అమ్మమ్మ ఇల్లు

‘నేను జనవరిలో మన వేపు వెడదాం అనుకుంటున్నా. అమ్మని చూసి అలాగే మా స్నేహితుల కలయిక కూడా ప్లాన్‌ చేసాం ఈ సారి కేరళలో. నువ్వు ఒక మూడు వారాలు ఇల్లు చూసుకోవాలి ముఖ్యంగా నీ టీనేజి అమ్మాయిలని’ అని చెప్పాను నా సహచరుడు శ్యాంకి.

అమ్మ పొద్దున ఫోన్‌ చేసింది. చాలా విషయాలు చెప్పింది. నా క్లాస్‌ మేట్‌ రఫీ కూడా ఫోన్‌ చేసాడు మిత్రుల కలయిక గురించి.

‘కొంచెం తీరిగ్గా రావాలి నువ్వు. మనం మావూరెళ్ళాలి’ అని చెప్పింది అమ్మ.

ఎందుకని అడగలేదు నేను. ఆవిడకేదో ప్లాన్‌ వుండే వుంటుంది. శ్యాం కుక్కర్‌లో అన్నం మామిడికాయ పప్పు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. వంటింట్లో ఐలెండ్‌ మీద కంప్యూటర్‌ పెట్టుకుని ఆఫీస్‌ పని చూసుకుంటూనే టిక్కెట్లు ఎందులో సౌకర్యంగా అందుబాటులో వున్నాయో వెతకడం మొదలుపెట్టాను. అలా వచ్చాను అమ్మదగ్గరకి. నాన్న పోయాక అమ్మ ఒక్కతే వుంటుంది వాళ్ళు ఉద్యోగాలు చేసి కట్టుకున్న ఇంట్లో, ఆ వూళ్ళో.

‘మామయ్యల పిల్లలు ఇల్లు అమ్ముతున్నారట. సద్గుణ ఫోన్‌ చేసింది. బేరాలు జరుగుతున్నాయట. నేను సద్గుణనే కొనమన్నాను కొంచెం అటోఇటో’ అంది అమ్మ. సద్గుణ అమ్మ బాల్య స్నేహితురాలు. అమ్మ పుట్టి పెరిగిన ఆ ఇల్లు మామయ్యలకి వచ్చింది. అమ్మ కేమీ రాలేదు. ఆ పల్లెటూర్లో ఎవరికీ అక్కర్లేని ఇల్లు అది ఇప్పుడు. పెద్ద మామయ్య పోయాక చాన్నాళ్ళుగా ఖాళీగా పడి వుంది. తనకు కాని దాని గురించి ఎందుకు పట్టించుకుంటోందో అర్థం కాలేదు.

‘నీ తిరుగుళ్ళు కానిచ్చి ఇరవయ్యో తారీఖుకి వచ్చెరు. ఆరోజు రిజిస్ట్రేషన్‌’ అని కూడా అంది. రిజిస్ట్రేషన్‌కి నేనెందుకో! ఆవిడ రమ్మంది. సరేనన్నాను. అప్పటికి నాకేం పనుల్లేవు. అమ్మమ్మ ఇల్లు చూసి చాలా కాలం అయింది.. నాకూ ఇష్టం, ఆ వూరు ఆ యిల్లు. చాలా హడావుడిగా బయలుదేరతీసింది. దగ్గర కొంత డబ్బు కూడా ఉన్నట్లుంది బహుశా సద్గుణకి అప్పుగానేమో. అందరినీ విస్మయంలో ముంచెత్తడం అలవాటే ఆవిడకి.

మామయ్యల పిల్లల్ని, మిగిలిన ఒక మామయ్యని చూసి ఆనందపడ్డాను. అందులో ఇద్దరు మేనమామ బిడ్డలు నాకు ఫేస్‌బుక్‌లో స్నేహితులు. పెళ్ళిళ్ళలో మాత్రమే కలిసాం. అప్పుడు తెలిసింది రిజిస్ట్రార్‌ ఆఫీస్లో.. ఇల్లు కొనేది సద్గుణ కాదు. మా అమ్మ. అదీ నాపేరున అని.

