సంకెళ్లల్లో ప్రజాస్వామ్యం..

udha bharadwaj interview from phansi yard uri vardu nundi book a
  • సుధా భరద్వాజ్‌ మానవహక్కుల న్యాయవాది, క్రియాశీల సామాజిక కార్యకర్త. 2018 ఆగస్టు 28 తేదీన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నిర్బంధించబడి, మూడేళ్ళ మూడు నెలలు జైలు జీవితం గడిపారు. భీమా కొరేగావ్‌ కేసులో నిర్బంధించిన 16 మందిలో ఆమె ఒకరు. 62 సంవత్సరాల ఈ మహిళ, తాను తప్పకుండా నింద నుంచి బయటపడగలనని నమ్మకంగా ఉన్నారు. బెయిలుపై వెలుపలికి వచ్చిన తరువాత, ‘ఫాంసి యార్డ్‌ నుంచి’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఒక కార్మిక సంఘ కార్యకర్తగా, పోలీసుల అణచివేతను దగ్గరి నుంచి పరిశీలించారు. ముంబైలోని ఆమె నివాసంలో, ఫ్రంట్‌ లైన్‌ ప్రతినిధితో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ సంక్షిప్త రూపం ఇది.

 

  • మీరు మీ పుస్తకాన్ని ‘అన్యాయంగా బంధించబడిన వారికి’ అంకితం ఇచ్చారు. మీ జైలు జీవితం న్యాయం పట్ల మీ అభిప్రాయాన్ని ఎలా మార్చింది? లేదా ఎలా ప్రభావితం చేసింది?

నేను జైలులో ఎదుర్కొన్న సమస్యలేవీ నాకు తెలియనివి కావు. పేద ప్రజలు ఎల్లప్పుడూ కాఠిన్యాన్ని ఎదుర్కొంటుంటారు. అణగారిన ప్రజలకు కోర్టుల సానుభూతి ఉండదు. ప్రభుత్వాలు అందచేసే న్యాయసహాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. జైలులో ఉన్నవారిలో ఎక్కువశాతం మహిళలు, అత్యంత పేద గ్రామీణ మహిళలు. వారికెంత అన్యాయం జరిగినా కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాలన్న ఆలోచన కూడా రాదు. అదొక ప్రత్యామ్నాయంగా చూడరు. ఏడేళ్ల శిక్ష తరువాత జైలు లోపల వ్యవసాయ పనులకు అనుమతినిస్తారు. అలా పనికి వెళ్లినందుకుగాను శిక్షలో మినహాయింపులుంటాయి అందువల్ల వారు క్రమం తప్పకుండా పనులకు వెళ్తుంటారు. ఎండలో, వానలో, చలిలో కూడా. చివరికి వారి భరోసా వారి శ్రమే. బయట ప్రపంచంలోని వారి జీవితాలలోలాగే, ఇక్కడ కూడా వారు ఆధారపడగలిగేది వారి మీదే. అదే నన్ను మరింతగా కలచివేసింది.

  • ‘కార్మిక సంఘాల్లో పనిచేయాలంటే నిబద్ధత తప్పనిసరి’ అని మీరంటారు. మీరెందుకు కార్మికసంఘంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు? ప్రఖ్యాత కార్మిక సంఘ నాయకుడు శంకర్‌ గుహ మిమ్మల్ని ప్రభావితం చేశారా?

