శిల్పగిరి

May 5,2024 09:06 #kadha

శిల్పగిరి రాజ్యాన్ని విజయుడు పాలించేవాడు. అతని మంత్రి సుధాముడు. చుట్టుపక్కల రాజ్యాలతో పోలిస్తే శిల్పగిరి చాలా చిన్న రాజ్యం. జనాభా లక్షకు మించి ఉండదు. ఆ సుందర నగరం శిల్పకళకు పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఈ శిల్పగిరిపై తూరుపు దిక్కున ఉన్న పుష్పగిరి యువరాజు జయసింహుడి కన్నుపడింది. పుష్పగిరి సైనిక బలం చాలా ఎక్కువ కావడంతో శిల్పగిరిపై యుద్ధం ప్రకటించాడు. యుద్ధం వద్దు అని మంత్రి రామశర్మ ఎంత వారించినా, ఆ మాటలను పెడచివిన పెట్టాడు యువరాజు.
విజయుడు ‘యుద్ధం వద్దు మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను రండి!’ అని జయసింహుడికి లేఖ పంపించాడు. జయసింహుడు, మంత్రి రామశర్మతో శిల్పగిరి వచ్చాడు. విజయుడు, సుధాముడు వారిని సాదరంగా ఆహ్వానించారు. ‘మీరు ప్రయాణ బడలిక తీర్చుకోండి!’ అని వారికి ప్రత్యేక మందిరంలో విడిది ఏర్పాటు చేశారు. విశ్రాంతి తరువాత విందు ఆరగించి, ‘శిల్పకళకు పేరుగాంచిన శిల్పగిరిలోని చుట్టుపక్కల ప్రాంతాలను చూసొద్దాం పదండి!’ అని రథం ఏర్పాటు చేశాడు విజయుడు.
చుట్టుపక్కల చూసిన తరువాత ‘మీ శిల్పకళ అంతా చాలా పాతది. నేను వాటి స్థానంలో కొత్త శిల్పాలను చెక్కించి, మరింత పేరు వచ్చేలా చేస్తాను’ అన్నాడు జయసింహుడు. ‘మహారాజా! ఈ నగరం ఏర్పడి, మూడు తరాలయ్యింది. కొండలుగా ఏర్పడ్డ ప్రాంతంలోనే శిల్పాలను చెక్కించడం జరిగింది. అలాగే రహదారుల చుట్టుపక్కల ఉన్న శిల్పాలు మాత్రం దేశ విదేశాల నుండి తెప్పించినవి’ అని చెప్పాడు విజయుడు.
‘మీకు ఆదాయం ఎలా వస్తుంది?’ అడిగాడు రామశర్మ.
‘ఇతర రాజ్యాల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ చేతితో తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు చక్కని పంట పొలాల వల్ల ధాన్యానికి కొరత లేదు’ అన్నాడు విజయుడు.
అన్నీ చూసి, కోటకు తిరిగి వచ్చిన తరువాత ‘మీరు రాజ్యాన్ని పోగొట్టుకుని ఎక్కడికని వెళతారు? మీ ఇద్దరినీ నా ముఖ్య సలహాదారులుగా నియమిస్తాను’ అన్నాడు జయసింహుడు- విజయుణ్ణి, సుధాముణ్ణి ఉద్దేశించి.
‘అలాగే ఇంకో ప్రత్యేక మందిరంలో విలువైన వస్తువులు ఉన్నాయి- అవి కూడా చూద్దురు పదండి మహారాజా!’ అన్నాడు విజయుడు.
నలు దిక్కులా ఉన్న ఎనిమిది రాజ్యాల రాజుల చిత్రపటాలతో పాటు, రకరకాల బంగారు వస్తువులను చూశాక ఆ ఎనిమిది మంది రాజులు స్వయంగా ప్రశంసించి, రాసిన లేఖలను ఒక్కొక్కటిగా చదవమని ఇచ్చాడు విజయుడు. ‘ఈ శిల్పగిరి చూసి నేను ఎంతో ముగ్ధుణ్ణి అయ్యాను.. మీరు మా సోదరులతో సమానం. మీకు ఎలాంటి అవసరమైనా మేము సహకరిస్తాము’ అని ఆ లేఖలలో ఉంది.
‘విజయా! ఆ ఎనిమిది దేశాల రాజుల సైనిక బలం లక్షల్లో ఉంటుంది. వారి సహకారంతో మా రాజ్యాంపై యుద్ధం చేస్తే సులువుగా గెలిచేవాడివి! మరి యుద్ధం ఎందుకు వద్దు అన్నావు?’ అన్నాడు జయసింహుడు.
‘మహారాజా! ఆ ఎనిమిది మంది రాజులు కూడా ఈ శిల్పగిరిపై యుద్ధం ప్రకటించిన వారే.. మీకు చెప్పిన విధంగానే ”యుద్ధం వద్దు రాజ్యాన్ని అప్పగిస్తాన”ని వారికి కూడా చెప్పాము. మా ప్రాంతాలలోని శిల్పకళను చూసి యుద్ధం విరమించుకుని, ప్రశంసించి వెళ్లారు. యుద్ధం వల్ల అపారమైన ప్రాణ నష్టం జరుగుతుంది- శాంతిని కాంక్షించే మనస్తత్వం మా రాజుగారిది’ అని వివరణ ఇచ్చాడు సుధాముడు.
జయసింహుడు, విజయుణ్ణి ఆలింగనం చేసుకుని ‘యుద్ధ ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నాను. ఇకపై నీవు కూడా నా సోదరుడితో సమానం. నీకు ఎలాంటి అవసరం వచ్చినా, మేము అండగా ఉంటాము’ అని లేఖ రాసి ఇచ్చాడు.
కొద్దిరోజులలోనే ఆ ఎనిమిది మంది రాజుల చిత్రపటాల పక్కన తొమ్మిదవ చిత్రపటంగా జయసింహుడిది వెలిసింది. అలా శిల్పగిరి అన్ని రాజ్యాల మన్ననలు పొందింది.

యు. విజయశేఖర రెడ్డి,
9959736475

➡️