‘ఇప్పడిదాకా చెప్పనే లేదు తెలివిగా బేరాలాడింది!’ అని కొందరు ముఖం చిట్లిస్తే, కొందరు నవ్వులు అతికించుకున్నారు. సంతకాలు, డబ్బు లెక్కలు అయ్యాక తాళం చెవులు చేతికొచ్చాయి. కలగలసిన భావాలతో మొక్కుబడి నవ్వులతో కాఫీలు తాగేసి అందరూ సెలవు పుచ్చుకున్నారు. కను చీకటి పడుతుండగా వెళ్లి తాళం తీసి వసారాలో కూచోగానే ముఖద్వారానికెదురుగా వున్న అమ్మమ్మ తాతయ్యల ఫోటో తీయించి తుడిపించింది.

అమ్మమ్మ చామనచాయకన్నా ఓచాయ తక్కువ. మూడుపుష్యరాగాల ముక్కుపుడక. దాని వెలుగు పెదాల మీద పడి, ఆమె నవ్వుకు ఒక మెరుపు తెచ్చింది. ఏడు తెల్లరాళ్ళ దిద్దులు. తెల్లని ముచ్చలముడి. ఆ తెలుపు అమ్మమ్మకి ఒక ‘ఆరా’ లా వుండేది. రెండు చేతులకు ఎరుపు ఆకుపచ్చ మట్టిగాజులు. గుంటూరు నేత చీర.

‘ఎంత బాగుందో అమ్మమ్మ’ అన్నాను.

అమ్మమ్మ గారాబం, ఆమె వంటలు, ఆమె చెప్పే సామెతలు అన్నీ గుర్తే. ప్రతి సందర్భానికీ ఒక సామెత ఆమె నాలుక చివరే వుండేది. ఏ సామెతా జ్ఞాపకం రాకపోతే ‘ఏదో సామెత చెప్పినట్టు’ అనేది.

అమ్మమ్మను గురించి ఒక్కొక్క విశేషం దృశ్యమానం చేస్తోంది అమ్మ. ‘నిటారు నడక, పాలు పిండి, పిండి దంచి, పిండి విసిరి, పప్పురుబ్బి, చేదలకొద్దీ నీళ్ళు తోడి మొక్కల్ని, పిల్లల్ని, గేదెల్ని పెంచిన బలమైన చేతులు. మనిషి నిలువెల్లా తెలివే! బ్రతుకు తెలివి. బ్రతికించే తెలివి’ అమ్మ కళ్ళు తుడుచుకుంది. ఆ కంటి చెమ్మ విచారంతో వచ్చింది కాదు. అందులో గర్వంతో కూడిన ఒక మెరుపు వుంది.

‘ఆ తరం ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు. చదువులేని అమాయకులు. మగవాళ్ళు చెప్పినట్టు విని పడి వుండే వాళ్ళు. తాతయ్యకి కూడా నోరు ఎక్కువే పాపం అమ్మమ్మ ఆయన చెప్పినట్టే వినేది. ఏం తెలివో ఏమో’ అంటూ వుండగా అందుకుని, ‘ఇంటి ముందు ఈ వేప చెట్టు, ఇంటి వెనక ఆ మామిడి చెట్టు ఎంత బలంగా నిలబడి వున్నాయో చూసావా. ఎండ వానలకి తుఫానులకి తట్టుకుని. వాటి వేళ్ళు భూమిలోకి లోతుగా పాతుకున్నాయి బలంగా స్థిరంగా, అమ్మమ్మ అలాంటిదే. చదువు ఐదో క్లాసే. అయితేనేం… ‘ అని ఆగింది.

నాలుగు గదుల ఇల్లు. చుట్టూ స్థలం. ముందు రెండు కొబ్బరిచెట్లు, ఒక వేప చెట్టు. వెనక మామిడి చెట్టు, కరివేపాకు- మునగ చెట్లు. వాకిట్లో బంతిపూలు, చంద్రకాంతలు.. డాబాపైకి పాకిన సన్నజాజి. రెండు గేదెలు రెండెకరాల పొలం. నలుగురు పిల్లలు.. ప్రహరీగోడ వెనక ఒకవైపు ఆరినవీ మరొకవైపు పచ్చి పిడకలు. దక్షిణం వైపు గడ్డివామి పైకి పాకిన సొర తీగ. పెరట్లో దొండ పందిరి. గోడవార బెండమొక్కలు, గోంగూర తోటకూర తీగబచ్చలి. నా బాల్యంలో ఇల్లు నాకు ఎంత గుర్తో! అమ్మ చెబుతోంది వాళ్ళమ్మ శ్రీలక్ష్మమమ్మ గురించి…