నేను కార్మిక సంఘాల్లో పనిచేయడానికి ప్రధానమైన రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మానసిక కారణం, రెండోది తాత్విక కారణం. అయితే, రెండో కారణమే ప్రధానమైనది. నియోగి నేను నా నిర్ణయాలను ఎలా అమలుచేయాలో దారి చూపారు. చత్తీస్‌ఘర్‌లో ఆయన నడిపే చత్తీస్‌ఘర్‌ ముక్తి మోర్చా, కేవలం ఒక ఆర్థిక హక్కులను మాత్రమే సాధించిపెట్టే సంఘం కాదు. అనేక రకాల పనులు చేసేది. మౌలికంగా పేదప్రజలు తమ గుర్తింపును సాధించుకోడానికి పనిచేసింది. జీవితంలో ఏదో ఒకటి సాధించుకోవాలని, ఉన్నతమైన గమ్యం కలిగి ఉండాలని నాలాంటి మధ్య తరగతి నుంచి వచ్చినవారికి చిన్నతనం నుంచి నూరిపోస్తుంటారు. కానీ, కార్మికవర్గంలోని పిల్లలకి ఇటువంటి వ్యక్తిగత గుర్తింపులు ఏవీ ఉండవన్న విషయం మనం విస్మరిస్తాం. ‘మీకంటూ ఒక సంఘం లేనంతవరకు మీకు ఏ రకమైన గుర్తింపూ ఉండదు అని వారి నమ్మకం’. సమూహంలో ఉండాలనే ఆ భావన కీలకమైనది.

  • శక్తివంతమైన శత్రువులను తయారు చేసుకున్నందుకు మీకెప్పుడూ భయం వేయలేదా ?

ఈ కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసేవారు నా సహచరులను కలవడానికి మా ఆఫీస్‌కి వచ్చేవారు. మేము పెట్టిన కేసులను వెనక్కి తీసుకోమని బెదిరించేవారు, భయపెట్టేవారు. నేను మాత్రం ప్రత్యక్షంగా అటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. అటువంటి బెదిరింపులను నేను మానవ హక్కుల సంఘం కార్యదర్శిని (పియుసిఎల్‌) అయిన తరువాతే ఎదుర్కొన్నాను. నా ఫోన్‌ టాప్‌ చేయబడేది. స్థానిక ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేసేవారు వచ్చి ”ఈ కేసులో ఏం జరుగుతున్నది? మీరేమైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా?” వంటి ప్రశ్నలు వేసేవారు. నేను వాళ్లందరితో అన్ని విషయాలూ పంచుకునే దానిని. ఎవరికీ భయపడలేదు. బహుశా నేను ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండడం వల్ల కావొచ్చు.

  • మీరు చత్తీస్‌ఘర్‌ని మీ ఇల్లని చెప్పుకుంటుంటారు. కానీ, అక్కడికి వెళ్లి చాల రోజులయింది. ఈ ప్రభావం మీ మనసుపై ఎంతవరకు పడింది ?

నిజం చెప్పాలంటే- నేను ఇప్పుడు బహిష్కతురాలిని అయినట్టు భావిస్తున్నాను. నేను చత్తీస్‌ఘర్‌లో 1986 నుంచి 2016 వరకు ఉన్నాను. దాదాపు 30 ఏళ్ళు… నా జీవితంలో ఎక్కువ భాగం అక్కడే గడిచింది. చత్తీస్‌ఘర్‌ ముక్తి మోర్చా నా ఇల్లు. అక్కడ ఉన్న కార్యకర్తలంతా నా వాళ్లే. అందుకనే ‘నువ్వు చిన్న ఖైదు నుంచి పెద్ద ఖైదుకు వచ్చావని’ హాస్యమాడుతుంటారు. మళ్ళీ అక్కడికి వెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.

  • కార్మికుల మనసులను జయించగలిగితే, వాళ్ళు మిమ్ములను నమ్ముతారని మీరంటారు. జైలులో కూడా మీ అనుభవం ఇదేనా ?

అవును. నూటికి నూరుశాతం ఇదే. నేను బైకుల్లా జైలుకి వెళ్ళినప్పుడు అక్కడి నేరస్థులు తమకు సహాయం చేయమని అడిగేవారు. నేను వారిని తమ ఛార్జ్‌షీట్‌లు చూపించమని అడిగేదానిని. మొదట్లో వారు కొంత అనుమానించేవారు. అది సహజమే కదా! జైలులో స్నేహాలు ఉంటాయి, కానీ క్రూరత్వం, పోసుకోలు కబుర్లు ఎక్కువ. అందువల్ల అక్కడున్నవారు తమ ఛార్జ్‌షీట్లను దాచుకుంటుంటారు. కానీ, నేను వారి ఛార్జ్‌షీట్ల గురించి ఎవరితోనూ చెప్పనని, చర్చించనని, ఆట పట్టించనని నమ్మకం కుదిరిన తరువాత నా దగ్గరికి రావడానికి వరుసలలో నిలుచున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు నేను దరఖాస్తులు, న్యాయవాదులకు, కోర్టులకు ఉత్తరాలు రాస్తునే ఉండేదానిని.

