నాన్నంటే ఓ భరోసా !

May 12,2024 10:19 #Sneha

చాలా కుటుంబాల్లో నాన్న అంటే భయపడే పిల్లలు ఉన్నారు. ఇలాంటి పిల్లలు అమ్మానాన్న ఇద్దరిలో తమకు ఏదైనా కావాలన్నా.. ఏమైనా చెప్పాలన్నా అమ్మతోనే చెప్పడం.. అమ్మ ద్వారా నాన్నకు తెలియజేయడం చేస్తుంటారు. కొందరు అమ్మలు పిల్లలు అల్లరి చేస్తుంటే.. ‘నాన్న వచ్చాక చెప్తానుండు.. నువ్వు చెప్పిన మాట వినడం లేదు..!’ అంటుంటారు. అయితే అందరు నాన్నలూ ఇలాగే ఉన్నారని చెప్పడం లేదు. ఏది ఏమైనా పిల్లలకు నాన్నంటే కొద్దో గొప్పో భయం ఉంటుందనేది వాస్తవం. ఇది సరైన పేరెంటింగ్‌ కాదనేది నిపుణుల మాట. వాళ్లు కొన్ని సూచనలు చేస్తున్నారు.
సహజ అమ్మ కూచి. అమ్మ కొంగు పట్టుకునే తిరుగుతుంటుంది. అమ్మ చాటు నుంచే నాన్నను తొంగి తొంగి చూస్తుంటుంది. సహజ అల్లరి చేస్తే తండ్రి కళ్లు ఉరిమి చూస్తే చాలు బేర్‌మంటుంది. ఆ భయం పోగొట్టకుండా అలాగే కొనసాగుతుండేసరికి సహజకు తండ్రితో దూరం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సహజ ఒకసారి తల్లితో.. ‘అమ్మా ఇలాంటి కోపగించుకునే నాన్నను ఎందుకు తెచ్చావు? మనం మరో కొత్త నాన్నను తెచ్చుకుందాం..!’ అంటూ అమాయకంగా అంటే.. ఆమె నవ్వుకుంది.. పైగా భర్తతో, మిగిలిన కుటుంబసభ్యులతో, తన స్నేహితులతో ఈ విషయం పదే పదే చెప్పి, నవ్వుకున్నారు. కానీ సహజ మనసులో పడిన ముద్రను చెరిపే ప్రయత్నం చేయలేదు.
మనోజ్‌కి ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచే దానిపై తండ్రితో సంతకం ఎలా పెట్టించాలా? అనే ఆలోచనలే వాడిని ముసిరేస్తున్నాయి. అదే ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. తండ్రిని వరండాలో చూడగానే మనోజ్‌ మరింత భయపడసాగాడు. ‘ఏంటి మనూ అలా ఉన్నావేంటి?’ అంటూ తండ్రి పలకరించాడు. అయినా తలెత్తకుండానే.. ‘ఏమీలేదు..’ అని పొడిపొడిగా అంటూనే ఇంట్లోకి వెళ్లిపోయాడు. బ్యాగ్‌ అక్కడ పడేసి, తల్లి ఎక్కడుందో వెతుకుతున్నాడు. తల్లి కనబడగానే.. ‘అమ్మా! ఈ రోజు ప్రోగ్రెస్‌కార్డు ఇచ్చారు. నువ్వే నాన్నతో దానిపై సంతకం చేయించాలి..!’ అన్నాడు. ‘నేను చేయించడం ఏమిటీ.. నువ్వే వెళ్లి చేయించుకో.. ఏ మార్కులు బాగా రాలేదా?’ అని అడిగింది తల్లి. ‘అదేమీ కాదు.. క్లాస్‌ ఫస్ట్‌ రాలేదు. ఐదో ర్యాంకు వచ్చింది.. ఆయన్ని చూస్తుంటే నాకు వణుకు వస్తుంది.. అడిగినదానికి సమాధానం సరిగా చెప్పకపోతే.. బెల్ట్‌ తీస్తారు.. అందుకే నువ్వే పెట్టించు అమ్మా!.. ప్లీజ్‌..!! ఇదిగో టేబుల్‌పై పెడుతున్నా..!’ అంటూ అక్కడ పెట్టేసి, స్నానానికి వెళ్లిపోయాడు మనోజ్‌.
ఇదేదో వీరిద్దరి విషయాల్లో జరిగేవి మాత్రమే కాదు. చాలా కుటుంబాల్లో కనిపించే దృశ్యాలే. అసలు నాన్నకు భయపడకుండా ఉండాలంటే.. నాన్న ఓ భరోసా అనే ఫీలింగ్‌ కలగాలంటే..

