అంతరంగపు ఘోషను వినిపించే ‘డిమ్కి’ కథలు

Jan 7,2024 10:44 #book review, #Sneha

కథ మానవ జీవితంలో ఒక భాగం కాదుగానీ, మానవ జీవితమే ఓ కథ. ఆ మాటకొస్తే శ్రీశ్రీ గారన్నట్లు సృష్టిలో ఏదీ అనర్హం కాదు. ప్రతి జీవీ కథా వస్తువే. మనిషి పుట్టినప్పుడే కథ పుట్టింది. అతనితోపాటు ఎదిగింది. నలుదిక్కులకూ వ్యాపించింది. విశ్వవ్యాప్తమైంది. కథ లేనిదే మనిషికి మాటలు లేవన్నట్లుగా తన అస్థిత్వాన్ని స్థిరపరచుకుంది.

ప్రతి రచయిత మేధస్సులో కథ బహు రూపాలుగా పురుడు పోసుకుంటూనే ఉంది. ‘కుటుంబ కథలు, మానవత్వపు కథలు, సరస కథలు, హాస్య కథలు, సామాజిక కథలు, వాదం కథలు’ అంటూ మనలో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఒక్కో రచయిత(త్రి) ఒక్కో వాదానికి బలం చేకూర్చారు. తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. చీకటి కోణాలను బట్టబయలు చేశారు. ఎప్పుడైతే కథ విజయం సాధించిందో అప్పుడే రచయిత(త్రి) పేరు నిలబడుతుంది. అలాంటి పేరుని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు శ్రీమతి స్ఫూర్తి కందివనం. ‘డిమ్కి’ కథా సంపుటిలో మొత్తం తొమ్మిది కథలున్నాయి. అన్ని కథలూ బహుమతులను పొందినవే. ముప్పైకి పైగా కథలు ప్రచురితమైనా బహుమతి పొందిన కథలతోనే సంపుటిని తీసుకొచ్చారు.

ఒకే రకమైన విషయాన్ని ఒక్కో రచయిత ఒక్కో విధంగా చెప్తారు. ఎవరైతే ప్రభావంతంగా చెప్తారో ఆ కథే సమాజంలో ఎక్కువ చైతన్యాన్ని కల్గిస్తుంది. అలాంటి ప్రభావవంతమైన కథల సమాహారమే స్ఫూర్తి కందివనం వెలువరించిన ‘డిమ్కి’ కథా సంపుటి. ఇందులో నాలుగు కథలు ప్రామాణిక భాషలోనూ, మిగతా కథలు పాలమూరు మాండలికం లోనూ మనల్ని పలకరిస్తున్నాయి.

మొదటిగా చెప్పుకోవాల్సింది ‘నాయిన చెప్పిన అబద్ధం’ కథ గురించి. పిల్లలు దేవుళ్లతో సమానం అంటుంటాం. అంటే వాళ్ళు తెల్లకాగితం లెక్కన. ఆ కాగితం మీద ఏ రంగు పూస్తే అదే రంగు కన్పిస్తుంది. జీవితంలో పైకెదగడానికి ఎన్నో రంగులుండగా నలుపు రంగునే ఎందుకు పూయాలి? ఈ కథలో స్కూలుకి పోయే అంజిగాడు తెల్ల కాగితం మాదిరి. కానీ ఆ కాగితం మీద నలుపు మరకలు అంటుకున్నాయో అమ్మమ్మ అర్థం చేసుకుంటుంది. ఈ కథ చదివాక మీ గుండె తడి కాకపోతే నిలదీయండి.

తర్వాత చెప్పుకోవాల్సింది ‘నల్ల చీమలు’ అనే కథ గురించి. కులాలు, మతాలు, వర్గాలంటూ మనిషిని వేరు చేయడానికి చాలానే ఉన్నారు. ఇవన్నీ ఇప్పట్లో కనుమరుగయ్యేలా కూడా లేవు. సనాతన హిందూ ధర్మం అని చెప్పుకునే మన దేశంలో దళితుల మీద అంటరానితనం అనే ముద్ర ఎంతగా వేళ్లూనుకుందో తెలిసిందే. మనం పాటించే రాజ్యాంగాన్ని నిర్మించింది (కర్త) కూడా ఓ దళితుడే. నేటికీ అతన్ని దళితుడిగానే చూస్తోంది దేశం. దళితవాడల్లోనో, అసెంబ్లీలాంటి చోట మాత్రమే ఆయన విగ్రహం కనపడుతుంది. ఆ వివక్ష కాలానుగుణంగా ఎలా మారుతుందో ‘నల్ల చీమలు’ కథ రుజువు చేస్తోంది. ఈ మధ్యే కేరళలో కాస్ట్‌ సిస్టమ్‌ ఉండకూడదని స్కూలు జాయినింగ్‌ ఫార్మ్‌లో ‘కులం’ అనే ఆప్షన్‌ తొలగించారు. వాళ్ళు కోరుకున్న మార్పు రావడానికి మొదటి అడుగైతే పడింది. రెండు దశాబ్దాల్లోనే వారు ఆ మార్పును కళ్ళారా చూస్తారు. ఇలా ఏ ప్రభుత్వం చేయలేదు.

‘డిమ్కి’ కథ ఇంటి ముందు నిలబడి బుర్ర కథలు చెప్పేవాళ్ళ జీవితాన్ని ఆవిష్కరించింది. ఈ కథకు యాభై వేల రూపాయల ప్రథమ బహుమతి లభించింది. ‘నేను.. మీ..’ కథ వైవిధ్యంతో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ సంపుటిలో ఈ కథ విశేషమైనది. ‘ముసురు’ కథ గీత కార్మికుల సాధకబాధకాలను కళ్ళకు కట్టింది.

కథ నేపథ్యం ఎంత బాగున్నా, కథనం ఎంతగా ఆకట్టుకున్నా, చెప్పే భాషే (యాస) కథను సామాన్య పాఠకులకు చేరవేస్తుంది. మాండలికం అనేది ముఖ్యమే అయినా కథ మొత్తం మాండలికంలో ఉండటం వలన చాలామంది పాఠకులు దూరమయ్యే ప్రమాదమే ఎక్కువ. మాండలికంలో రాయడం తప్పు కానే కాదు. రాయకూడదనీ లేదు. యాసను బతికించుకునే ప్రయత్నంలో, కథకు సహజత్వాన్ని ఆపాదించే క్రమంలో కథకులు ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు. మనం రాసింది నలుగురికి చేరితేనే ఫలితం కదా.. కాబట్టి సంభాషణలు మాండలికంలో ఉండి, నెరేషన్‌ ప్రామాణిక భాషలో ఉంటే కొంతమేర ఆ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.

మన రచన మొత్తం సమాజాన్ని మార్చలేకపోవచ్చేమో కానీ, దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలిగి, వెంటాడగలిగి, వారి మెదడులో ఆలోచనను రేకెత్తించగలిగి, అక్కడే తిష్ట వేయగలగాలి. ఆ ఆలోచన రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.

– దొండపాటి కృష్ణ

90523 26864

కథాసంపుటి : డిమ్కి

రచయిత్రి : స్ఫూర్తి కందివనం

పేజీలు : 85 ధర : రూ. 90/- లు

ప్రతులకు: 9652745117

➡️