***************************************************************

మధ్యాహ్నం అన్నాలు తిని అంట్లు బయటేసి. పొయ్యిలో మండి ఆరిన కట్టె పేళ్ళ కొసలలో వున్న బొగ్గులు ఎండలో దులిపి, పొయ్యి అలికి, పడమటేపు గోడన ఆరిన పిడకలు వొలిచి ఎండలో వేసి, ఆ చేత్తోనే మూలనున్ప పేడకుప్పలో ఇంత ఊక కలిపి అదేగోడకి పిడకలు కొట్టి, కొంచెం పేడలో బొగ్గునుసి కలిపి ఉండలు చేసి ఎండ బెట్టి, అక్కడున్న చెంబుతో నీళ్ళతొట్టి మూత మీద చిన్న భరిణెలో పెట్టిన సబ్బు ముక్కతో చేతులు కడుక్కుని, ఓ గంట నడుము వాలుద్దామని దక్షిణపు గదిలోకి వస్తోంది శ్రీలక్ష్మమ్మ. అంతలోనే ముందు వసారాలో నుంచి పెద్దగా మాటలు వినపడ్డాయి.. ఒక గొంతు ఆమె పెనిమిటిదే. రెండోది తెలిసినదే కానీ ఎవరిదో అర్థం కాలేదు. మనకెందుకులే అని పడుకోబోయింది. కానీ మనసు ఆగలేదు. కిటికీలో నుంచి తొంగి చూసింది. చలమయ్య అన్నయ్య! బాకీ వసూలుకి వచ్చినట్టున్నాడు.

‘అప్పిచ్చిన వాడితో అట్టాగేనా మాట్టాడేది? బొత్తిగా ఇంగితంలేని మనిషీయన. నాకు తప్పేదేముంది’ అనుకుని వసారాలోకి వచ్చింది.

‘మీరా అన్నయ్యా! ఎండనపడి వచ్చారే!’ అంది పలకరింపుగా. ‘ఏముందీ! ఈనగారి డబ్బు ఎగ్గొట్టి, ఊరొదిలి పారిపోతామేమో అని భయం మీ అన్నయ్యకి’ అన్నాడు పెనిమిటి మొహం గంటుపెట్టుకుని.

‘నువ్వు చెప్పమ్మా లక్ష్మమ్మా! అవతల నా కూతురు పురిటికి వచ్చింది. ఆపరేషన్‌ పడుతుందన్నారు. గుంటూరు పెద్దాస్పత్రికి తీసుకుపోవాలి, సమయానికి ఇస్తాడనేకదా వున్న రొఖ్ఖం కాస్తా మీ చేతుల్లో పోసింది!’ చలమయ్య నిష్టూరమాడాడు.

‘ఊరికే ఇచ్చావా ఏంది? వడ్డీకే కదా ఇచ్చావు. వడ్డీతో సహా ఇస్తానన్నాను కదా?”

సమయానికి లేనిదే వడ్డీ ఏంచేసుకోనయ్యా?

‘వడ్డీతో కలిపి ఎంతైందన్నయ్యా?’ అంది శ్రీలక్ష్మమ్మ అందుకుని.

‘పదిహేను వందల యాభై”సరేలే అన్నయ్యా రేపటికి ఎట్టాగో సద్దుదాం. కూర్చో మంచినీళ్ళు తాగుదువు’

‘ఏం, రేపు నీ బొడ్డుకాడి ముల్లె తీసిస్తావా?’ పెనిమిటి కాస్త కోపమూ వ్యంగ్యమూ కలగలిపి.

‘చూద్దాం లెండి. ఏదో ఉపాయం దొరకదా?’

