పిల్లల కోసం మనమే మారదాం..

Apr 7,2024 07:33 #Parenting, #Sneha

పిల్లలు పసిమొగ్గలు.. తెలినవ్వులు చిందించే చిన్నారులు.. అలాంటి పసివారిపై కొందరు తల్లిదండ్రులు అరిచేస్తున్నారు. మరికొందరు పేరెంట్స్‌ మరో అడుగు ముందుకేసి.. దెబ్బలు కూడా వేస్తున్నారు.. సమస్య ఎక్కడుందంటే.. తల్లిదండ్రుల్లోనే అంటున్నారు నిపుణులు. పిల్లలు అల్లరి చేస్తే కేకలెయ్యమా? వస్తువులు నాశనం చేస్తే నాలుగు వాయించమా? అంటున్నారు పేరెంట్స్‌.. అవేమీ చేయకపోతే పిల్లలు ఎలా అవుతారు? వారు చెప్పినట్లు వినాలన్నా.. పెంకిగా మారకుండా ఉండాలన్నా.. మారాల్సింది తల్లిదండ్రులే అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు.. వాళ్లు అలా మారడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు..

అవి ఏంటంటే..
పిల్లల మనసు వెన్నలాంటిది.. మనం చెప్పాల్సిన రీతిలో చెబితే చక్కగా వింటారంటున్నారు నిపుణులు. అయితే అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నారు. ఆ పద్ధతుల్లో చెబితే పిల్లలు ఎంచక్కా అమ్మానాన్న చెప్పిన మాట వింటారంటున్నారు.

పదే పదే చెప్పకండి..
పిల్లల్ని చదవమని ఒకసారి చెప్పి ఊరుకోరు తల్లిదండ్రులు.. చెప్పీ చెప్పగానే ఠక్కున పిల్లలు పుస్తకాలు తీసి, కూర్చుని గడగడా చదివేయాలి.. వాళ్లేమన్నా టీవీలా.. రిమోట్‌తో నొక్కగానే మోగడానికి.. వాళ్లు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది గమనించాలి. ఏదైనా పదే పదే చెప్పొద్దు. ఒక పని తర్వాత ఒకటి వెంట వెంటనే దండకంలా చదవకండి. పిల్లలు మీరు చెప్పిన మొత్తం పనుల లిస్టులో ఒక్కటి కూడా ఆచరించరు. అలా కాకుండా.. ఒక పని చెప్పాక అది పూర్తయ్యాకే మరొకటి చెప్పాలి. అలాగే పిల్లలు ఒక పని అవ్వగానే అభినందించి, మరో పని అప్పజెప్పి చూడండి.. పిల్లలు ఎలా చెప్పినట్లు విని, ఫాలో అవుతారో..

దగ్గర నుంచి..
పిల్లలకు వంట గదిలో పని చేసుకుంటూనో.. పేపరు చదువుతూనో.. పనులు పురమాయించకండి.. దగ్గరగా ఉండి చెప్పాలి. దూరం నుంచి మీరు ఎన్ని పనులు చెప్పినా.. వాళ్లు వినిపించుకోరు అంటున్నారు నిపుణులు. అదే దగ్గరగా ఉన్నప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చెబితే ఆ పనిని చకచకా చేసేస్తారు. అది హోమ్‌ వర్క్‌ అయినా.. బ్రెష్‌ చెయ్యమనైనా.. అలా కాకుండా దూరం నుంచి బ్రెష్‌ చెయ్యమని అరిచినట్లు చెప్పినా వినరు. వాళ్ల దగ్గరగా వెళ్లి.. వాళ్లని దగ్గరకు తీసుకుని చెప్పి చూడండి.. ఏమాత్రం పేచీ పెట్టకుండా ఎలా చేసుకుంటూ వెళతారో…

చెప్పేది వినండి..
పిల్లలకు కొందరు తల్లిదండ్రులు వరుసగా ఏమేమి చెయ్యాలో చెప్పుకుంటూ పోతారుగానీ.. పిల్లలు ఏం చెబుతున్నారో కనీసంగా కూడా ఆలకించరు. వాళ్లు చెప్పే కారణాలు ఏంటో కూడా కాస్త వినండీ.. అంటున్నారు నిపుణులు. పిల్లలు ఒక్కోసారి వంకలు వెతుకుతుంటారనీ.. వాళ్లు ఏం చెప్పినా వినేదిలేదని పేరెంట్స్‌ మొండిగా ఉంటే.. వాళ్లంతకన్నా మొండిగా తయారవు తారు అంటున్నారు నిపుణులు. అందుకే పిల్లలు చెప్పేవి
కూడా వినాలి.. వారు చెప్పే కారణాలు సహేతుకంగా ఉంటే అంగీకరించాలి. లేకపోతే.. వేషాలేస్తున్నారనేది నిర్ధారించి.. నవ్వుతూనే వారిని పనిలోకి దించాలి.

ఛాయిస్‌ ఇద్దాం..
కొందరు తల్లిదండ్రులు ఆజ్ఞలు జారీ చేస్తారు.. ‘ఆ బ్రౌన్‌ కలర్‌ ఫ్రాక్‌ వేసుకో..!’ అంటూ హుకుం చేస్తారు. ‘అమ్మా నాకు పింక్‌ కలర్‌ మిడ్డీ ఉందే.. అది వేసుకుంటా!’ అని చెబితే.. ఆలకించండి.. అదీ కాకపోతే రెండు కలర్స్‌ అక్కడ పెట్టి.. అందులో తనకు నచ్చింది వేసుకోమని చెప్పండి.. వాళ్లకో ఛాయిస్‌ ఇచ్చామనేది తెలుసుకుని సంబరపడిపోతారు. అంతేగానీ.. రూడ్లీగా చెప్పొద్దంటున్నారు నిపుణులు.
బుల్లి మెదళ్లకు ఒక్కసారి చెప్పగానే అర్థం కావు.. అలాగే విన్నా విననట్లు నటిస్తున్నారంటే.. అది వాళ్లకి అంగీకారం కాదని అర్థం చేసుకోవాలి. ఏదేమైనా చిన్నారులకు కన్విన్సింగ్‌గా చెప్పాలి అనేది నిపుణుల మాట. వాళ్లు వినాలి అంటే తల్లిదండ్రులే కాస్తంత ఓర్పు, నేర్పు, సమయం కేటాయించాలి అంటున్నారు. అలాకాకుండా.. మన దారిన మనం చెప్పుకుంటూ వెళ్లితే.. వాళ్లు ససేమిరా అనడమే. అందుకే పిల్లల్ని సుతిమెత్తగా.. సుతారంగానే చెప్పి.. నేర్పుగా పనులు చేయించాలి.. మరి అలా చేయడానికి తల్లిదండ్రులు మారాల్సిందే మరి.

 

➡️