మేస్త్రీ గురమ్మ

Apr 28,2024 07:36 #katha, #Sneha

అందమైన భవనాలున్నా చైతన్యనగర్‌ రోడ్లన్నీ నల్లతివాచీలు పరిచినట్టున్నాయి. ఎండ అభిషేకిస్తుంటే తళతళా మెరిసిపోతున్నాయి. మున్సిపల్‌ శ్రమజీవుల కండరాల్లా గట్టిగానే వున్నాయి. మధ్యతరగతి వారుండే నాల్గవ వార్డులో రోడ్లు, కాలవల్ని పరిశీలిస్తూ నడుస్తుంది మున్సిపల్‌ మేస్త్రీ గురమ్మ.
వర్కర్స్‌ అంతా ఎవరి పనుల్లో వారున్నారు. యిద్దరు చెత్త ఎత్తి ట్రాలీతో డంపింగ్‌ యార్డుకి తోలుకుపోతున్నారు. యిద్దరు రోడ్డుకిరుపక్కలా కాలువల్లో మురుగు ఎత్తి కుప్పల్లా పోస్తున్నారు. మూడవ వార్డులో గతుకులు పడ్డ రోడ్లతో, గండి పడిన కాలవలతో వర్షాలకు మరీ అసహ్యంగా మారింది. పొడుగుపారతో కుళ్ళు కాలువలో ఉన్న కల్మషాన్ని అదేపనిగా లాగుతున్నాడు ఈరయ్య.
‘ఏంటది ఈరయ్య మామా.. యిక్కడే అంతసేపుంటావేటిరా?’ అనడిగింది గురమ్మ.
‘యిక్కడ బండరాయి అడ్డుపడిపోనాదే! ఎంత లాగతన్నా రాటంనే! పైగా ఈ బురదంతా రోడ్డుమీనకి పోతన్నాది సూడు’ అన్నాడతడు.
అక్కడే వున్న తొలిక పట్టుకుని తను కాలవలోకి దిగింది గురమ్మ.
‘స సా.. దరిద్రంలోకి దిగినావేంటే గురమ్మా?’
‘అలా అసహ్యపడతావేరా మామా? మన పనే అది కదా?’ అని తొలికతో బండరాయిని కదిపి తీసి, రోడ్డు మీద పడేసింది గురమ్మ.
ఈరయ్య నీరు పోస్తే కాళ్ళూచేతులు శుభ్రంగా కడుక్కుని, కొంగుతో తుడుచుకుంది.
‘గురమ్మా! నీకెందుకే ఈ చాండాలపు పని. పైగా ఈ రోజే రిటైరైపోతున్నావుగాదా!’ అని నిష్టూరంగా అన్నాడు ఈరయ్య.
‘ఈరయ్యమామా రిటైరైతే మాత్రం నిన్ను సాధించడం మానతానేటి?’ నవ్వుతూ అంది గురమ్మ.
‘గురమ్మా! అప్పుడు యిప్పుడు ఎప్పుడూ నువ్వు మారాణివేనే!!’ అన్నాడు ఈరయ్య.
ఆ రోజు సాయంత్రం మున్సిపల్‌ ఛైర్మన్‌తో సహా సిబ్బందంతా గురమ్మను ఘనంగా సన్మానించారు. గురమ్మ భుజాల చుట్టూ శాలువా కప్పి, పువ్వుల దండ మెడ నిండుగా వేసి, చేతిలో పువ్వుల బొకే ఉంచి చప్పట్లు మార్మోగించారు. తనని గురించి, తనకు పనిలో వున్న శ్రద్ధ గురించి చాలా గొప్పగా పొగిడారు.