‘ఆయన చేసిన మర్యాద చాలు గానీ మంచినీళ్ళొద్దు ఏంవద్దు. నీ మాట మీద వెడుతున్నా. రేపు మీ ఆయన్నే తెచ్చిమ్మను’ కండువాతో మొహం తుడుచుకుని, చెప్పులు వేసుకుని ఒకసారి పెనిమిటి మొహంలోకి ఎర్రగా చూసి విసా విసా నడుచుకుంటూ పోయాడు చలమయ్య. ‘నేనిప్పుడే స్వరాజ్యమ్మక్కాయి ఇంటికి పోయొస్తా’ అని లోపలికి వెళ్ళి చీర మార్చుకుని వచ్చి, ఆయన అంటున్న మాటలు వినిపించుకోకుండా వీధిలోకి నడిచింది.

మర్నాడు చలమయ్యకు డబ్బు చేతులో పెడుతూ తన స్వంతడబ్బు ధారపోస్తున్నట్టు మొహం పెట్టాడు పెనిమిటి. ఆయనకు అప్పచెల్లెళ్ళు అన్నదమ్ముల మీద వుండే ప్రేమాతిశయాల గురించి శ్రీలక్ష్మమ్మ ఎరగంది కాదు. ఇదుగో ఇట్టాగే ఒకరింట్లో శుభకార్యం సమయానికి చేతిలో డబ్బు లేక చలమయ్య దగ్గర తెచ్చిన అప్పు అది. చలమయ్య కూడా తమలాంటివాడే. అతనేం వడ్డీ వ్యాపారి కాదు. పెనిమిటి మర్యాద కాపాడ్డం ఎట్టాగో చలమయ్య అవసరం తీర్చడమూ అంతేకదా!

‘స్వరాజ్యం అక్కాయి మన దగ్గర వడ్డీ తీసుకోదు. రేపు మినుములు అమ్మగానే ఇచ్చెయ్యండి’ అని పెనిమిటిని హెచ్చరించింది. పెనిమిటికి వ్యసనాలేవీ లేవు. కాస్త కోపం తప్ప. భారీ చెయ్యి తప్ప. నిజానికి అది స్వరాజ్యం అక్కాయి దగ్గర తెచ్చిన చేబదులు కాదు.. తన డబ్బంటే తాతయ్య ఇవ్వడు. అందుకని ఇట్టా. తను రూపాయి రూపాయి కూడబెట్టి స్నేహితురాలి దగ్గర దాచిన డబ్బు. నిజానికి చలమయ్య కూడా శ్రీలక్ష్మమ్మ దగ్గర వడ్డీ వసూలు చెయ్యడు.

అది ఆవిడకే మిగులు.రెండు గేదెల పాడి. ఒకటి పుట్టింటి నించీ వచ్చిన గేదే ఆవిడ స్వంతం. దాని పాలు అమ్మేది.. లెక్క అడిగితే నీకెందుకు అని తాతని నిలదీసేది కాదు. ఆ రోజుల్లో అది తప్పు. అందుకని ఏవేవో లెక్కలు చెప్పేది. డబ్బు లెక్కలన్నీ చెబుతున్నట్లే వుండేది. ఆవిడ లెక్కలు ఆవిడకుండేవి.

‘ఇంట్లో జీతగాళ్ళు లేరు. పొలంలో పనిచేసే వాళ్ళ పిల్లలే గేదెల్ని కాలవకి తోలుకుపోతారు. వాళ్ళే అప్పుడప్పుడు ఇంట్లో పనికి సాయం చేస్తారు.

పొలం పోయి.. తాటి మట్టలు, కంప పుల్లలు ఏ బుడ్డాడికో రెండు రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి తెప్పించేది.. ఎండు కొమ్మలు, పిడకలు, తాటి గిలకలు, కొబ్బరి మట్టలతో చలికాలంలో అస్తమానం కాగు క్రింద నిప్పు వుండేది. కాగులో నీళ్ళు వెచ్చగా వుండేవి. చిన్నప్పుడు సెలవులకి వచ్చినప్పుడు పెరట్లో అరుగు మీద కూచుని కొబ్బరీనలతో చీపుళ్ళు చేస్తున్న అమ్మమ్మ చుట్టూ పరిగెత్తి ఈనెలతో ఒకరినొకరం కొట్టుకున్నది గుర్తే. నేను చిన్నమామయ్య కొడుకు వెంకటేశ్వర్లు చేతి మీద కొడితే అమ్మమ్మ కోప్పడింది. ‘వాడు నీకు కాబోయే మొగుడే’ అంది. ‘వాడు నాకు కాబోయే మొగుడా ఏం కాదు ఛీ’ అని ఇంకోటి ఇచ్చుకున్నాను. వెంకటేశ్వర్లు వాడి కొలీగ్‌నీ, నేను నా క్లాస్‌మేట్‌నీ చేసుకున్నాం అనుకో!