ప్రేమగా ఉండాలి..
తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లలతో ప్రేమగా ఉండాలి. పిల్లలు మనసు విప్పి తమకు సంబంధించిన విషయాలన్నీ పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి. పిల్లల్ని ప్రేమతోనే మార్చవచ్చు. ప్రేమ చూపించడం వేరు.. గారాబం చేయడం వేరు.. వాళ్లు అడిగిందల్లా కొనివ్వడమో.. ఏదైనా అడగగానే గద్దివ్వడమో.. చేయకూడదు. పిల్లలకు ఏమిష్టమో తండ్రికి తెలుసుకాబట్టి.. వారికి అవి తేవడం ప్రేమానురాగాలు పెంపొందడానికి వీలవుతుందనేది నిపుణుల సూచన.

విలన్‌ను చేయొద్దు..
తండ్రిని ఇంట్లో విలన్‌గా చిత్రీకరించవద్దు.. పిల్లలు అల్లరిచేసినా.. ఏదైనా కొనపెట్టమని కోరినా.. ‘నాన్న రాగానే చెప్తానుండూ.. అలా అల్లరి చేస్తావా? అవీ ఇవీ కొనపెట్టమని అడుగుతావా? వచ్చాక నీకు ఉందిలే.. మీ నాన్న బెల్ట్‌ తీస్తేగానీ నువ్వు దారిలోకి రావూ..!’ అంటూ పిల్లల్ని భయపెడుతూ.. వాళ్లకి తండ్రి అంటే పెద్ద విలన్‌లా చూపిస్తుంటారు కొందరు తల్లులు, మిగిలిన కుటుంబసభ్యులు.. అలాగే పిల్లల మధ్య కూడా.. ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలే చేసుకుంటుంటారు. అంతేకాదు.. తల్లిని కూడా బెదిరిస్తూ.. ‘నాన్న వచ్చాక నీగురించి చెప్తా!’ అంటూ ఆ కుటుంబంలో తండ్రి ఒక కోపిష్టి వ్యక్తిగా చిత్రీకరించబడతాడు. ఈ ధోరణి సరైనది కాదనేది నిపుణుల మాట. సంరక్షక పాత్ర వహించే వ్యక్తులుగా తల్లిదండ్రులు ఉండాలనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనంలో పెట్టుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఇది సరైన పేరెంటింగ్‌ కాదని చెప్తున్నారు.

తప్పొప్పులు చెప్పగలగాలి..
తల్లితండ్రులంటే పిల్లలకు అసలు భయభక్తులు ఉండొద్దా అంటే.. ఉండాలి. కాకపోతే పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులతో నిర్బయంగా చెప్పగలగాలి. అప్పుడు పిల్లలు చేసిన తప్పు గ్రహించినందుకు అభినందిస్తూ.. అలాంటి తప్పు మరోసారి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలగాలి. పిల్లలు అప్పుడు వికసిత కుసుమాలే. పిల్లలు మంచి చేసినప్పుడు అభినందించాలి. ఆ విధంగా పిల్లలతో తల్లిదండ్రులకు సంబంధబాంధవ్యాలు ఉండాలనేది నిపుణుల మాట.

స్నేహితుడిలా…
తండ్రి పిల్లలకు స్నేహితుడిలా ఉండాలి. వాళ్ల ఆటపాటల్లో, బాధ కలిగినా.. సంతోషం కలిగినా.. ముందుగా తండ్రితో షేర్‌ చేసుకునేలా ఉండాలి. వాళ్ల చదువుల్లోగానీ, మరే ఇతర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల్లో సహాయకులుగా ఉండాలి. డిక్టేటర్‌లాగా తండ్రి ఎప్పుడూ ఉండకూడదనేది నిపుణులు చెప్తున్న మాట. అలాగే బొమ్మరిల్లు నాన్నలానూ ఉండకూడదు. అన్నీ తానే అయ్యి, పిల్లలు సొంత అభిప్రాయాలుగానీ, ఆలోచనలుగానీ, ఇష్టాయిష్టాలుగానీ లేకుండా చేయకూడదు. చిన్నపిల్లలు వాళ్లకేం తెలియదనే భావన కాకుండా.. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఇవన్నీ పిల్లలకు తండ్రి పట్ల ప్రేమను కలిగించే అంశాలు. అలాగే భయం పోగొట్టి, తండ్రి అంటే గౌరవ భావం, ఓ భరోసా పిల్లల్లో పెంపొందించేందుకు తోడ్పడతాయి.

➡️