 

  • ‘కోర్టులు, నేరస్తులను పితస్వామ్య భావజాలంలోనుంచి చూసి తీర్పులిస్తాయని’ మీరన్నారు. ఆ వ్యవస్థని ఏమేరకు సంస్కరించాల్సిన అవసరం ఉంది?

ఈ మధ్యనే సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి, డి వై చంద్ర చూద్‌, లింగ వివక్ష మీద ఒక చిన్న పుస్తకాన్ని వెలువరించిన సందర్భంలో, ‘న్యాయాధీశులేమీ ఆకాశం నుంచి ఊడిపడరు. వారూ సమాజం నుంచే వస్తారు. పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నందువల్ల, అది కూడా ఉన్నత మెజారిటీ కులాల నుంచి వచ్చినందువల్ల, నేరాలను, నేరస్థులను వారు చూసే చూపులో తేడా ఉంటుందని’ అన్నందుకు, క్రమంగా వైవిధ్యాన్ని అంగీకరిస్తునందుకు నేను సంతోషిస్తున్నాను. మరోవైపు చూస్తే మనం ఈ బాధితులకు మరింత సమర్ధవంతంగా రక్షణ అందించాల్సిన అవసరం ఉంది . నిజానికి బార్‌కి బెంచ్‌కి మధ్య జరిగే సంవాదం వల్ల చట్టాలు ఏర్పడతాయి. కేవలం బెంచ్‌ల వల్ల కాదు. బార్‌ కూడా శక్తి వంతంగా చర్చించాలి. అది అన్ని పార్శ్వాలను ప్రతిబింబించగలగాలి. అప్పుడే మంచి తీర్పులను న్యాయాధీశులు వెలువడించగలుగుతారు. మనం మన న్యాయ సహాయ వ్యవస్థ ద్వారా సరైన న్యాయం అందించే న్యాయవాదులను పెంచుకోవాలి. అప్పుడే, పేదలకు, అణగారిన తరగతులకు మెరుగైన రక్షణ కల్పించడానికి అవకాశాలు ఉంటాయి.

 

  • ఈ పుస్తకంలోని మీ కథనాల్లో కులం, వర్గం, కులపెద్దల పెత్తనం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉన్నత వర్గాల మహిళలు మానవత్వంతో ఉన్నట్టు చిత్రీకరించబడతారు. దళితులూ, ఇతర వెనుకబడిన తరగతులలోని వారు శుభ్రపరిచే పనులకి వినియోగించబడినట్టు చెప్తుంటారు. ఈ పరిస్థితి మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?

ఇప్పుడిప్పుడే కదలిక మొదలైనట్టు అనిపిస్తోంది. వేగంగా మార్పు తీసుకురావాలని చేసిన మండల్‌ సిఫారసులు, దళితుల దఢ వ్యక్తీకరణలు తీవ్రమైన ప్రతి చర్యలను ఎదుర్కొన్నాయి. దఢ వ్యక్తీకరణలు పెరగగానే హింస పెరిగింది. ఇప్పడు కుల గణనం బయట పడగానే, ఇప్పటివరకు కనిపించకుండా తెరవెనక దాచి ఉంచింది స్పష్టంగా కనిపించడం మొదలయింది. వీటన్నిటి ప్రభావం భవిష్యత్తులో తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రభావాలు నెమ్మదిగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి.

 

  • జైలులో మతవివక్ష కనిపిస్తుందా ?