ఈ కార్యక్రమానికి తన ఆనందంలో పాలు పంచుకోవడానికి తన కొడుకు సింహాద్రి, కోడలు రమ కూడా వచ్చారు. గురమ్మ తన కొడుకు సింహాద్రిని ఎమ్మే వరకూ చదివించింది. పక్కవీధిలో ఉండే పోలేరమ్మని ప్రేమిస్తే మాట్లాడి, పెళ్లి కూడా జరిపించేసింది. పోలేరమ్మ అనే పేరు బాగా మోటుగా ఉందని రమగా తనే మార్చేసింది.
గురమ్మ, యింట్లో అందరికన్నా తనే ముందు లేస్తుంది. కాలకృత్యాలు తీర్చుకునేసరికి కోడలు కాఫీ సిద్ధం చేసేది. తలదువ్వి యూనిఫార్మ్‌ కోటు వేసుకునేసరికల్లా టిఫిన్‌ రెడీగా పెట్టి, భోజనం బాక్స్‌ బ్యాగ్‌లో సర్ది ఇచ్చేది. పొరపాటున తనేదైనా ఇంటిపని ముట్టుకుంటే మహాపరాధం చేసినట్టు కసుర్తుంది. అంతే!
అప్పటి నుండి యిద్దరూ అత్తాకోడళ్లలా కాక స్నేహితుల్లా ఉంటున్నారు. గురమ్మ అందరితో నా కోడలు మేలిమి బంగారం అంటుంది. యిలాంటి కోడలు రావడం నేను చేసుకున్న అదృష్టం అని అనుకుంటుంది లోలోన.
రిటైరైన మరుసటి రోజు కూడా ఉదయం అందరికన్నా ముందే లేచింది గురమ్మ. అంట్లన్నీ తోమింది. ఇల్లూ వాకిలీ తుడిచింది. హాల్లో తడిగుడ్డ వేసింది. కాఫీ చేసుకుని తాగి, ఉప్మా తయారుచేసింది. ఉప్మా చేసిన వాసన గుభాళిస్తుంటే కోడలు లేచి వచ్చింది.
అయ్యయ్యో! అత్తా, నిన్నేపనీ చెయ్యొద్దంటే వినవా? అని విసుక్కుంది.
కోడలు మాటల్లో ‘ఓ మూల కూర్చుని వుండు’ అన్న ద్వంద్వం ప్రతిధ్వనించింది.
గురమ్మ యథావిధిగా తయారైంది. ఉప్మా పెట్టుకుని తినేసి.. ‘రమా!’ అని పిలిచింది.
‘కీసీ అత్తే..’ అని వచ్చింది రమ.
‘బత్త కీసీ.. కోట కొడచ్చి..’ అని వారి భాషలో చెప్పి, బయల్దేరింది గురమ్మ.
గురమ్మ ప్రతిరోజులాగానే మున్సిపల్‌ ఛైర్మన్‌ గారింటికి, సూపరింటెండెంట్‌ గారింటికీ వెళ్ళాల్సి వుంది. అందుకే తనిప్పుడు బయల్దేరింది. ఓరోజు ఛైర్మన్‌ గారు గురమ్మని రమ్మని కబురు పంపారు. ఏం ముంచుకొచ్చిందో అన్న ఆందోళనతో వెళ్లింది గురమ్మ. అందుకు భిన్నంగా అతను – ‘గురమ్మా! వృద్ధాప్యంతో, పక్షవాతంతో మంచంపై మా అమ్మగారు పడి వున్నారు. అమ్మ ఐహిక కర్మలు చేయడానికి ఎవరినైనా చూడమని మన సూపరింటెండెంటుగారితో చెప్పాను. యిప్పటికి రెండు నెలల నుండి వాళ్ళ అమ్మకు నువ్వే చూస్తున్నావని చెప్పారు. ఎంతో సేవాభావంతో చేస్తావని కూడా చెప్పారు. ఎంత జీతం కావాలన్నా ఇస్తాను. మా అమ్మగారి ఐహిక కర్మలు కూడా నువ్వే చేసిపెట్టు’ అన్నారు.
‘అలాగే సారూ! నేను పరమార్థం కోసం సేవ చేస్తున్నాను. డబ్బులు అక్కర్లేదు సార్‌’ అంది గురమ్మ.