చల్ల కవ్వంతో పెద్ద కుండలో అమ్మమ్మ మజ్జిగ చిలుకుతూ ఏదో పనిమీద వాకిట్లోకి వెడితే, నేనూ మా పెద్ద మామయ్య కూతురు పద్మా కవ్వంతాడు పట్టుకుని ‘చల్ల చెయ్యి గొల్ల భామ’ అని పాడుకుంటూ నడుములు తిప్పుకుంటూ వుంటే కవ్వం తగిలి, కుండ పగిలి పైకి తేలిన వెన్నతో సహా మజ్జిగ అంతా నేల పాలు అయినప్పుడు అమ్మమ్మ తిడుతుందని భయపడి, పారిపోయి అన్నం వేళకు రావడం ఎందుకు మర్చిపోతాం? వేడి అన్నంలో గోంగూర పచ్చడి, దానిలోకి వెన్న ముద్దా వేసిపెట్టే అమ్మమ్మ మమ్మల్ని ఎప్పడూ తిట్టలేదు. పద్మ కిప్పుడు మనవరాలు పుట్టిందని అమెరికా పోయింది. అమ్మమ్మా ఆవిడ వదినమ్మా పసుపు దంచి వస్త్రఘాళితం పడుతుంటే ఆ సన్నటి బట్టలో చేతులుపెట్టి చేతుల నిండా, మొహం నిండా పసుపు పూసుకున్నప్పుడు, కాటుకమసి గీరుతుంటే బుగ్గల్నిండా రాసుకున్నప్పుడు నవ్వుకుంటూ సున్నిపిండితో దాన్ని వదలగొట్టిన అమ్మమ్మ. గుండ్రాయితో బాదం కాయలు కొట్టి, పప్పు చితక్కుండా తీసిపెట్టిన అమ్మమ్మ, గోరింటాకు పెట్టేటప్పుడు అరచేతిలో కాకరాకో బంతాకో వేసి తెల్లగా డిజైన్‌ చేసే అమ్మమ్మ, సెలవులకి వచ్చి వెళ్ళే పిల్లలకి పదో పరకో చేతిలో పెట్టి గుప్పిట మూసే అమ్మమ్మ. ఆ అమ్మమ్మే తెలుసు నాకు.

