ప్రగతిశీల కవిత్వం నీల కురింజి సముద్రం!

Apr 22,2024 04:10 #edit page, #sahityam

”నాన్నా!/ నేను నువ్వెలా అవుతాను/ నువ్వో నీల కురింజి సముద్రం/ నేనో చిన్ని నీలలోహిత సుమాన్ని మటుకే”! అంటూ తన నాన్న ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని నీల కురింజి సముద్రంతో పోల్చి చెప్పిన కవయిత్రి ప్రగతి అభినందనీయురాలు. సర్వ సాధారణంగా కవులు తమకిష్టమైన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని వర్ణించాలంటే మేరు శిఖరం తోనూ, హిమాలయ పర్వతాలతోనూ పోలుస్తుంటారు. ఈ కవయిత్రి అనూహ్యంగా నీల కురింజి సముద్రంతో పోల్చడం చదువరులకు వినూత్నంగా, విడ్డూరంగా అన్పించక మానదు.
ఏమిటీ ‘నీల కురింజి’? అది ప్రపంచంలోనే ఒక అరుదైన అద్భుత అపరూప పుష్ప జాతికి సంబంధించినది. 12 సంవత్సరాలకొకసారి మాత్రమే వికసించే పుష్పం. ఇవి 2006 ఒక సారి, 2018లో ఒకసారి వికసించి కనువిందు చేశాయని ప్రపంచ పర్యాటక సంస్థ తెలిపింది. మళ్లీ 2030లో వికసించ బోతుందని తెలియజేసింది.
నీల కురింజి పుష్పాలు మంచుపర్వత శ్రేణుల్లో లేత నీలం రంగు ఛాయలో సూర్యోదయంలో వికసించిమనల్ని మైమరపింప జేస్తాయి. ఈ పుష్పాలు కేరళ, తమిళనాడు, పశ్చిమ కనుమల్లో, మున్నార్‌ ప్రాంతాల్లో మనకు కనువిందు చేస్తాయి. ఈ అద్భుత సౌందర్య పుష్ప రాశిని తనివిదీరా దర్శించాలని ప్రపంచ పర్యాటకులు సొందర్యోపాసకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇంతటి అద్భుత సౌందర్య పుష్ప సముదాయాన్ని తన నాన్న వ్యకిత్వంతో పోల్చి మనల్ని నిబిడాశ్చర్యంలో ముంచేసి, మనల్ని పూర్వపరాల అన్వేషణలోకి నడిపించిన కవయిత్రికి అభినందనీయులు.
ప్రగతి గారుకథా రచయిత్రి గానే తన ఉనికిని చాటుకున్నారు. ముఖ్యంగా ఇవాళ్టి విద్యార్థులను సాహిత్య కార్యక్రమాల్లో మమేకం చేస్తూ అనేక ఈవెంట్స్‌ నిర్వహిస్తూ వస్తున్న ఒక కెమిస్ట్రీ అధ్యాపకులు. ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తన పేరులోనే కాదు, తనదైన ప్రాపంచిక దృక్పథంలోనూ ప్రగతి శీల భావాలతో కథలు, కవిత్వం రాస్తూ ఉంటారు.
ఓ సందర్భంలో వారిని కలిసినప్పుడు నా కవితా సంపుటి త్వరలోనే వస్తోంది సర్‌, అనగానే నేను ఒకింత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఎందుకంటే కవిత్వమంటే నాకు ప్రాణం గనుక.వారిలో ఒక ప్రగతిశీల కవితా హృదయం ఉందని ఇదిగో ఈ ”నీలకురింజి సముద్రం” చదివాకనే అర్థమైంది. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, తండ్రి నుంచి తనకు అలవడిన వామపక్ష భావజాలం కావచ్చు. మెట్టినింట కూడా అదే భావజాలంతో, ఉద్యమ స్ఫూర్తితో సహచరుడు, వారి కుటుంబ నేపథ్యమంతా పోరాట చైతన్యం కావచ్చు.. చదివిన పుస్తకాల ప్రభావం, వారిని అభ్యుదయ రచయిత్రిగా, కవయిత్రిగా సీమ సాహిత్యం అక్కున జేర్చుకుంది. వారి అమ్మాయిలు ధాత్రి, చైత్ర కూడా వీరి భావాలను పుణికి పుచ్చుకున్న వారే.
