శ్రమైక జీవన సౌందర్యం

Apr 28,2024 09:11 #COVER STORY, #Sneha

శ్రమే మన జీవన సంస్కృతి.. అందులో నుంచి పుట్టినవే పాట.. సాహిత్యం.. వీటిని విడదీయలేము. శ్రమలోంచి వచ్చిన సాహిత్యమే ఒక ప్రజా సాంస్కృతిక విధానంగా విరాజిల్లుతూ వస్తోంది. శ్రమ జీవులందరూ కుల, మతాలకు అతీతంగా చేసుకునే మహత్తరమైన పండుగ మేడే.. ఇప్పుడు ‘మేడే’ అనేది మన సంస్కృతి కాదనే వాదనలు వస్తున్నాయి. పైగా అది విదేశీ సంస్కృతి అని చెప్తున్నారు. అది ఎంతమాత్రం సరికాదు.. శ్రమ చేసే వారంతా ప్రపంచంలో ఎక్కడున్నా.. వారందరి బాధ ఒక్కటే.. అలాగే వారి జీవనం యావత్తూ శ్రమతోనే ముడిపడి ఉంటుంది. వారంతా ఏకమవ్వడం దోపిడీదారులకు ఇష్టముండదు.. అందుకే వాళ్లను విడగొట్టాలనే కుట్రలు పన్నుతూ ఉంటారు. శ్రామికులు ఎప్పుడూ బానిసల్లానే ఉండాలనీ చూస్తారు. మానవ శ్రమే సంపద సృష్టికి మూలం. ప్రపంచం యావత్తూ అభివృద్ధి చెందాలన్నా.. అసమానతలు పోవాలన్నా.. అది శ్రామికుల వల్లే సాధ్యం.. ప్రపంచ పురోగతికి శ్రమ సారథి అయితే, సాహిత్యం వారధి! మే ఒకటవ తేదీ ‘మే దినోత్సవం’ సందర్భంగా వీటన్నింటిపైనా ఈ ప్రత్యేక కథనం.
కొంతమంది ”మేడే’ మన సంస్కృతి కాదు, అది విదేశీ సంస్కృతి’ అని అంటారు. విశ్వకర్మ జయంతి మన సంస్కృతి అని చెప్తుంటారు. ఇక్కడ ‘మన’ అంటే ఎవరు? మనువాదులు. కులవృత్తులను సృష్టించింది ‘విశ్వకర్మ’ అని వాళ్ళు చెబుతుంటారు. అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు పరిపాలించాలి. బ్రాహ్మణులు ధర్మాన్ని కాపాడాలి. శూద్రులు వాళ్ళ వాళ్ళ కులాలవారీ వృత్తులు చేసుకుంటూ, పై రెండు వర్ణాల వారికి సేవలు చేసుకుంటూ సంపద పెంపొందించాలి. ఆ ఉద్భోధ సారాంశం. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అప్పట్లో అన్ని భాషల దినపత్రికలలో పూర్తి నిడివి పేజీ ప్రకటనలు జారీ చేసింది.

