ఉద్దానం మట్టి మీద

Jun 3,2024 05:10 #Kavitha, #sahityam

పులో సిందవో దుమ్మలగొండో ఎలుగో జాకరో
యేటో కానుకోనేకపోతన్నం నాయినా
మేక మెడని కొరికీసి రత్తం జల్లీసింది
మా బతుక్కి యిదేమి గాచ్చారమో యేటో
ఏటేటా యిదేతంతు నాయినా …

కాపుగాద్దుమంతె మాకంత సత్తువనేదు
వొగిలీ.. కట్టాలు సెప్పుకుంతె తీరుతాయా
ఆరుతాయా
ఇన్నోలికి సెప్పునోలు లోకువ అంతారు
మామూ నేవాటి మేకపిల్లల్లాటోలిమే అయ్యా
నోరులేనోలిమి …

మా మీద పడి మా పేనాలు తోడేత్తున్న జంతువ
కిడ్నీపిక్కల జబ్బు
తాతల ముత్తాల కాసి తలొగ్గీసి బలిమిని
దానికి బలైపోతున్నోలిమి
జంతువ జాడైతె తెలుత్తాది గాని దీని జాడ
మాతరం తెల్దు నాయినా !

ఉడుంపట్టు నాయినా పట్టుకుంతె వొగల్దు
అది తరాలగ మా నడుంకి సుట్టుకుని వొగలని
కొండసిలవ
అది నాయినా దాని ఏలుబడి దాని పెద్దరకం
పొగరుబోత్తనం
ఏదొ ఇలగ ఆక్కు అందక పోక్కు సెందక
బతికిత్తన్నం
వున్నికాడికి తిని లేనికాడికి పస్తులుండి
నెట్టుకొత్తున్నం

వొక్కోపాలి ఆకలితొ నకనకలాడుతున్న
పిల్లాపిచ్చికని సూడనేక దేశిం దాటిత్తిన్నం
నాయినా

సెప్పేము గద నాయినా.. దానిది ఉడుంపట్టని
ఏడు సంద్రాలు దాటెల్లిన వొగల్దు
పండుగునేదు పబ్బంనేదు పున్నమి నేదు
వొప్పుడెలిపొచ్చీసి మీదన పడిపోద్దో తెల్దు
నాయినా …
తల్లి అని పిల్ల అని ముసిలిముడగని
ఏ కొసా కనికారం నేదు
పేదరోద అయినోలుకానోలు యెవులేన
దాని నోటికి సిక్కితె మరి ఆసిలు వొగిలీవలిసిందె
నాయినా …

మాయదారి కిడ్నీపిక్కల జబ్బుకి పచ్చగుండిన
ఉద్దానం అద్దోనమైపోనాది
అద్దోనమైన వుద్దానంకి రచ్చ రాజ్జిం అని
కొన్నాలు నమ్మినోలిమే నాయినా
రాజ్జిం గూడ జాడలేని జంతువె అని
గేనమయ్యేక అస్సిరె నమ్మిక పోదా
ఉద్దానంల పుట్టినోడికి వుద్దం యేపాటి
అని నానుడి

సూత్తన్నం నాయినా సూత్తన్నం
సివరాకరకి మామే వుద్దంలొ దిగిపోతం
ఉద్దానం మటీల వుద్దం సేసినోడికి
సావు నేదు!

– బాలసుధాకర్‌
96764 93680

➡️