పెళ్లింట విషాదం

May 19,2024 08:28 #6 death, #anaathpuram, #road acident
  • ‘అనంత’లో ఘోర రోడ్డు ప్రమాదం
  • కాబోయే పెళ్లి కొడుకుతోపాటు ఆరుగురు దుర్మరణం
  • మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి- గుత్తి (అనంతపురం జిల్లా) : పెళ్లి జరగాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం బాటసుంకలమ్మ ఆలయ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లి కొడుకుతోపాటు ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా అనంతపురం జిల్లా కేంద్రం రాణినగర్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు. ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… అనంతపురం నగరం బిందెల కాలనీలో నివాసం ఉంటున్న షేక్‌ అలీ సాహెబ్‌ (58) రెండవ కుమారుడు షేక్‌ ఫిరోజ్‌ బాషా (28)కు అదే నగరానికి చెందిన యువతితో వచ్చే నెల ఆరున వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో వివాహ దుస్తుల కొనుగోలుకు అలీ సాహెచ్‌ కుటుంబసభ్యులు శుక్రవారం నాడు హైదరాబాద్‌కు రెండు కార్లలో వెళ్లారు. దుస్తులు కొనుగోలు చేసి శనివారం వేకువజామున అనంతపురం బయల్దేరారు. వీటిలో ఒక కారు గుత్తి సమీపంలోని బాటసుంకులమ్మ ఆలయ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ను ఢకొీట్టి అవతలి రోడ్డులో ఎగిరి పడింది. ఈ సమయంలో ఆ రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢకొీని కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులోని షేక్‌ అలీ సాహెబ్‌, పెళ్లి కొడుకు షేక్‌ ఫిరోజ్‌ బాషా, అలీ సాహెబ్‌ మనవళ్లు షేక్‌ మొహమ్మద్‌ ఆహిల్‌ (6), షేక్‌ మొహమ్మద్‌ ఆమన్‌ (4) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. అలీ సాహెబ్‌ సోదరుని భార్య ఎస్‌.రెహనా భాను (44), కోడలు షేక్‌ జహీదా (32), కారును నడుపుతున్న షేక్‌ మొహమ్మద్‌ గౌస్‌ తీవ్రంగా గాయపడ్డారు. సిఐ ఎం.వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ బి.నబీరసూల్‌ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్‌.రెహనా భాను మరణించారు. ఎస్‌.జహీదా, షేక్‌ మహమ్మద్‌ గౌస్‌లను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జహీదా మృతి చెందారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా మరణాలు సంభవించడం అందరినీ కలిచి వేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️