శ్రమతోనే సంపద..
ఆ వాదనే నిజమైతే ప్రపంచంలోని కార్మికులందరూ విశ్వకర్మ జయంతి జరుపుకోవాలి కదా! కానీ దేశదేశాల కార్మికులు ‘మేడే’ ను కార్మిక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు? మనదేశంలో ఉన్న ప్రత్యేక లక్షణమైన కులవ్యవస్థ.. మిగిలిన ప్రపంచ దేశాలలో లేదు. వర్ణ వివక్ష ఉంది గానీ కుల వివక్ష లేదు. ఫలానా కులం వారు ఫలానా వృత్తి మాత్రమే చేస్తుండాలనే మనుధర్మ సూత్రాలు లేవు. అందుకే మనదేశం సహా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ‘మేడే’ ను శ్రమజీవుల దినోత్సవంగా సొంతం చేసుకున్నారు.
మానవుడి ‘శ్రమ’ సంపద సృష్టికి మూలం. కానీ ‘పెట్టుబడులు’ సంపద సృష్టిస్తాయనే తల్లకిందుల ప్రచారం ఇవాళ ప్రపంచమంతా నడుస్తోంది. కేంద్రంలోని మోడీ గానీ, మన రాష్ట్రంలో చంద్రబాబు గానీ, జగన్‌ గానీ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, అన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. సంపద సృష్టిస్తాం.. అని జనాన్ని ఊదరగొడుతుంటారు. వీళ్ళలో ఎవరైనా సరే ఒక పది లక్షల కోట్ల రూపాయలు తెచ్చి, ఒక ఊళ్లో కుప్పగా వేశారనుకుందాం.. వాటిని పదేళ్ళ తర్వాత చూసినా ఆ పదిలక్షల కోట్ల రూపాయలూ బిల్‌మక్తాగా అట్లాగే ఉంటాయి. చెదల పాలు గాకుంటే, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినా దానికి మానవశ్రమ తోడు కానిదే, కార్మికుడి చెమట చుక్కతో తడవనిదే ఒక్క సరుకూ ఉత్పత్తి కాదు. అంటే ఇక్కడ ‘ఉత్పత్తి’ కి కీలకమైనది మానవ ‘శ్రమ’.
ఈ కీలకాన్ని విస్మరించి, పాలకశక్తులు సదా పెట్టుబడుల జపం చేస్తుంటాయి. వ్యాపారం చేసుకోవడానికి సులువైన పరిస్థితులు (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కల్పించే పేరిట పెట్టుబడిదారులకు చౌకగా భూములు కట్టబెడతారు. జనం గొంతెండుతున్నా సరే వాళ్ళ కంపెనీలకు కావల్సినన్ని నీళ్ళు కేటాయిస్తారు. నిరంతర విద్యుత్‌ సరఫరాకు హామీలిస్తారు. చివరాఖరికి అనేకరకాల పన్ను రాయితీలు కూడా కల్పిస్తారు. కానీ ‘ఉత్పత్తి’ కి కీలకమైన ‘శ్రమ’ను అందించే కార్మికుల, కష్టజీవుల ప్రయోజనాలను మాత్రం పూర్తిగా విస్మరిస్తారు.

వేతనాలు.. పనిగంటలు..
కార్మికుల కనీస వేతనాలకు హామీ ఉండదు. నిర్దిష్టమైన పని గంటల గ్యారంటీ ఉండదు. పని ప్రదేశంలో సురక్షిత విధానాలను గాలికి వదిలేస్తారు. పని భద్రత ఉండదు. ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండవు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించరు, ప్రసూతి సెలవులు ఉండనే ఉండవు. ఉద్యోగ విరమణానంతర ప్రయోజనాలు అసలే ఉండవు. పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచి, అడగనిదే పాపంగా సకల రాయితీలూ కల్పించే పాలక పార్టీలు.. కార్మికుల సంక్షేమానికి వచ్చేసరికి ఎందుకు చేతులెత్తేస్తున్నాయి? ఎందుకంటే పెట్టుబడులే సంపదను సృష్టిస్తాయనే తల్లకిందుల ధర్మాన్నే అవి నమ్ముతుంటాయి కాబట్టి.
స్వాతంత్య్రం సముపార్జించిన ఈ 75 ఏళ్లల్లో పాలకపార్టీలు కార్మికులకు అయాచితంగా ఎలాంటి హక్కులూ కల్పించలేదు. ఇవాళ కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుకా అనేక పోరాటాలు, అశేష త్యాగాలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు కార్మికులను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టిస్తున్నాయి. పెట్టుబడులు రావడానికి ట్రేడ్‌ యూనియన్‌లే ఆటంకంగా మారాయి, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని పాలకులు అంటుంటారు.

