కుందేలు పిల్ల ఔదార్యం..!

May 12,2024 11:29 #Snake, #Sneha

దండకారణ్యంలోని ఒక పుట్టలో తక్షకి అనే పాము దాని పిల్లలతో నివశిస్తుండేది. ప్రతిరోజూ ఆహారం కోసం తక్షకి అడవిలోకి వెళ్ళేది. అలాగే ఆ రోజు కూడా అడవిలో తిరుగుతుండగా ఆకాశం మేఘావృతమై వర్షం పడడం మొదలైంది. చరచర పాకుతూ తలదాచుకోవడానికి ఒక మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళింది. తక్షకి మర్రిచెట్టు తొర్రలోకి వెళదామను కుంటుండగా లోపలి నుంచి మాటలు వినిపించాయి.
ఆ మర్రి చెట్టు తొర్రలో కుందేలు, తన పిల్లలతో నివాసం ఉంటున్నది. తక్షకి తొర్ర వైపు రావడం చూసిన కుందేలు, తక్షకిని తొర్రలోకి రావొద్దని చెప్పింది. తక్షకి కుందేలుతో ‘బయట చాలా జోరుగా వర్షం పడుతున్నది. నన్ను లోపల కొద్దిసేపు తలదాచు కోనివ్వు’ అని బతిమాలింది.
కుందేలు ‘నేను, నా పిల్లలు ఇక్కడ ఉంటున్నాం. నువ్వు లోపలికి వస్తే మాకు సరిపోదు. అందుకే అన్యధా భావించక ఇంకో చోటు చూసుకో’ అని తక్షకి అభ్యర్థనను తిరస్కరించింది. అలా చెప్పి కుందేలు లోపలికి వెళ్ళిపోయింది. తక్షకికి ఏమి చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోయింది.
లోపల కుందేలుతో పిల్ల కుందేలు ‘అమ్మా! నువ్వే కదా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని చెప్పావు. మరి మన సహాయం కోరి వచ్చిన ఆ పామును లోపలికి రావొద్దు అంటున్నావు ఎందుకు!’ అని అడిగింది.
‘నిజమే కానీ.. పాము మన శత్రువు. కోరి ప్రమాదం తెచ్చుకోకూడదు. అందుకే రావద్దన్నాను’ అని చెప్పింది.
కుందేలు పిల్ల బయటకు వచ్చి చూసింది. తక్షకి అక్కడే వానకు తడుస్తూ ముడుచుకుని ఉంది. పిల్ల కుందేలుకు జాలికలిగి తల్లి కుందేలుతో ‘అమ్మా! ఆ పామును లోపలికి రానివ్వు. సహాయం చేసిన వారికి అపాయం ఎందుకు చేస్తుంది? అలా వర్షానికి తడిస్తే పాపం పాముకి ఇబ్బంది కదా.. నువ్వే ఆలోచించు’ అని తల్లితో అంటుంది. బయట ఉన్న తక్షకికి కుందేలు పిల్ల మాటలు స్పష్టంగా వినిపించాయి.
కుందేలు తొర్ర బయటికి తొంగిచూసి తడుస్తున్న తక్షకితో ‘తొర్రలోకి వచ్చి తల దాచుకో’ అని పిలిచింది. తక్షకి ఆనందంగా తొర్రలోకి వచ్చి ఒక పక్కగా మఠం వేసింది. తొర్రలో చక్కని ఎండుగడ్డి పరిచి ఉండడంతో తక్షకికి హాయిగా ఉంది.
కుందేలు పిల్ల తక్షకిని గమనిస్తున్నది. తక్షకి కూడా కుందేలు పిల్లను చూసింది. తక్షకికి ఉదయం నుండి ఆహారం దొరకకపోవడంతో బాగా ఆకలిగా ఉంది. అదే సమయంలో బుజ్జి కుందేలు కనబడడంతో మరింత ఆకలి పెరిగింది. తక్షకి ‘ఈ బుజ్జి కుందేలును మింగేస్తే నా ఆకలి తీరిపోతుంది’ అని మనసులో అనుకుంది. ఆకలిగా బుజ్జి కుందేలు వైపు చూసింది.
బుజ్జి కుందేలు తక్షకి కళ్ళలో ఆకలిని చూసి తల్లి కుందేలుతో ‘అమ్మా! ఆ పాముకి ఆకలిగా ఉన్నట్టుంది. మన దగ్గర ఏదైనా తినడానికి ఉంటే ఇవ్వు’ అని అంది.
పిల్లకుందేలు మాటలు తక్షకి విని సిగ్గు పడింది. ‘అయ్యో నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను. నాకు ఈ తొర్రలో ఆశ్రయం కల్పించడానికి తల్లి కుందేలును ఒప్పించిన పిల్ల కుందేలును తినేద్దామని భావించాను. ఆశ్రయము కల్పించిన వారికే అన్యాయం చేయాలని అనుకున్నాను. కానీ నా ఆకలి గ్రహించిన పిల్ల కుందేలు తన తల్లితో ఆహారం ఇవ్వమని అడుగుతోంది’ అని సహాయం చేసిన వారికే కీడు తల పెట్టాలని వచ్చిన తన ఆలోచనకు మనసులోనే తిట్టుకుంది.
తల్లి కుందేలు ఇచ్చిన ఆహారాన్ని తిని తక్షకి కడుపు నింపుకుంది. ఇంతలో వర్షం తగ్గడంతో తల్లి కుందేలుకు, పిల్ల కుందేలుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని తన పుట్టవైపు ప్రయాణించింది.
పుట్ట దగ్గరకు చేరుకుని తన పిల్లలతో జరిగినదంతా చెప్పింది. మనకు సాయం చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు చేయకూడదని కూడా తక్షకి తన పిల్లలకు చెప్పింది. పిల్ల పాములు తక్షకి మాటలకు అలాగేనంటూ తలాడించాయి.

మొర్రి గోపి
8897882202

➡️