పౌరులపై పాలకుల క్రౌర్యం

Jun 30,2024 10:20 #palasteena, #Sneha

ఎలాగైనా పాలస్తీనాను సొంతం చేసుకోవాలన్నదే ఇజ్రాయిల్‌ పంతం. అందుకు ఎంతమందిని పొట్టన పెట్టుకోవడానికైనా అది సిద్ధం. పాలస్తీనా పిల్లలైనా, మహిళలైనా, పౌరులైనా దానికి పట్టింపేమీ లేదు. విచక్షణా రహితంగా బాంబులు వేస్తుంది. తుపాకులతో కాలుస్తుంది. విధ్వంసం సృష్టిస్తుంది. ఎలాగోలా ఈ దాడుల నుంచి బైటపడిన వారికి…ఆహారం, మందులు అందకుండా చేస్తుంది. ఆకలి మహమ్మారికి వారి ప్రాణాలను నైవేద్యంగా పెడుతుంది. ఆపైన గాయపడిన వారిని భయకంపితులను చేసి పారగొట్టేందుకు ఇదిగో ఇలా…జీపులకు కట్టి ఊరేగించేందుకూ తెగబడుతుంది.

పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలో ఇజ్రాయిల్‌ ఇటీవల బాంబు దాడి చేసినప్పటి దృశ్యమిది. ఆ దాడిలో గాయపడి నెత్తురోడుతున్న ముజాహిద్‌ అజ్మీ అనే వ్యక్తిని జీపుకు కట్టేసి ఊరేగింపుగా తీసుకెళ్లింది సైన్యం. అజ్మీని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులు దీంతో కన్నీరుమున్నీరయ్యారు. ఇంతలో ఇజ్రాయిల్‌ సైన్యం చేసిన ఈ అమానుషకాండ దృశ్యాలు దేశాలను దాటుకుని వైరల్‌ అయ్యాయి. ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని కళ్లకు కట్టాయి. దాంతో నెటిజన్ల ఆగ్రహం సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తింది. అయినా సరే…ఇజ్రాయిల్‌ పాలకుడు నెతన్యాహుగాని, అతనికి అండగా వున్న అమెరికా, పశ్చిమ దేశాలు గాని మాటవరుసకు కూడా అజ్మీని ‘అయ్యో పాపం’ అనలేదు. ఇజ్రాయిల్‌ను మందలించలేదు. పైగా ఇజ్రాయిల్‌ తన చర్యను సమర్థించుకునే పని చేసింది. అజ్మీపై ఉగ్రవాదనే అనుమానం వుందంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. పాలకుల అండదండలు లేకుండా సైన్యం కాలుకూడా కదపదన్న వాస్తవం తెలిసిందే కదా.

ఈ దృశ్యం చూసినప్పుడు…జమ్ము కాశ్మీర్‌లో సరిగ్గా ఏడేళ్ల కిందట చోటుచేసుకున్న ఇటువంటి అమానుష సంఘటన జ్ఞప్తికి రాకమానదు. అది 2017, ఏప్రిల్‌ 9వ తేదీ. శ్రీనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతున్న రోజది. అక్కడ జమ్ము కాశ్మీర్‌ పోలీసులేగాక, ఆర్మీ సైతం విధుల్లో వుంది. ఓటు వేసి వస్తున్న ఫరూక్‌ అహ్మద్‌ దార్‌ అనే వ్యక్తిని సైన్యం తాళ్లతో జీపుకు కట్టేసి సమీప గ్రామాల్లో నాలుగు గంటల పాటు ఊరేగించింది. ఈ అమానుషకాండకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయి సైన్యంపై ఆగ్రహం వ్యక్తమైంది. అప్పుడు తాము చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు…రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునేందుకే ఇలా చేశామని…ఫరూక్‌ రాళ్లు రువ్వే వారిని ప్రేరేపిస్తున్నాడన్న అనుమానంతో ఇలా చేశామని చెప్పుకుంది సైన్యం.
మోడీ అండ్‌ కో కాషాయ పాలనలో జమ్ము కాశ్మీర్‌ యువతకు ఉపాధి లేదు. ఉద్యోగాలు లేవు. సాధారణ జీవనం లేదు. సైన్యం పహారాలో ఇనుప కంచెల మధ్యన రోజులు గడుస్తున్న చోట…సాధారణ పౌరులను ఇలా అమానుషంగా జీపులకు కట్టేసి ఊరేగిస్తే…వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రశ్నార్థకం కావా!
బుల్లెట్లు, పెల్లెట్లు, బూట్ల చప్పుళ్లు, అరెస్టులు, జైలు శిక్షలు, బోరునెట్లపై ఊరేగింపులు, బాంబు దాడులు, విధ్వంసాలు, ఆక్రమణలు…లేని ప్రశాంత జీవితాలను, గౌరవప్రదమైన బతుకులను అందించలేరా పాలకులు! పాలస్తీనాలో అయినా, ఇండియాలో అయినా ఎక్కడైనా ఏ దేశ పౌరులైనా కోరుకునేది అదే కదా!

కె. అంజన

➡️