మహాధర్నాలో కవితాగానం

Nov 28,2023 10:58 #kavitalu, #Mahadharna

దేశానికి హాని చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తలపెట్టిన కార్మిక, కర్షక రెండు రోజుల మహాధర్నా విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమైంది. వేలాదిమంది పాల్గొన్న ఈ ధర్నాకు సంఘీభావంగా కవులు, రచయితలు కవితాగానం చేశారు. కేంద్ర అనుసరిస్తోన్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ.. కవులు తమ గొంతు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కవితలను వినిపించారు. తొమ్మిది సంవత్సరాల బాలుడు చంద్రహా తన తొలి కవితను వేదికపై వినిపించాడు. సూర్య చంద్రులు లేకపోవడం ఎలాగో, కార్మికులు, కర్షకులు లేకపోతే అలాగ అంటూ తను చదివిన కవిత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అసంఘటిత కార్మికులకు మద్ద్దతుగా, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా, ప్రజలను చీల్చుతున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కవులు తీవ్ర కంఠంతో కవితలు వినిపించారు. కథా రచయిత్రి ఉషారాణి ఈ మహాధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్‌ సమన్వయం చేయగా, ప్రముఖ కవులు కొండపల్లి మాధవరావు, మందరపు హైమావతి, అరసవల్లి కృష్ణ, దివి కుమార్‌, వైష్ణవిశ్రీ, కలిమిశ్రీ, శాంతిశ్రీ, అమూల్య చందు, శిఖా ఆకాష్‌, తంగిరాల సోని, గడ్డం విజయరావు, గోళ్ల నారాయణరావు, రాజాబాబు కంచర్ల, సరికొండ నర్సింహారాజు, రెడ్డి శ్రీనివాసరావు తదితర కవులు తమ కవితలను వినిపించారు. శాంతిశ్రీ వందన సమర్పణ చేశారు.

➡️