అలా పెద్దవాళ్లకు సహాయం చేస్తున్నా తన ఉద్యోగం అశ్రద్ధ చెయ్యలేదు ఏనాడూ. నిర్లక్షంగానూ ప్రవర్తించలేదు. రోడ్డు దాటి కొంచెం దూరం వెళ్లి, ఆటో ఎక్కబోయి ఆగింది గురమ్మ. పర్సు మర్చిపోయా అనుకుని ఇంటికి తిరిగి బయల్దేరింది. ఇంటికి చేరేసరికి తను చేసిన ఉప్మా యింటి ముందు కుక్క ఆత్రంగా తింటుంది.
లోపల సింహాద్రి ‘అదేటి రమా! ఉప్మా మొత్తం కుక్కకేసేశావు?’ అన్నాడు. రమ మౌనం వహించింది.
‘అరే.. నిన్నే అడుగుతున్నాను!’ అని ఈ సారి మరింత గట్టిగా అడిగాడు సింహాద్రి.
‘అత్తకి అసహ్యమంటే తెలీదు. ఆ చేతుల్తోనే అసహ్యాలన్నీ కడిగేసి మళ్ళీ ఆ చేతుల్తోనే వంట చేస్తోంది. యిలా అయితే మన ఆరోగ్యం ఏమవుతుంది? అందుకే కుక్కకేసేశాను’ చాలా మామూలుగా చెప్పింది రమ.
‘ఔను రమ. మా అమ్మకి అసహ్యం అంటే తెలీదు. అందుకే గుండె నిండుగా అసహ్యం నింపుకున్న నిన్ను కోడల్ని చేసుకుంది. ఐహిక కర్మల అసహ్యం సబ్బుతో కడుక్కుంటే పోతుంది. నీ గుండెల్లో నింపుకున్న అసహ్యం ఎలా పోతుంది? మా అమ్మ చేతి వంటతోనే నా శరీరం పెరిగింది. నన్ను తీర్చిదిద్దింది. నిన్ను చూడ్డానికి నాకు చాలా అసహ్యంగా వుంది. పో.. వెళ్ళిపో.. మీ పుట్టింటికి పో! ఆ అసహ్యం నుండి బయట పడ్డాక మళ్ళీ రా!!’ అన్నాడు ఆవేశంగా సింహాద్రి.
గురమ్మ గుండెల్లో కోడలికి వేసిన పెద్ద పీట అతుక్కోలేనంతగా విరిగిపోయింది. ఇంట్లో తన ప్రాధాన్యం చిన్నబోయింది. ఇకపై ఈ ఒంటిపని ఇంటిపనికి పనికిరాదని కోడలు చాలా చక్కగా తేల్చి చెప్పేసింది. ఒక నిష్టుర సత్యం బయటపడిరది. తన మనసులో దుఃఖ సముద్ర కెరటాలు ఆగాక సముద్ర స్నానం చేస్తానంటే ఎలా? ఆ కెరటాలు ఆగవు కాక ఆగవు!! వాళ్లిద్దర్నీ వేరే కాపురం పెట్టుకోమంటే సరి.. అని లోలోనే అనుకుంది. ఇంట్లో యిద్దరికిద్దరు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు.
‘మురికి చెత్తా ఎత్తిపోయడం, ఐహిక కర్మలు చేయడం ఎవ్వరికైనా అసహ్యమే! అది అందరూ చెయ్యలేరు. అత్త మనసు అర్థం చేసుకోలేకపోయాను. ”సాటి మనిషి ఐహికకర్మలు చేస్తూ మానవతా విలువను పొందగల్గుతున్నాను. ఇది నా అదృష్టం రమా!” అన్నారొకసారి. యిప్పుడు.. ఈ క్షణం నా మనసులో అసహ్యం పూర్తిగా తొలగిపోయింది. నన్ను క్షమించండి. నేను మిమ్మల్నీ అత్తనీ వదిలి ఉండలేనండి’ అంది కన్నీళ్లతో రమ.
