బిజెపికి అధిక సీట్లు
కర్నాటకలో మొత్తం 28 లోక్‌సభ సీట్లు ఉంటే దక్షిణ కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 26వ తేదీన మొదటి విడత కింద ఎన్నికలు జరిగాయి. రేవణ్ణ పోటీ చేసిన హసన్‌ లోక్‌సభ స్థానం ఎన్నికలు కూడా ఏప్రిల్‌ 26వ తేదీనే ఎన్నికలు ముగిశాయి. ఇవి పూర్తయిన తరువాత రేవణ్ణకు సంబంధించిన సెక్స్‌ వీడియోలు బయటకొచ్చాయి. దీని ప్రభావం మే 7వ తేదీన జరగబోయే రెండో విడత పోలింగ్‌పై ఉండే అకాశముందన్న గుబులు బిజెపి నేతల్లో ఉంది. ఉత్తర కర్నాటకలో బిజెపికి గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలొచ్చాయి. షిమోగా, ఉత్తర కన్నడ, ధార్వాడ్‌, హవేరి వంటి కీలకమైన లోక్‌సభ స్థానాలున్నాయి. రేవణ్ణ వ్యవహారంతో ఇప్పుడు రాజకీయంగా బిజెపి, జెడిఎస్‌ కుటమికి ఇబ్బందికరంగా మరిందనే చెప్పవచ్చు. ఎందుకంటే రేవణ్ణ కొన్ని వందల మంది మహిళలను లైంగికంగా వేదించాడన్న ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లోకి బిజెపి పడింది. అక్కడనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అయితే కాంగ్రస్‌ మాత్రం ఈ విషయం ముందుగానే బిజెపికి తెలిసినా పట్టించుకోకుండా జెడిఎస్‌తో బిజెపి పొత్తులు పెట్టుకుందని తిప్పికొడుతోంది. రేవణ్ణ రేపిస్టే కాదు.. సామూహిక అత్యాచారం చేసిన వాడని షిమోగా ప్రచారంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.

తగాదాల్లో తలమునకలు
ఉత్తర కర్నాటకలో బిజెపి అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. షిమోగాలో మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు. ఈయనకు వ్యతిరేకంగా రెబల్‌ అభ్యర్థిగా మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప పోటీ చేసియున్నారు. ఇదే విధంగా ధ్వారాడ్‌లో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి వ్యతిరేకంగా స్వామిజీ నామినేషన్‌ వేశారు. ఆ తరువాత ఆ పార్టీ ముఖ్యనేతల జోక్యంతో వెనక్కు తగ్గారు. అయితే వారి నుంచి జోషికి పెద్దగా సహకారం లభించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇకపోతే హవేరీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పోటీ చేస్తున్నారు. వీరందరికీ రేవణ్ణ వ్యవహారం పెద్ద సమస్యగానే మారింది.

షఫీవుల్లా

➡️