నమూనాలు.. ఫెయిల్యూర్స్‌..
గుజరాత్‌ అభివృద్ధి నమూనా అంటూ మీడియా దేశమంతా మోత మోగించి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ దేశ ప్రధాని అయితే మొత్తం దేశాన్నే ఆ విధంగా అభివృద్ధి మార్గాన పరుగులు పెట్టిస్తాడని జనాన్ని నమ్మించారు. జనం కూడా ఈ ప్రచారానికి ప్రభావితమై జనం మోడీకి అధికారం కట్టబెట్టారు. ఈ పదేళ్ళ పరిపాలనలో దేశం ఏమాత్రం అభివృద్ధి అయిందో వివిధ జాతీయ, అంతర్జాతీయ నివేదికలు పరిశీలిస్తే తెలియవస్తుంది. ఇంత కాలంగా కార్మికులకు అరకొరగా రక్షణ కల్పిస్తున్న చట్టాలను చాప చుట్టేసి, మూడు ‘లేబర్‌ కోడ్‌’ లను తీసుకువచ్చాడు.
మనదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1920 లో ఆవిర్భవించింది.. అఖిల భారత కార్మిక సంఘం 1925 లో ఏర్పడింది. కానీ 1922లోనే కోల్‌కతాలో ట్రామ్‌ కార్మికులు సమ్మె చేశారు. అంతెందుకు ఉమ్మడి రాష్ట్రంలో స్పెషల్‌ బెటాలియన్‌ పోలీసుల కుటుంబాలు నిజమాబాద్‌లో హైవేను స్ధంబింపజేస్తూ రాస్తారోకోకు పూనుకున్నాయి. వాళ్ళ డిమాండ్‌ ఒక్కటే – మా భర్తలకు, కొడుకులకు క్యాజువల్‌ శెలవులు, వారాంతపు శెలవులు వాడుకునే వీలు కల్పించండీ అని. దాంతో రాష్ట్ర డి.జి.పి. హుటాహుటిన హెలికాప్టర్‌లో వెళ్ళి హామీలు ఇచ్చి, ఆ రాస్తారోకోను విరమింపచేశాడు. స్పెషల్‌ బెటాలియన్‌ పోలీసులు గానీ, వారి కుటుంబసభ్యులు కానీ ‘ఎర్రజెండా’ సంఘంలో సభ్యులు కారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. దీన్నిబట్టి ఏం అర్థమవుతుంది – దోపిడీ, పీడనలు ఎక్కడ ఉంటాయో అక్కడల్లా తరతమ స్థాయిల్లో ఏదో ఒక రూపంలో తిరుగుబాటు ఉంటుంది.

స్పార్టకస్‌… పాటలు..
స్పార్టకస్‌ పేరు మనకు చిరపరిచితమే. క్రీ.పూ. శతాబ్దానికి చెందిన బానిసల నాయకుడు. అప్పటికి కారల్‌మార్క్స్‌ లేడు.. కమ్యూనిస్టు మానిఫెస్టో లేదు, ఎర్రజెండా లేదు. అయినా బానిసలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాటి రోమన్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్పార్టకస్‌ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఈ బానిసలు కట్టుబానిసలుగా చీకటి గుడారాల్లో మగ్గిపోయేవాళ్ళు. ఆ చీకట్లో స్పార్టకస్‌ పాడే పాటలను బట్టి అతన్ని గుర్తించేవాళ్ళు సహ బానిసలు. అతను ఇచ్చిన స్ఫూర్తితో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును రోమన్‌ పాలకులు అత్యంత కిరాతకంగా అణిచివేశారు.

తిరుగుబాటు అనివార్యం..
ఎర్రజెండా లేకపోయినా, కమ్యూనిస్టు సిద్ధాంతం అప్పటికి ఉనికిలో లేకపోయినా బానిసలు తిరుగుబాటు చేశారంటే.. ఎక్కడ దోపిడీ పీడన ఉంటుందో.. అక్కడ తిరుగుబాటు అనివార్యంగా జరిగి తీరుతుంది.. అన్న సామాజిక చలనసూత్రమే కారణం. ఈ తిరుగుబాటు అతి కూృరంగా అణిచివేయబడినా అప్పటివరకూ కొనసాగిన కట్టుబానిస వ్యవస్థ సడలి, అర్ధబానిస వ్యవస్థగా మారింది. ‘పోరాటం ఎన్నటికీ వృథా పోదు’ అని ఎర్రజెండా ఇచ్చే నినాదం పడికట్టు పదం కాదు. అది సామాజిక చలనసూత్రం. ఆదిమ సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం వరకు సమాజంలో నిరంతరం వస్తున్న మార్పులను అధ్యయనం చేసిన మార్క్స్‌ ఏంగెల్స్‌లు రూపొందించిన కమ్యూనిస్టు ప్రణాళిక, గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం ఈనాటికీ కాలపరీక్షకు నిలిచాయంటే కారణం.. వాటిలో ఇమిడి ఉన్న శాస్త్రీయతే.