ఈ కవితా సంపుటి ప్రారంభంలోనే ”ఇది నా ప్రేమ కవిత్వం. నేను ప్రేమించిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను ప్రేమలో పడేసిన సహజ ప్రకృతి కోసం, ఏ విధమైన అంతరాలు, అసమానతలు, వివక్షకు చోటులేని ప్రపంచం మీద ప్రేమ కోసం, సామాజిక మార్పు .. మీద అపారమైన, ఎల్లలు లేని ప్రేమ కోసమే ఈ నా ప్రేమ కవిత్వం అంటూ తనదైన మేనిఫెస్టో ప్రకటించారు. ”చిన్ని మిణుగుర్లకు తోడుగా నేనూ/ చీకటి చీకట్లతో పోరాడతా/ ప్రభాతవేళకు వెలుతురు వాకిలి తీసి నిలబడతా”నంటున్న ఆత్మ విశ్వాసం ఈ కవయిత్రిది.
నాన్న విశాల హృదయాన్ని నీల కురింజి సముద్రంతో పోల్చి చెప్పినట్లే, అమ్మను లోకం గుర్తించని విద్యావేత్తగా, అక్షరాలు నేర్పించిన తొలి గురువుగా, ఆమె జ్ఞాపకాన్ని వెచ్చని బొగ్గుల పోయ్యితో పోల్చడం నాకు నచ్చింది. ”బొగ్గులు బూడిదగా మారినట్లు/ అమ్మ కూడా మట్టిలో కలిసిపోయింది/ అయినా అమ్మ జ్ఞాపకం/ ఇలా హృదయాన్ని వెచ్చగా ఉంచుతూనే ఉంది”.
ఇవాళ్టి సమాజంలో కులం, వర్ణం, వర్గవైరుధ్యాలు పైకి ఎంత సాప్ట్‌గా కనిపించినా, మనకు తెలియకుండానే మనకంటే ముందుగానే ప్రయాణిస్తూ మన కాళ్ళ కడ్డం పడుతూనే ఉన్నాయి. యాభై ఏళ్లకు పూర్వం ఈ వివక్ష ఎంత యథేచ్ఛగా తన ప్రతాపం చూపించేదో ”మనోళ్లే నా” కవితే సాక్ష్యం. ”ఒక రోజు పుస్తకం కోసం తన ఇంటికొచ్చిన స్నేహితురాలితో పక్కింటామె ఆరా. మనోల్లేనా?/ అవును మా క్లాసే/ అది కాదు నే నడిగేది/ మన కులమేనా?’ ఇలా ఉంటుంది ఆనాటి పల్లెటూళ్ళ వ్యవహారం. ఆమెకు పెంకెగా సమాధానమయితే ఇచ్చి నోరు మూయించింది గానీ, తన మనసులో కలవర పెడుతున్న తుఫానుకు ఇలా బదులిచ్చింది.
”మనల్ని మానవ సమూహం నుండి విడదీసే
ఈ తోకలు కొమ్ములు ఇంకా అవసరమా
మన పిల్లలకైనా లేకుండా చేద్దాం
అంతా మనవాళ్లేనని నేర్పిద్దాం”
యోగాసనాలు పేరుతో కార్పొరేట్‌ వ్యంగ్యాసనాలు బాగున్నారు. మరో కవితలో సీమ చీకటి బతుకులను పరామర్శిస్తూ నీతిమాలిన నేతల్ని నిలెయ్యాలని పిలుపు నిస్తున్నారు.
”పంట పొలాల్లో పచ్చటి కాంతులు నిండితే
పట్నాల్లో నిశీధి కూపాల లోగిళ్ళు మాక్యాల
మీకు శాతనైతే కరువును సీమ దాటించాల
మీకు దమ్ముంటే వలసలను బండెక్కించాల
మీకు రోషముంటే నీతిమాలిన నేతలను
నిలేయ్యాల… వెలేయ్యాల…” అని నిలేశారు.