అప్పుడే తలుపు తోసుకు వెళ్లిన గురమ్మ ‘అరే సిమ్మాద్రి! ఏనాడు మీ నాన్న నన్ను కన్నీళ్లు పెట్టనివ్వకుండా చూసుకున్నార్రా! రమని ఏడిపిస్తున్నావేరా?’ అని కోపంగా అంది గురమ్మ.
‘అత్తా!’ అని వఛ్చి అమాంతం కౌగిలించుకుంది రమ.
‘సరి సరి రా సిమ్మాద్రీ! నువ్వింట్లో ఉంటే సరికాదుగానీ తయ్యారై, ఛైర్మన్‌ గారింటికిరా. నేనక్కడే వుండి నీకోసం చూస్తుంటాను’ అని పర్సు తీసుకుని రోడ్డువైపు కదిలింది గురమ్మ.
పాపంపెద్దావిడ ఛైర్మన్‌ అమ్మ గౌరమ్మ గురమ్మ రాక కోసం దీనంగా ఎదురు చూస్తుంది. గురమ్మని చూసి ఆనందంతో ఊ ఊ అనింది. గురమ్మకి ఆమె చంటిపాపలా అనిపించింది.
‘వచ్చేసానమ్మా!’ అనంటే.. కళ్ళు ఆర్పింది. దీనంగా ఒక వెర్రినవ్వు నవ్వింది. గురమ్మ మొట్టమొదట మంచం కింద వున్న బక్కెట్లో వున్న మూత్రాన్ని తీసి, లెట్రిన్‌ బేసిన్లో పోసింది. మంచంపై నున్న ఆమెను లేవనెత్తి లెట్రిన్‌ బేసిన్‌పై కూర్చో పెట్టింది. ఆమె చీరను వేరు చేసి, బకెట్లో పడేసింది. తర్వాత బాత్రూమ్‌ గోడకు మూల కూర్చోపెట్టి, మంచంపై పాడైన దుప్పటిని తీసుకెళ్లి, బకెట్లో పడేసింది. మంచాన్ని శుభ్రపరిచి, కొత్త దుప్పటి వేసింది. పెద్దావిడకు వేడినీటితో ఒళ్ళంతా సబ్బు నురగ పట్టించి, రుద్ది శుభ్రంగా స్నానం చేయించింది. ఒళ్ళంతా తుడిచి, ఇస్త్రీ చేసిన చీర కట్టి మంచంపైకి చేర్చింది. టేబుల్‌పై వున్న ఇడ్లీ తినిపించి, పాలు తాగించింది. ‘అమ్మా! వెళ్ళొస్తానేం!’ అంది.
పెద్దావిడ కనుచూపులు గురమ్మ కాళ్లకు మొక్కుతున్నట్టున్నాయి. గురమ్మకు మాత్రమే కాదు. ఈ ప్రక్రియ ఈనాటిదే కాదు. తరతరాలుగా కేవలం ఒకే కులం వారితో వారసత్వంలా నడుస్తూ వస్తుంది. గురమ్మ కొడుకుతో పాటుగా హాల్లోకి వెళ్లింది. అక్కడే వున్న ఛైర్మన్‌ భార్య ముఖం చిట్లించి, ‘యిటువైపు వచ్చారేం?’ అంది.
ఛైర్మన్‌ రానే వచ్చారు. ‘ఏం గురమ్మా! ఇలా వచ్చారు?’ అని నవ్వు మొహంతో అడిగారు.
‘సారూ! ఈడు నా కొడుకు. తమరు దయుంచి ఏదైనా ఉద్యోగం యిప్పిస్తారని..’ అంది గురమ్మ.
‘అరరే. మొన్ననే కదా కాంట్రాక్టు లేబర్ని తీసుకున్నాం. సరేలే. ఏదో ఒకటి చేద్దాం. రేపు రెండో వార్డులో స్వీపర్‌గా చేరమను’.