ఎవరే సాయం అడిగినా ‘ఆయన్ని అడిగి చెబుతా’ అని పెనిమిటి వెనకాల దాక్కున్నట్టుండే అమ్మమ్మ, ‘ఏదో ఒకటి చేసి ఈ అవసరం గడుపు’ అని తప్పించుకునే ఆవిడ పెనిమిటి కూడా నాకు తెలియదు. ఆయనంటే భయం మాకు. ‘ఆవిడ సామర్థ్యం ఆయనకీ తెలుసు. పైకి తేలడు’ అంటుంది అమ్మ.. ఎరువులు కొనడానికి, కూలీలకి డబ్బులివ్వడానికి ఎప్పుడూ ఆవిడ నానుతాడు, గాజుల జత తాకట్టు పెట్టాల్సిందే. పాలమ్మిన డబ్బులు వున్నా ఇచ్చేది కాదు. ఆయన తిప్పలేవో ఆయనే పడాలి. అప్పటి నుంచీ పంట చేతికొచ్చే వరకూ చిలకలపూడి బంగారపు తాడే వుండేది ఆవిడ మెడలో. వడ్లు అమ్మగానే బంగారం వస్తువులు తెచ్చేవరకూ వెంట పడేది.. నకిలీ తాడు కూడా పదిలంగా దాచేది.. పొలం అమ్మకుండా నలుగురు పిల్లల్ని పెంచింది.. వాళ్ళాయన వెనక వున్నట్టు కనిపిస్తూనే, ఆయన మాట జవదాటనట్టు కనిపిస్తూనే- అటుకులు దంచుకోడం, అరిసెల పిండి కొట్టుకోడం, పసుపు దంచుకోడం, కొంత పసుపులో కుంకం రాళ్ళు వేసి, కుంకుమ కొట్టుకోడం దాన్ని మెత్తగా వస్త్రఘాళితం చెయ్యడం. కాటుక నూరుకోడం, చంటి పిల్లలకు బొట్టుపెట్టడానికి, సగ్గుబియ్యం మాడపెట్టి చాదు చెయ్యడం, జంతికలు వండుకోడం – మినపసున్ని విసురుకోడం అన్నీ ఇరుగూ పొరుగూ చుట్టం పక్కం అంతా కలిసే! ఆవిడ చుట్టూ ఎప్పుడూ నలుగురు అక్కాయిలో పిన్నమ్మలో వదినెలో వుండాల్సిందే. బాగా ముదిరిన నేతిబీరకాయ ఎండబెట్టి, పీచు తీసి మా పాదాలు రుద్దేది. లూఫా అన్నమాట. శుభమైనా ఆశుభమైనా అందరి చెయ్యి పడాల్సిందే.. ఆ పనులప్పుడు కష్టసుఖాలు చెప్పుకోడం.. ఇంట్లో ఎప్పుడూ చుట్టాలే. అనుకోకుండా చుట్టాలొస్తే కాకి చేత కబురు పంపగానే ఒకరింట్లో వండిన వంటలు ఒకరింటికి వచ్చేవి. కరివేపాకు, కనకాంబరాలు ములక్కాడలు ఇంటింటికీ పందారమయ్యేవి. పందిర మీది సొరకాయ, పడిమొలిచిన దోసకాయ, విరక్కాసిన వంకాయ అందరివీ అందరికీ. జున్ను పాలయితే ఎప్పుడూ ఎవరో ఒకరి గేదె ఈనగానే తలో లోటాడూ పంపాల్సిందే.

నా చదువు తమాషా విను. అపుడు అమ్మాయిలకి పదో క్లాసు మాత్రమే చివరి మెట్టు. అదీ వూళ్ళో హైస్కూలుండబట్టి. అప్పుడప్పుడే మావూరి పిల్లలు కాలేజీలో అడుగుపెడుతున్నారు.

‘అమ్మాయి కాలేజీలో చదువుతానంటుంది. మంచి మార్కులొచ్చినై కదా క్లాసులో మూడోదిట మన పిల్ల ..’ అని ‘నిర్ణయం మీదే’ అన్నట్టు చూసింది ఆయన వంక.

‘వెంకట సుబ్బయ్య మంచి సంబంధం తెచ్చాడు’ అన్నాడాయన. శ్రీ లక్ష్మమ్మ కూతురికేసి చూసింది.

‘నేను గుంటూరు కాలేజీలో చదువుకుంటాను నాన్నా. ఇందిర కూడా చేరుతోంది. నీకింకా పదహారేళ్ళే కదా అప్పుడే పెళ్లి చేసుకోకు అని మా హెడ్‌ మాస్టారు చెప్పారు’ అంది కూతురు జాలిగా.

‘నావల్ల కాదు.. ఎంత చదివినా కట్నాలు పొయ్యక తప్పదు. ఇందిర చదువుతుందిలే వాళ్ళ అయ్యకి కొడుకు చేతికి ఎదిగి వచ్చాడు’ అని వీల్లేదంటే వీల్లేదన్నాడు తండ్రి.

తండ్రి ఇంటికి వచ్చేలోగా కూతురికి అన్నంపెట్టి గదిలో పడుకోమని, ‘పిల్ల అన్నం మానేసి పడుకుంది. కాలేజీలో చేరిస్తేనే గానీ తినదట. ఏం చేసుకుంటారో మీ ఇష్టం’ అన్నది.

పిల్ల మూడురోజులదాకా గది బయటికి రాలేదు.