కనిపిస్తుంది. ఇది రెండు విరుద్ధ రీతుల్లో కనిపిస్తుంది. జైలులో మైనారిటీ మతస్థులు ఎక్కువగా ఉంటారు. బయట రెండు మతాల మధ్య ఉన్న నిష్పత్తికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. వారంతా ఐక్యంగా ఉంటారు. తమ హక్కులను కాపాడుకుంటుంటారు. ఉదాహరణకి జైలులో – బహుశా బ్రిటిష్‌ కాలం నాటి నుంచి అలవాటుగా ఉండి ఉంటుంది – రోజా లాంటివి పాటిస్తారు. అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ఆ రోజుల్లో వంటలు తొందరగా చేస్తారు, సెహ్రి పంపకాలు చేస్తారు. ఆ తరువాత మళ్లీ గదుల్లో బంధిస్తారు. ఈ వెసులుబాటు వల్ల ముస్లిములు కానివారు కూడా ఎంతమంది రోజా చేస్తారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ముస్లిములు కూడా గణపతి పూజలో పాల్గొంటారు. అందరూ క్రిస్మస్‌లో పాల్గొంటారు. అందరూ సంతోషంగా ఈ సందర్భాల్లో కలుసుకుంటారు. స్నేహభావంతో మెలుగుతారు. తమను జైలు నుంచి బయటికి పంపించే ఏ దేముడినైనా ప్రజలు కొలవడానికి సిద్ధపడతారు.

 

  • చాల సందర్భాల్లో మహిళలు జైలులో ఉండడానికి కారణం మగవారు చేసిన నేరాలే అని మీరన్నారు. వివరిస్తారా?

జైలులో చాలామంది మహిళలు ‘చట్టబద్ధంగా ఉన్న బందీలు’ అని నేనంటాను. వ్యవస్థ వారిని బంధించి ఉంచింది- వారి భర్తలు, స్నేహితులు, కొడుకులు పారిపోవడం వల్ల. నేరంలో వారి వంతు పాత్ర నామమాత్రంగా ఉంటుంది. కొన్నిసార్లయితే, ఇటువంటి నేరం జరిగిందని కూడా వారికి తెలియదు. ఇటువంటి వారినందరిని జైలులో పెట్టి ప్రయోజనం లేదు. కానీ నేరం తీవ్రత దష్యా వారికి బెయిలు కూడా రాదు. మహిళలను జైలులో పెట్టడమంటే వారి పిల్లలను కూడా బంధించటమే!

 

  • మీరు జైలులో మూడేళ్ళ గడిపిన తరువాత బయటికి వచ్చి చూసిన భారతదేశం ఏ మేరకు మారింది?

నేను బయటికి వచ్చాను గాని, ఇతర రాష్ట్రంలో బయట ఉన్నాను. మేము జైలులో ఉండగా అనేక సంఘటనలు జరిగాయి. మోడీ ప్రభుత్వం రెండోసారి ఎన్నికై అధికారం చేపట్టింది. కొత్త శ్రామిక చట్టాలు అమలయ్యాయి. పాతవాటిని రద్దు చేయడం జరిగింది. సమాజం మరింతగా మత ప్రాతిపదికన కేంద్రీకతమైంది. మరింతగా కుంచించుకు పోయింది. ప్రజాస్వామిక స్థానం కుంచించుకు పోయింది-విశ్వవిద్యాలయాల్లో అయినా, మీడియాలో అయినా. నేను చత్తీస్‌ఘర్‌ వెళ్ళడానికి వీలు లేదు. నాకు చిరపరిచితమైన నా రాష్ట్రానికి వెళ్లగలిగి ఉంటే, అసలైన మార్పులు ఏ మేరకు జరిగాయో చెప్పగలిగి ఉండేదానిని.

udha bharadwaj interview from phansi yard uri vardu nundi book a

(‘ఫ్రమ్‌ ఫాంసి యార్డ్‌ ‘ పుస్తకాన్ని ‘ఉరి వార్డు నుంచి’గా కె.ఉషారాణి తెలుగు అనువాదం చేశారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురించింది. ఈ పుస్తకావిష్కరణ 4.1.2024వ తేదీన విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌లో జరుగుతుంది.)

➡️