అతి శుభ్రతా ప్రమాదమే..!

Feb 4,2024 09:40 #Health Awareness, #Sneha
about ocd disease Obsessive-compulsive disorder

ఒసిడి ఉన్న వ్యక్తులకు ముందస్తు మరణాలు సంభవిస్తున్నాయని, కొత్త అధ్యయనం వెల్లడించింది. స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒసిడి వలన అకాల మరణాలు సంభవించే అవకాశం 82 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది నివేదిక. ఈ పరిశోధనలు మరింత నిశితంగా, త్వరితంగా జరగవలసిన ఆవశ్యకత ఉందని నొక్కి చెబుతున్నారు నిపుణులు.

ఒసిడి (అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌) అంటే ఒక మానసిక రుగ్మత. బాధితుడికి అసమంజసమైన ఆలోచనలు, భయాలు ఉంటాయి. ఈ ఆలోచనలు రోజువారీ జీవన కార్యకలాపాలకు ఆటంకంగా ఉంటాయి. ఒసిడి ఉన్న వ్యక్తులకు ఉండే లక్షణాలను చూస్తే.

  • అతిశుభ్రత, వ్యవస్థీకృతంగా అంటే అందరూ తుచ తప్పకుండా నియమ నిబంధనలతో ఉండాలనే అభిప్రాయాలను వ్యక్తపరచటం
  • ప్రతి వస్తువును నిర్ణీత ప్రదేశంలో ఉంచడం గురించి నిరంతరం విపరీతంగా ప్రవర్తించడం
  • స్టవ్‌ తీసేశానా లేదా అని, తాళము వేశానా లేదా అని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం
  • ఎక్కువసార్లు స్నానం చేయడం, పదేపదే చేతులు కడుక్కోవడం
  • నిరంతరం తననెవరో గమనిస్తున్నట్లు, తనకు ఇబ్బంది కలిగిస్తారని భావించి.. వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం
  • కొన్ని మూఢ నమ్మకాలను గాఢంగా నమ్ముతారు. ఒక్కోసారి వారు నమ్మే విషయాన్ని రుజువు చేయడానికి విపరీతంగా రియాక్ట్‌ అవుతారు. అందుకోసం తనకు తాను హాని కలిగించుకోవడానికిగానీ, ఇతరులకు హాని చేయడానికిగానీ వెనుకాడరు.

కొన్ని సందర్భాల్లో రోగికి తన పరిస్థితి గురించి తెలుస్తుంది. అలాంటప్పుడు తన ప్రవర్తనలను సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఒక్కోసారి అది వేరేవిధంగా దారితీసే అవకాశం ఉంది. తన పరిసర వాతావరణాన్ని ప్రశాంతంగా, అనుకూలంగా ఏర్పరచుకోగలిగితే పరిస్థితి బాగానే ఉంటుంది. అలా కాని పక్షంలో ఆత్మహత్యలకు పాల్పడేందుకు సిద్ధపడే ప్రమాదం ఉంది. ఒసిడిపై పరిశోధనలు పుష్కలంగానే జరుగుతున్నప్పటికీ ఇవే కారణాలని చెప్పడానికి సరైన సమాచారం లేదంటున్నారు నిపుణులు. నిర్బంధ కట్టుబాట్లు, మూఢ విశ్వాసాల అనుచిత ఆలోచనలు కొంతవరకు కారణమంటున్నారు. ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు చేయడం, ఇతరులతో దూకుడుగా ప్రవర్తించడం, చేసిన పనినే పదేపదే చేయడం, ఇతరులూ అలానే ఉండాలనడం ఈ లక్షణాలతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటప్పుడు సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతేకాదు. ఒసిడి వలన కొన్ని ఇతర అనారోగ్య కారణాలు సంభవించి మరణానికి దారితీస్తున్నాయి. ఊపిరితిత్తుల వ్యాధులు (73 శాతం), మానసిక లోపాలు (58 శాతం), మూత్రపిండ, పునరుత్పత్తి అవయవాల వ్యాధులు (55 శాతం), ఎండోక్రైన్‌, జీవక్రియకు సంబంధించిన వ్యాధులు (47 శాతం), రక్త నాళాలు (33 శాతం), నాడీ వ్యవస్థ (21 శాతం), జీర్ణ వ్యవస్థ (20 శాతం) (2.5 శాతం) రక్తప్రసరణ వ్యవస్థలలోనూ వ్యాధులు సంభవిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యాధుల తీవ్రత కారణంగా సహజ మరణాలు సంభవిస్తే.. దీనికి ఐదు రెట్లు (అనుమానాలు, ఆందోళన, నిరాశ, వ్యతిరేక ఆలోచనల వలన) ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. అంతేకాక ఈ వ్యక్తులు రోడ్డు ప్రమాదాలకు గురికావడం.. లేదా ఎక్కడైనా తెలియకుండా పడిపోవడం వలన కూడా మరణాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

నాలుగు దశాబ్దాలుగా సాగిన పరిశోధనలో ఒసిడితో బాధపడుతున్న కొంతమంది వ్యక్తులను మామూలు వ్యక్తులతో పోల్చి పరిశోధనలు చేశారు. మనిషి సగటు ఆయుర్దాయానికీ, వీరి జీవిత కాలానికీ గుర్తించిన వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పది సంవత్సరాల ముందే మరణానికి గురవుతున్నారు. ఇవి జన్యుపరమైనవి మాత్రమే అనడానికీ లేదు. పరిసరాలు, ఆర్థిక ప్రమాణాలు, సామాజిక, పర్యావరణ కారకాలు ఇలా అనేకమైనవి ఒసిడికి కారకాలుగా విశదమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

➡️