ఎండా కాలం

Apr 29,2024 05:36 #dry season

1 బయట ఎండలు సరేసరి
మరి మండే ధరలు మాటేమిటి?
అగ్నికి ఆజ్యం పోసినట్టు
నోరెండిన నారు సంగతేమిటి?
వలస కూలీల పరిస్థితి –
బతుకు తెరువు కోసం
కరువుతో కలిసి నడిచినట్టుంది
ఎండిన చెరువులు, నెర్రలిచ్చిన నేలలు
రైతాంగం వెంట వస్తున్నట్టున్నాయి!

2
ఇక రోజువారీ వేతనదారుల
కష్టాలు ఎవరికి ఎరుక
కరకు కళ్ళను పెట్టుకున్న
ఇరుకు మనసుకు ఎలా తెలుస్తుంది!
అడిగే నోరును నొక్కుతూ –
ఆకలిని తీర్చే నాగలిని
నడిరోడ్డున నిలబెట్టడమేమిటి?
బువ్వను చూసి హేళన చేసే
పాలనకు విలువుంటుదా?
భూమిని తవ్వి అమ్ముకొనే
అధికారం వెన్ను నిలుస్తుందా?

3
ప్రతి ఏడాది –
ఎండ చెప్పిన మాటలు వట్టివి కావు
తన గట్టి పట్టును చూపించే చేతలు
దీటుగా స్పందించకుంటే
ఘాటు ఫలితాన్ని తట్టుకోవడం కష్టం!
తను తేబోయే ముప్పుకు
తనే ముందుగా ఉప్పు అందిస్తుంది.
మేల్కొనకపోతే ఎవరికి చేటు!

4
నేటి దాహార్తిని తీర్చాలంటే
నీటి పెన్నిధిని కాపాడుకోవాలి.
బతుకుబండి నడవాలంటే
పర్యావరణాన్ని అనుసరించాలి.

చురచురా చూసినంత మాత్రాన
ఎండ గారి సహజత్వం చల్లారదు
నైరుతి ఋతుపవనాల పిలుపులే
రెక్కలు కట్టుకొని ఎగిరెగిరి రావాలి

జ్వలించే సూరీడే లేకుంటే
వెన్నెల వెలుగు వస్తుందా!
చినుకుపూలు కురవందే
పచ్చదనం పల్లవిస్తుందా!
ఈ చరాచర జగత్తుకు
అసలైన అర్థముంటుందా!
– బి.గోవర్ధనరావు
94419 68930

➡️