నిర్బంధ చాకిరీలోకి..
ఆదిమ సమాజం నుండి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించారు. ఆవిరియంత్రం కనుగొనడంతో మొదలైన తొలి పారిశ్రామిక విప్లవం తరువాత సమాజంలో పెనుమార్పులు సంభవించాయి. నాటికి ప్రపంచంలో మూడింట రెండొంతుల భూభాగాన్ని ఏలుతున్న బ్రిటిష్‌ సామ్రాజ్యం పారిశ్రామిక విప్లవాన్ని సరుకుల ఉత్పత్తిని వేగవంతం చెయ్యడానికి సాధనంగా మలుచుకుంది. ఆవిరి యంత్రాలతో నడిచేే జౌళిమిల్లులలో పని చెయ్యడానికి కార్మికులు అధికారికంగా కావాల్సి వచ్చింది. దాంతో వ్యవసాయరంగం మీద ఉన్నవారిని పారిశ్రామిక రంగానికి తరలించి, నిర్బంధ చాకిరీలోకి దించారు. వ్యవసాయంలో కొంత తీరుబడి సమయం ఉంటుంది. కానీ పారిశ్రామిక రంగంలో నిర్బంధ చాకిరీకి తట్టుకోలేక, పారిపోయే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు లెక్కలేనంతమంది. ‘ఇంగ్లాండ్‌లో కార్మికవర్గ స్థితిగతులు’ అని ఏంగెల్స్‌ రచించిన పుస్తకం చదివితే.. పెట్టుబడిదారీ వ్యవస్థ రోమరోమం చీమునెత్తురులు కారుతూ ఎంత భయవిహ్వలంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మానవజాతి చరిత్రలోనే అతిహేయమైన, హీనమైన బానిసల వ్యాపారం మొదలైంది కూడా ఆ కాలంలోనే.

అధిక పనిగంటలపై పోరాటం..
పారిశ్రామిక విప్లవానంతర నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు అన్నీ కార్మిక వర్గానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. థామస్‌ ఎడిసన్‌ ‘బల్బు’ కనుగొనే ముందువరకు కార్మికులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ రోజుకు పన్నెండు గంటలు పనిచేసేవారు. బల్బు కనుగొనడంతో గనిలో, పనిలో కార్మికులు రోజుకి ఇరవై నుండి ఇరవై రెండు గంటల పాటు పనిచేయాల్సి వచ్చింది. కార్మికుల మీద దోపిడీ అలవిమాలిన స్థాయికి చేరుకుంది.
ఈ నేపథ్యంలోనే చికాగో కార్మికులు రోజుకు ఎనిమిది గంటల పనిదినం కోసం సమ్మె కట్టారు. పాలకశక్తులు ఈ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచాయి. అక్రమ అభియోగాలు మోపి, నాయకులను బహిరంగంగా ఉరి తీశారు. కార్మిక వర్గానికి సరైన గుణపాఠం చెప్పామని పాలకశక్తులు జబ్బలు చరుచుకున్నాయి. కానీ 1917లో రష్యాలో లెనిన్‌ నాయకత్వాన కార్మికవర్గం తిరుగుబాటు చేసి, జార్‌ చక్రవర్తి పాలన కూలదోసింది. కార్మిక శ్రేయోరాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించుకుంది. దీంతో దేశదేశాలా రష్యన్‌ విప్లవ స్ఫూర్తితో ఎనిమిది గంటల పనిదినం కోసం ఉవ్వెత్తున కార్మికవర్గ పోరాటాలు ఎగిసిపడ్డాయి. దీంతో పెట్టుబడిదారీ దేశాలన్నింటిలో ఎనిమిది గంటల పనిదినం అమల్లోకి వచ్చింది. ఆ పోరాట స్ఫూర్తినే ప్రపంచ వ్యాప్తంగా కార్మికవర్గం ‘మే’ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