ఆసిఫా ఉదంతాన్ని ప్రస్తావిస్తూ… ”బాల్యపు నందనవనాన్ని కకావికలం చేసిన/ క్రూర మృగాలను తరిమికొట్టడానికి / జెండా కున్న కర్ర తిరగబడుతుంది.” అన్నారు. తల ప్రాణం తోకలోకి ఎలా చేరుతుందో, ఒక ఇల్లాలిగా, ఉద్యోగినిగా దినచర్యలో ద్విపాత్రాభినాయాన్ని గురించి వ్యాఖ్యానిస్తారు.
”ఇంట్లో అందరి ఆకలిని తీర్చిన ఓ ఇల్లాలు
తన ఆకలిని మాత్రం తీర్చుకునే తీరిక లేక
డబ్బాలో పెట్టీ మూత పెట్టేసినట్లు ఉంటుంది”
కవిత్వ మెలా పుడుతుంది? కవిత్వ మెలా రాయాలి? ఎలాంటి అనుభూతి కవిత్వ మవుతుంది? వాక్యాల మీద వాక్యాలు పేరిస్తే కవిత్వమవుతుందా? ఎంతటి ప్రసవ వేదన అనుభవిస్తే కవిత్వ మవుతుంది? ఈ ప్రశ్నలకన్నిటికీ ఒక సమాధానం ‘కొత్త సుగంధం’ కవిత. ”అల్లిబిల్లి పదాల పూలను సౌరభాల మరువాన్ని/ పొందిగ్గా కూర్చితే తయారయ్యే/ కొత్త సుగంధం కవిత్వం కావాలి/ మరో నాసికాగ్రాన్ని చేరి స్పందన కలిగించే / భావ వారధి కావాలి కవిత్వం / కడుపులో వికారం కాదు / మెదడులో సంఘర్షణ పుట్టించాలి కవిత్వం!/ సానుభూతి కవిత్వమక్కర్లేదు./ ఇంటింటా పుస్తక వనం, పొత్తాల తోటగా శోభాయమానంగా వర్ధిల్లాలి” అంటారు.
ప్రేమంటే చేదు అనుభవాల కొమ్మల్లోంచీ పుట్టిన తీయని మకరందమనీ, ఏడాదికో తద్దినం కాదని, అది నిరంతర వసంతమని, అలుపెరుగని పయనమని.. వివరించారు ఈ కవయిత్రి.
డిగ్రీ పరీక్ష రాయడానికి పెయింటింగ్‌ పనిచేసి చేతులు కూడా సరిగ్గా శుభ్రం చేసుకోకుండా వచ్చిన ఓ విద్యార్థిని చూశాక, అతను పరీక్ష ఎలా రాశాడో తెలియలేదు కానీ
మన కవయిత్రి కలానికి కవితై మెరిశాడు. ఈ సంపుటిలో వాన గీతాలున్నారు, ప్రేమ లేఖలు న్నారు. ఆకాశ మంత ప్రేమలున్నారు. సుద్ద ముక్క లున్నారు. తప్పిపోయిన కోయిలలున్నారు. కొత్త సుగంధాలున్నారు. అనుభూతుల, అనుభవాల వివేచనలున్నారు. కవితలన్నీ చదివాక నా అవగాహనలో – ఇందులోని కవిత లన్నీ వస్తు ప్రధానంగా కనిపిస్తారు. కవితలన్నీ సామాజిక నేపథ్యం లోంచే మాట్లాడుతున్నారు. కథల మీద మక్కువ కాబోలు కొన్ని కవితల్లో కవితాత్మక శైలి కంటే కథన శైలి కనిపిస్తుంది. కొన్ని కవితలు ప్రాంతీయ నుడికారంతో, అనంత యాసలో నడుస్తాయి. కొన్ని నాస్టాల్జియా కవితలు బాగా ఆకట్టు కుంటారు. కథా రచయిత్రిగా, కవయిత్రిగా, అధ్యాపకులుగా, సామాజికురాలిగా తన అనుభవాలను, వర్తమాన సామాజిక చలనాలను చక్కగా కవితాత్మకంగా రికార్డు చేసిన ప్రగతి గారికి మనసారా అభినందనలు.

– డా.రాధేయ

➡️