‘అప్లికేషన్‌ తెచ్చుకోమను. చేసేదేముంది. అంతా నువ్విచ్చిన అలుసే’ అన్నాడు పెద్ద గొంతేసుకుని.

‘మరి డబ్బో?’ అంది. ఇచ్చాడు. ఇంట్లో వాడే డబ్బు అయన చేతుల మీదుగా రావాలి ఇనప్పెట్టెలో నించీ. పెత్తనం ఆయన చేతిమీదుగా జరగాలి. ఈవిడ దగ్గర ఎంతో కొంత డబ్బు ఎప్పుడూ వుంటుంది. వున్నట్టు చెప్పదు. ఎప్పుడు ఆయన్ని అడగాలో ఎప్పుడు అడక్కూడదో తెలుసు.

అంతకుముందే ఇందిర చేత తన పిల్లకు కూడా అప్లికేషన్‌ తెప్పించింది ఆవిడ.

‘పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవద్దను. ఈ రెండేళ్ళు కాంగానే పెళ్లి చేసేస్తాను’ అన్నాడు పెనిమిటి. . ‘పిల్లకీ తల్లికీ పెద్ద ఆశలే వున్నాయి. ఆ ఆశలు నెరవేరడానికి ఎన్నెన్ని ఎత్తుగడలతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిందో!’ నేను ఇంటర్‌ పాసయిన ఏడు ఒక సంబంధం వచ్చింది. ఆ పెళ్ళికొడుకు మా అమ్మకి నచ్చలేదు. నాకూ నచ్చలేదు. వాళ్ళ కుటుంబమూ నచ్చలేదు. కాదంటే పెనిమిటి ఊరుకోడు. అది తప్పిపోవాలి. సరే, వాళ్ళకి నేను కాఫీ తెచ్చాను. తెస్తూ వాళ్ళని చూసి చేతులు వొణికి గ్లాసులు కింద పడేసాను. కాబోయే అత్తగారు కాస్త కంగారుపడింది. వెంటనే మా పెద్దత్త అందుకని’ పిల్లకి పనులు అలవాటు లేవండి. ఎంతసేపూ చదువు ధ్యాసే. ఒక్కగానొక్క ఆడపిల్ల అని కాస్త గారం’ అనేసింది. కాబోయే అత్తగారి మొహం మాడిపోయింది. సంబంధం ఎగిరిపోయింది. నేను మళ్ళీ ఉత్తుత్తి ఉపవాసాలు చేసి డిగ్రీలో చేరాను. మా పెద్దత్త కూడా అమ్మకి తగిందే! చివరికి మా బంధువుల్లో మొదట ఉద్యోగాస్తురాలిని నేనే!’ అని గల గలా నవ్వింది మా అమ్మ అచ్చం అమ్మమ్మ లాగానే!

అమ్మమ్మ ఎంతో గొప్పగా గౌరవంగా ‘నా పెనిమిటి’ అని చెప్పుకునే ఆ పెనిమిటిది నోరు. ఆవిడది చేష్ట.’హక్కుల గురించి నిలదీసి అడగడం అసలు వీల్లేదు. తెలీదు.. అదొక విడ్డూరం కూడా. కష్టపడడం తెలుసు.. రూపాయి విలువ తెలుసు అణిగి మణిగీ వుండాలి. అట్లా వుంటే అనుకున్న పని జరగదు. పని జరగాలి. అంతా బాగుండాలి. ఇల్లు శుభ్రంగా వుండాలి. బట్టలు శుభ్రంగా వుండాలి. ఎవరి చేతా మాట పడకూడదు. ఇవ్వాళ నువ్వు ఏ నటనలూ లేకుండా సాగి పోతున్నావు. ఆ అవసరం కూడా నీకు లేదు. ఆవిడ పోడు చేసిన అడవిలో నువ్వు పంట పండించుకుంటున్నావు. ఇది మన కుదురు. ఇది మా అమ్మ. అందుకే దీన్ని కాపాడుకున్నాను. ఈ ఇంటిని ఏం చెయ్యాలో తరవాత చూద్దాం’ అంది శ్రీలక్ష్మమ్మ కూతురైన మా అమ్మ.

– పి. సత్యవతి(మా ప్రమీలకు ప్రేమతో..)

➡️