ఛాలెంజింగ్‌ పాత్రలు ఇష్టం

Jan 14,2024 07:24 #Actress, #movies, #Profiles, #Sneha
kushi ravi interview
  • కెరీర్‌ ప్రారంభంలో తల్లి పాత్ర చేయమంటే ఏ నటి అయినా కొంచెం ఆలోచిస్తుంది. కానీ యువ హీరోయిన్‌ ఖుషి రవి మాత్రం ధైర్యంగా నటించారు. ముప్పై ఏళ్ల వయస్సుకే అంత సాహసం చేశారు ఏంటి? అని అడిగితే ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది అన్నారు. కథలో ప్రేక్షకులు ఏమి కోరుకుంటారో అందుకు అనుగుణంగానే పాత్రలో నటించా అంటారు. ఈ మధ్య విడుదలైన ‘పిండం’ సినిమాలో తల్లి పాత్ర పోషించారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి నటిగా గుర్తింపు పొందారు. ఆమె గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

‘తక్కువ సినిమాలు అయినా ప్రయోగాత్మకంగా అనిపించే ఏ పాత్ర అయినా చేసేందుకు సిద్ధమే’ అంటారు ఖుషి రవి. ఈమె కర్ణాటక, మాండ్య జిల్లాలోని మద్దూరుకు చెందిన రవి, శోభ దంపతులకు జన్మించారు. అసలు పేరు సుస్మిత రవి. ఆమె ఎస్‌.ఎస్‌.ఎం.ఆర్‌.వి. కళాశాలలో బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలో చాలా ప్రయత్నాలు చేశారు. కన్నడ చిత్రం దియాతో ఆమె కన్నడ చిత్రం దియా (2020)తో కెరీర్‌ మొదలుపెట్టారు. ఇది ఘన విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడే ఆమె పేరు ఖుషి రవిగా మార్చుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు వరుసకట్టాయి. భయానక చిత్రం స్పూకీ కాలేజ్‌, నక్షే చిత్రాలలో నటించింది. అయితే, ఈ రెండు చిత్రాలు విడుదల ఆలస్యం అవడంతో, ఆ సమయంలో, ఆమె పలు లఘు చిత్రాలు, తమిళంలో ‘అడిపోలి’ అనే సింగిల్‌ రోల్లో నటించారు. ఇవి లాక్‌డౌన్‌ సమయంలో విడుదల కావడంతో ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ లభించింది.

‘సాయికిరణ్‌ దైదా కొత్త వ్యక్తి అయినా దర్శకుడుగా తనని తాను నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ‘పిండం’ కథ చెప్పినప్పుడు మేరీ అనే తల్లి పాత్ర చేయడం కరెక్టేనా మొదట ఆలోచించాను. ఎందుకంటే ఇది నా మొదటి తెలుగు సినిమా. అయితే నాకు ప్రయోగాలు చేయడం ఇష్టం. ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమా చేశాను. మేరీగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తానే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో ‘రుద్ర’ అనే మరో సినిమా చేస్తున్నాను. అందులో నేను ట్రాన్స్‌జెండర్‌ పాత్ర పోషిస్తున్నాను. ఇలా ఛాలెంజింగ్‌ పాత్రలు చేయడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. పాత్రకి ప్రాధాన్యత ఉంటే కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తాను. నేను సాధారణంగా హారర్‌ సినిమాలు పూర్తిగా చూడను. అయినా ధైర్యంగా ఈ సినిమా చేశా. ఇదే నా మొదటి సినిమా అవుతుంది. ఎంచుకుని చేయడంలో పాత్ర చిన్నదా, పెద్దదా అని లేకుండా.. కేవలం పాత్ర ప్రాముఖ్యత ఆధారంగా సినిమాలు చేస్తాను.

దియా దర్శకుడు అశోక్‌గారిని నేను గురువుగా భావిస్తాను. ఆయన నాకు విభిన్న జానర్లలో చిత్రాలు చేయాలని సూచించారు. నేను దానిని నమ్మి విభిన్న జానర్‌ సినిమాలు చేస్తున్నాను. ఒకే తరహా సినిమాలు చేసినా ప్రేక్షకులకు బోర్‌ కొడుతుంది. లాక్‌డౌన్‌ తరువాత ప్రేక్షకులు సినిమా చూసేవిధానం మారిపోయింది. ఒకప్పుడు వినోదం కోసం సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు సినిమాలో కొత్తదనం ఏముందని చూస్తున్నారు. కథలో, పాత్రలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. అందుకే ఈ సినిమాలో తల్లి పాత్ర ఇచ్చినా చేశా. దీని కోసం నేను పెద్దగా హోంవర్క్‌ చేయలేదు. ఒక పాత్రలో నటించడం కంటే, సహజంగా ఆ పాత్రలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలుగు తెలుసు కానీ స్పష్టంగా రాదు. అందుకే డబ్బింగ్‌ చెప్పలేకపోయాను. భవిష్యత్తులో చెప్తాను. టాలీవుడ్‌ హీరోల్లో అల్లు అర్జున్‌, నాని అంటే ఇష్టం. వీరి సినిమాలు వదలకుండా చూస్తా.

పేరు : సుస్మిత రవి

పుట్టిన తేది :1993 జనవరి 31

నివాసం : బెంగళూరు

జీవిత భాగస్వామి : రాకేష్‌

పిల్లలు : ఒక కూతురు

➡️