నిజం తెలుసుకోవాలి..
ఇంతటి చరిత్రను ‘విదేశీయం’ పేరిట పక్కన పెట్టి, విశ్వకర్మ జయంతి జరుపుకోండని కార్మికవర్గానికి కొందరు సుద్ధులు చెబుతున్నారు. కానీ ఆ పప్పులు ఇక్కడ ఉడికే పరిస్థితి లేదు.
లేబర్‌ కోడ్‌ల పేరిట పని వేళలు 12 గంటలకు పెంచుకోవడానికి, మహిళలకు నైట్‌షిప్ట్‌ డ్యూటీలు వేసే వీలు కల్పిస్తూ యాజమాన్యాలకు అనుకూలమైన రీతిలో మోడీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈ దన్నుతోనే ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వారానికి 70 పని గంటలు, అంటే రోజుకి 12 గంటలు పనిచెయ్యకపోతే దేశం ఎలా ముందుకు పోతుందని ఫోజుగా అడుగుతున్నాడు. లోక్‌సత్తా జయప్రకాష్‌ నారాయణలాంటి వారు వంత పాడుతున్నారు. కార్పొరేట్‌ వర్గాలు, ఆ వర్గాల చేతుల్లో ఉన్న మీడియా 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి అధికారంలోకి వచ్చి, మోడీ మరోమారు ప్రధానిగా కొనసాగాలని అందుకే కోరుకుంటున్నాయి. కార్పొరేట్‌ వర్గాల ఆకాంక్ష నెరవేరుతుందో.. ప్రజల అభీష్టం నెగ్గుతుందో కొద్దిరోజుల్లో తేలిపోతుంది.
కార్మికులు సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను మోడీ మూడు చట్టాలతో చాప చుట్టేశాడు అని కార్పొరేట్‌, పాలకశక్తులు ప్రస్తుతానికి సంబరపడుతుండ వచ్చు. కానీ భారత కార్మికవర్గం కచ్చితంగా వీరికి సరైన గుణపాఠం నేర్పుతుంది.

సమ్మె హక్కు కాదా?
సమ్మె కట్టిన లక్ష మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత డిస్మిస్‌ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేశాయి. భవిష్యత్‌లో సత్ప్రవర్తన కలిగి ఉంటామనే హామీ పత్రం తీసుకుని, డిస్మిస్‌ చేసిన ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి చేర్చుకోమని సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే ‘సమ్మె కార్మికుల హక్కు కాదు’ అని తీర్పు చెప్పింది. సహజంగా అన్యాయం జరిగిందని భావించిన వారు కోర్టులో తేల్చుకుంటాం, అవసరమైతే సుప్రీం కోర్టుదాకా పోతాం అంటుంటారు. అట్లాంటిది సుప్రీం కోర్టు సమ్మె కార్మికుల హక్కు కాదని తీర్పు ఇవ్వడంతో యావత్‌ కార్మిక వర్గం నివ్వెరపోయింది.
ఈ తీర్పు వెలువడిన వెంటనే బెంగాల్‌లో జ్యోతిబసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ‘సమ్మె కార్మికుల అవిభాజ్యమైన హక్కు’ అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బెంగాల్‌ యావత్తూ స్ధంభించిపోయింది. సుప్రీం కోర్టు తీర్పుని కార్యరూపంలో సవాలు చేసింది. ఆ వెనువెంటనే ఇదే నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు, ఆలిండియా ఫెడరేషన్ల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. దీంతో ‘సమ్మె కార్మికుల హక్కు కాదన్న’ సుప్రీంకోర్టు తీర్పును భారత కార్మికవర్గం కాగితాలకే పరిమితం చేసింది. కాబట్టి పాలకపార్టీలు చట్టాల ద్వారా కార్మికసంఘాల ఉనికిని, కార్మికవర్గ సమరశీల పోరాటశక్తిని, కార్మిక వర్గ ఐక్యతను దెబ్బతియ్యగలం అని ఎంత విర్రవీగినా.. చివరకు కార్మికవర్గమే పైచెయ్యి సాధిస్తుంది. ఆ రకమైన వర్గ స్ఫూర్తితో, సమర స్ఫూర్తితో కార్మికవర్గం ఈ ఏడాది మే దినోత్సవాన్ని రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించుకోవాలి.

కె. సత్యరంజన్‌

శ్రమ సౌందర్యం..

