అమ్మే మంచి స్నేహితురాలు!

Feb 25,2024 12:23 #celebrate, #Sneha

ఈషా గుప్తా బాలీవుడ్‌ చలనచిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు పొందిన బహుముఖ నటి. మిస్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ మోడల్‌ కూడా. తెర మీదనే కాదు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాలో కెరీర్‌ కంటే వ్యక్తిగత విశేషాలు, ప్రయాణాలు, ఈవెంట్స్‌, యోగా ఫొటోలు ఎక్కువగా షేర్‌ చేస్తుంటారు. స్టయిలిష్‌గా, ఫ్యాషన్‌లో అప్‌డేట్‌గా ఉండే ఇషా – బాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

న్యూఢిల్లీలో పుట్టి, పెరిగిన ఇషా గుప్తా తండ్రి ఎయిర్‌ఫోర్స్‌, అమ్మ గృహిణి. తనకో తోబుట్టువు ఉంది. డెహ్రడూన్‌లో చదివారు. మణిపాల్‌ విశ్వవిద్యాలయం నుంచి మాస్‌ కమ్యూనికేషన్‌ చేశారు. ఆమె జాతీయ స్థాయి (16 ఏళ్లలోపు) వాలీబాల్‌ క్రీడాకారిణి. 2007లో మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌గా నిలిచారు. జర్నలిజంలో తన కోర్సు పూర్తిచేసిన తర్వాత, ఈషా న్యూకాజిల్‌ యూనివర్శిటీ నుండి పర్యావరణ చట్టంలో మాస్టర్స్‌ చదివారు. కానీ మధ్యలో 2012లో నటనపై ఉన్న ఆసక్తితో ఆ దిశగా కెరీర్‌ని ప్రారంభించారు. అప్పుడే ఫెమినా మిస్‌ ఇండియాగా బెస్ట్‌ ఫొటోజెనిక్‌ ఫేస్‌గా ఎంపికై మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌లో మెరిశారు. దాంతో ఆమెకు కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ మీద ఫొటో అవకాశం కలిగింది. అలా 2012లో టెలివిజన్‌లో సిఐడీ అనే సిరీస్‌లో నటించారు. ‘జన్నత్‌ 2’, ‘రాజ్‌ 3డీ’ చిత్రాల్లో ఇమ్రాన్‌హష్మీతో కలసి నటించటంతో యూత్‌లో ఫాలోయింగ్‌ వచ్చింది. ‘చక్రవ్యూహ’, ‘రుస్తుం’ లాంటి విభిన్న చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో ‘వినయ విధేయరామ’ చిత్రంలో ఓ పాటలో కనిపించారు. ఆ తర్వాత ఇషా గుప్తా పని అయిపోందని అందరూ విమర్శించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె పెట్టిన పోస్టులకు ఎన్నో కామెంట్స్‌ వస్తూ ఉంటాయి. అవేమీ చదవను అంటారు ఆమె. ఆమెకు 2020లో ‘రిజెక్ట్‌ ఎక్స్‌’, ‘నకాబ్‌’, ‘ఆశ్రమ్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశాలు వచ్చాయి.

‘నేను కొత్తగా ఇండిస్టీలోకి వచ్చినపుడు కొందరు అదే పనిగా వచ్చి.. నీకు మేకప్‌ నప్పదు అనేవాళ్లు. మేకప్‌ ఆర్టిస్ట్‌కు దర్శకుడి సలహా ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కు తగినట్లే వేస్తారని తెలుసు. అయినా నా దగ్గరకు వచ్చి అంటుంటారు. అయితే ఇక్కడ తెల్లగా ఉండే అమ్మాయిలకు అలాంటి సమస్య ఉండదు. తెల్లగా ఉంటే బ్యూటిఫుల్‌ అంటారు. ఇక్కడ వైట్‌ స్కిన్‌ నటులదే హవా ఉంటుంది. వారికి అవకాశాలూ అలాగే వస్తాయి’ అంటుంది ఇషా.

ఔట్‌డోర్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు రెండుసార్లు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ప్లాన్‌ చేసి, తనని ఇబ్బంది పెట్టాలని చూశారని, అందుకు తాను తెలివిగా తప్పించుకున్నట్లు వివరించారు. అలాంటి వ్యక్తులు స్టార్‌ పిల్లల జోలికి వెళ్లలేరు. వెనుక, ముందు ఎవరూ లేని మహిళలపై ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారని ఘాటుగా స్పందించారు.

కొన్ని సినిమాలకు తొలి అవార్డులను గెలుచుకున్న ఈషా, అనేక వాణిజ్యపరమైన బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు. ‘యోగా అంటే ప్రాణం. ప్రతిరోజూ యోగా చేయాల్సిందే. శరీరాన్ని మాత్రమే కాదు మనసునూ శుభ్రం చేస్తుంది. మెడిటేషన్‌తో పాటు ప్రాణాయామం చేస్తా. ఫిట్‌గా ఉండటమే కాదు.. యోగాతో ఇతరులనూ ఇన్‌స్పైర్‌ చేయవచ్చు. ఎక్కువగా విదేశాల్లో విహరించే నాకు ఎప్పటికీ మా అమ్మే మంచి స్నేహితురాలు. ఎప్పుడూ స్టార్‌ను అవుతానని అనుకోలేదు. కానీ అయ్యాను. వంద శాతం ఎఫర్ట్‌ ఉంచి, మరింత పేరు తెచ్చుకోవాలి’ అంటుంది ఇషాగుప్తా. 2019లో మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ అయిన ఇషాకు ఎండోర్స్‌మెంట్స్‌ కొదువే లేదు. పర్యావరణవేత్తగా సేవా కార్యక్రమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతున్నారు ఈషా.

పుట్టినతేది : 1985, నవంబరు 28

నివాసం : న్యూడిల్లీ

వృత్తి : నటి, మోడల్‌

అవార్డులు : ఫెమినా మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ 2007, బాలీవుడ్‌ బిజినెస్‌ అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, స్టార్‌ స్క్రీన్‌ అవార్డు.

➡️