‘ఛీ ఛీ వెధవబతుకు! మమ్మల్ని చూసేసరికి ఈ పని తప్ప మరే పని గుర్తుకు రాదా?’ లోలోనే ప్రశ్నించుకుంది.
‘అయ్యగారు! నా కొడుకు ఎంఏ చదువుకున్నాడండీ! అలాంటి ఉద్యోగం చెయ్యడు సారూ!’ అంది గురమ్మ.
‘సరే. అలాగైతే ఆర్టీసీ కాంప్లెక్స్‌లో స్వీపింగ్‌ క్లీనింగ్‌ కాంట్రాక్టు ఉందట.. చేస్తాడా? ఏముంది? పదిమంది పనోళ్ళని పెట్టి చేయించడమే కదా? మా తమ్ముడు రీజినల్‌ మేనేజర్‌తో చెప్పి యిప్పిస్తాను’ అన్నారు ఛైర్మన్‌.
‘వద్దు బాబుగారు. అలాంటి పనులు చేయడు’ అని తెగేసి చెప్పింది గురమ్మ.
‘అయ్యగారు! యిప్పించండి. నేను చేస్తాను. ఖాళీగా ఉండేకంటే ఏదో ఒకటి చేయడం మంచిది కదా!’ అన్నాడు సింహాద్రి. గురమ్మ కొడుకు వైపు రుసరుసా చూసింది.
‘సరే. రేపే వెళ్లి మా తమ్ముణ్ణి కలు. ఈలోగా కాంపిటీషన్‌ పరీక్షల్లో సెలెక్ట్‌ అయితే హాయిగా వెళ్ళిపో!’ అన్నారు ఛైర్మన్‌.
సింహాద్రికి కాంట్రాక్టు దక్కింది. పగలు పది మందిని, రాత్రి ఐదుగురు పనోళ్ళని పెట్టుకు ఆడుతూ పాడుతూ పని చేసుకుపోతున్నాడు సింహాద్రి. ఆ రోజు రీజినల్‌ మేనేజర్‌ నుండి రమ్మని కబురొస్తే వెళ్లి కలిసాడు సింహాద్రి. ‘చూడు.. సింహాద్రి. నాలుగు రోజుల్లో మన ఏండీ గారు ఇన్‌స్పెక్షన్‌కి వస్తున్నారు. నాలుగు రోజులు రాత్రీ పగలనకా కాంప్లెక్స్‌లోనే వుండు. నీకని యిచ్చిన కేబిన్లో వుండి, పనోళ్ల చేత మరింత శ్రద్ధగా పని చేయించు. మన స్టేషన్‌ మేనేజర్‌ సలహాలు పాటిస్తుండు’ అన్నాడతను.
చేతులు కట్టుకుని ‘అలాగే సార్‌!’ అన్నాడు సింహాద్రి. అంకిత భావంతో పని చేయడం అమ్మతో అబ్బింది. నాలుగు రోజులూ లెట్రిన్స్‌ దగ్గరగా వున్న తన కాబిన్లో వుండి, శ్రద్ధగా వర్కర్లతో పని చేయించాడు సింహాద్రి.
ఇన్‌స్పెక్షన్‌ అయిన తరువాత కానీ సింహాద్రి ఊపిరి పీల్చుకోలేదు. ఐదో రోజున ఇంటి ముఖం చూశాడు. ఆ రోజు ఉదయం నిద్ర నుండి లేవలేకపోయాడు. ఒళ్ళంతా పేల్చేస్తున్న జ్వరం. దగ్గు, రొంప, ఆయాసం, గుండెదడ. కళ్ళు మసకలు, పిల్లి కూతలు. గురమ్మ కొడుకు స్థితి చూసి, గాబరాపడింది. ఎందుకంటే యివే లక్షణాలతో తన భర్త ఎర్రయ్య చనిపోయాడు. డాక్టర్‌ దగ్గరకు తీసికెళ్లింది. మునిసిపల్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ ‘ఇది వృత్తిరీత్యా వచ్చే ఎలర్జీ. కంగారు పడాల్సిన పని లేదు’ అని మందులు రాసి యిచ్చారు. తన భర్తను మందులు కాపాడలేదు. అతని మరణం వల్లనే కారుణ్య కోటాలో తనకీ ఉద్యోగం వచ్చింది.