పనిగంటల కోసం బిగిసిన ఆ పిడికిళ్ళు, ఎగిసిన ఆ కొడవళ్ళు శ్రామిక జన సమరానికి కార్మికవర్గ ఐక్యతకు విరాజిల్లిన రోజు ‘మేడే’. ఇతర జీవజాలానికి భిన్నంగా, మనిషికి మాట వచ్చింది. మాట అంటే భాష, శ్రమకు మెరుగులు దిద్దడానికి, పెరగడానికి ఉపయోగపడింది. మానవుడి ఊహాశక్తి పెరిగింది. అ ఊహాశక్త్తే సకల కళలకు ఆధారం. అలసట మరచిపోవడానికి, తీరిక వేళలో సేద తీరడానికి శ్రమను సౌందర్యంగా మానవుడు మలిచాడు. అందుకే శ్రమైక జీవన సౌందర్యం అనేది.
సకల జీవజాలంతో.. మనిషి ఉనికీి ప్రకృతి మీద ఆధారపడి ఉంది. శ్రమ ద్వారా ప్రకృతిని తనకనుగుణంగా మార్చుకుంటాడు, మలుచుకుంటాడు. ఈ క్రమంలో తాను మారతాడు. ప్రతి మనిషి తోటిమనిషితో సంబంధం పెట్టుకుంటాడు. ఏ మనిషి ఒంటరిగా ఉండటం సాధ్యం కాదు. మనిషికి మూడురకాల సంబంధాలుంటాయి. 1. ప్రకృతికి-మనిషికి సంబంధం, 2. మనిషికి-ఉత్పత్తికి సంబంధం, 3. మనుషుల మధ్య పునః ఉత్పత్తి సంబంధం. మనిషి చైతన్యమే సకల శాస్త్రాలకు, కళా రూపాలకు కారణం. మానవ శ్రమ లేకుండా ఏ కళా సృజన సాధ్యం కాదు.
సాహిత్యంలో..
తెలుగు సాహిత్యంలో శ్రమ సౌందర్యం ప్రతిఫలించిన తీరు మనం గమనించాలి. ప్రబంధాల్లోనూ జనజీవన చిత్రణ కనిపిస్తుంది. మనుచరిత్రలో వేట వర్ణించే సమయంలో, కొండ మీదకు సరుకులు మోసుకుపోయేవారు.. వీపున మోత, బరువుతో కొండ ఎక్కలేక ముసలివాళ్ళు, వారి తెల్లటి మీసాలు చూస్తే ఏకులు కరిచిన కుక్కల్లా ఉన్నారంటాడు అల్లసాని. ఎంత కల్పన ఉన్నా శ్రమజీవులను వర్ణించవలసి వచ్చింది. తెలుగు సాహిత్యంలో సామాన్యులకు తొలి స్థానం కల్పించింది శివకవులే. వారి రచనలలో శ్రమజీవనం దండిగా ఉంటుంది. ఉత్పత్తి క్రమంలో ప్రధానపాత్రను నిర్వహించే సామాన్యుల శ్రమను తెలుగు సాహిత్యంలో మొదట ప్రతిబింబించింది గురజాడ. ‘కన్యాశుల్కంలో, పూర్ణమ్మ, కన్యక’ లో సామాన్యులే ప్రధాన పాత్రధారులు. ఇక 1930లో ఒక కుదుపు కుదిపిన మహాకవి శ్రీశ్రీ సాహిత్య పరమావధి శ్రమయే అన్నారు. ‘కుక్కపిల్ల సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల అన్నీ కవితామయమేనోయి’ అని 1934లో చెప్పినా.. ‘పాలికాపు నుదిటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు మాయంటావా?’ అని 1937లోనే ప్రశ్నించారు. ‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, నాగలి, కొడవలి, సహస్రత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే, నా విరచించే నవీనరీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం’ అని తెలుగుసాహిత్యానికి మార్గనిర్దేశం చేశారు.


తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో..
జాతీయోద్యమం, సంస్కరణోద్యమం, వామపక్ష ఉద్యమం మూడు పాయలుగా తెలుగుజాతి జీవనాన్ని మలుపు తిప్పటంలో కీలకపాత్ర వహించాయి. మనిషిలో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని రగిల్చాయి. కాళోజి, దాశరథి వంటివారు తెలంగాణా రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తిని రగిలించారు. అదే సమయంలో సుద్దాల, యాదగిరి కవితా కుసుమాలుగా ఎదిగారు. సుంకర-వాసిరెడ్డి ‘మా భూమి’ నాటకం రాష్ట్రమంతా వేలాది ప్రదర్శనలకు నోచుకుంది. వీరతెలంగాణా పోరాటాన్ని నవలలుగా చిత్రీకరించిన వారు 20 మందికి పైనే ఉంటారు. వీరిలో చాలామంది ఆ ప్రాంతానికి చెందినవారు కాదు. ఆళ్వారుస్వామి తెలంగాణా జనజీవితాన్ని సాహిత్యబద్ధం చేస్తే.. దాశరథి రంగాచార్య లాంటివారు అ ఒరవడిని విస్తృతపరిచి, సుసంపన్నం చేశారు. ‘చైనాలో రిక్షావాలా, చెక్‌దేశపు గని పనిమనిషి ఐర్లాండు ఓడకళాసి, అణగారిన ఆర్తులందరు, ఖండాంతర నానాజాతులు, చారిత్రక యదార్థతత్వం చాటిస్తారొక గొంతకతో’ అని శ్రీశ్రీ వ్యక్తం చేసిన ఆశాభావం.. కవి కల్పనగా ఆనాడు కనిపించవచ్చు. నేడు ప్రపంచీకరణ తర్వాత దోపిడీకి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా శ్రామికుల ముక్తకంఠధ్వనులు వినబడుతున్నాయి. సామూహిక కష్టాల నుండి సహానుభూతి పొంది, అక్షరాన్నే అయుధంగా మలుస్తున్నారు. అలా జయించేందుకు ప్రపంచం అందుబాటులో ఉందని తెలియచేయటమే సాహిత్యధర్మం. ఏ ఉద్యమాన్నీ సాహిత్యం విడవలేదు. జాతీయోద్యమంలో మేధావులు, కళాకారులు, సాహిత్యకారులు.. తమ భావనలు నిర్దిష్టరూపం సంతరించుకున్నాయి. బోయిభీమన్న ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ కావ్యం, ‘కూలి-రాజు’ నాటకం అర్థికాంశాలను ప్రస్తావించాయి. సంపద సృష్టికర్తలైన శ్రామికులకు రాజ్యాధికారం దక్కాలన్న అకాంక్ష వ్యక్తమైంది. తెలుగు సాహిత్యంలో శ్రామికుల వ్యథలను, ఆర్తిని, అక్షరబద్ధం చేసినవారు శ్రామికవర్గానికి చెందనివారు ఎక్కువ మంది ఉన్నారు. శ్రామికజీవన వర్ణన తెలుగుసాహిత్యంలో భారతీయ సమాజానికి అనివార్యమైన కులం చట్రంలోనే సాగింది. చలం పితృస్వామ్య కుటుంబవ్యవస్థపై తిరుగుబాటు చేసినా, జాషువాలాంటి వారు బ్రాహ్మణీకాన్ని వ్యతిరేకించినా.. మాకొద్దీ నల్లదొరతనము అని గరిమెళ్ల గొంతెత్తినా.. ఈ సాహిత్యమంతా జన జీవితాన్ని ఆధారం చేసుకొనే! వేల శ్రామికుల ఆర్తి వ్యక్తీకరణలో భాగంగానే, నిరాక్షరాస్యుల నుండే వాగ్గేయకారులు పుట్టారు.

పనీ.. పాట..
శ్రామికుల పనితో పాటు పాట కొనసాగింది. మనది వ్యవసాయాధార దేశం. కనుక శ్రామిక గేయాల్లో వ్యవసాయ పాటలు, దంపుడు పాటలు, విసుర్రాయి పాటలు వచ్చాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల కలుపు పాటలు కనుమరుగు అవుతున్నాయి. పోరాట సాహిత్యానికి, ప్రగతిశీల సాహిత్యానికి కచ్చితంగా ఒక విభజన రేఖ ఉంటుంది. జీవన పోరాటాన్ని అనుభవించినవారు మాత్రమే పోరాట సాహిత్యాన్ని సృష్టించగలరు.

గుండు నారాయణరావు
9951540671

➡️