యిప్పుడు తన కొడుక్కి అవే లక్షణాలతో ఎలర్జీ. వెనువెంటనే సెవెన్‌ హిల్స్‌లో జాయిన్‌ చేసింది. టెస్టులన్నీ చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. ఆ రోజంతా ఆసుపత్రిలోనే ఉండిపోయింది గురమ్మ.
గురమ్మ ఒక్కరోజు రాకపోవడంతో ఛైర్మన్‌ గారూ, సూపరింటెండెంట్‌ గారూ కబుర్ల మీద కబుర్లు పంపారు. ఉన్నఫళంగా రమ్మని అటెండర్ని నాలుగుసార్లు పంపారు. రమ వచ్చినవాళ్ల గురించి ఆసుపత్రిలో వున్న అత్తతో చెప్పింది. ‘రావడానికి కుదరదని చెప్తే దబాయిస్తున్నారు అత్తా. ఆ గోల పడలేక రేపొస్తావని చెప్పినా అత్తా!’ అంది రమ.
‘సరే. నేనా సంగతి రేపు చూస్తానుగానీ డాక్టర్‌గారితో సిమ్మాద్రి సంగతి మాటాడినావా?’ అంది గురమ్మ.
‘మాట్లాడినాను. మరో నాలుగు రోజులు ఎమర్జెన్సీ వార్డులోనే ఉండాలంట’ అంది రమ.
మరుసటి రోజు ఉదయం ఛైర్మన్‌ గారింటికి వెళ్లింది గురమ్మ. సరాసరి హాల్లోకి వెళ్లి నిలుచుంది. ఛైర్మన్‌ గారి భార్య రుసరుసా చూసి ‘ఇటువైపొచ్చావేంటీ.. కర్మరా బాబూ..’ అని గొణిగింది.
ఛైర్మన్‌ గారొచ్చి- ‘గురమ్మా! ముందు అమ్మకి సపర్యలు చేసిరా!’ అన్నారు.
‘లేదయ్యగారూ! నేనందుకు రాలేదు. మా సిమ్మాద్రికి ఒంట్లో బాలేదు.. ఎమర్జెన్సీ వార్డ్‌లో వున్నాడు. నేను నా కొడుకుని చూసుకోవాలి. అందువల్ల నాలుగు రోజులు రాలేను.
‘అయితే మరెలా గుర్రమ్మా?’ ప్రశ్నించారు ఛైర్మన్‌ గారు.
‘ఈ నాలుగు రోజులు ఎలాగోలా మీరు చెయ్యండి సారూ! మా శ్రమా కష్టం సహనం అసహ్యంలేని మానవతా పోకడా మీకూ తెలుస్తుంది. ఆ అనుభవం చాలా చాలా ఇష్టపడి చెయ్యండి. ఎంత చేసినా తల్లి ఋణం తీరదంటారు. ఇలా అమ్మగారి ఋణం కాస్తయినా తీర్చుకోండి.’ అరది గురమ్మ.
‘ఐహిక కర్మలు చేయటం నా వల్ల కాదు గానీ మరెవరినయినా చూసిపెట్టు గురమ్మా!’ అన్నారు ఛైర్మన్‌.
ఇదంతా వింటున్న చైర్మన్‌ గారి భార్య మధ్యలో కల్పించుకుని ‘ఈ శ్రీరంగనీతులు నువ్వేమీ మాకు చెప్పనక్కర్లేదు. చాలు చాల్లే వెళ్లు!’ అని చాలా విసురుగా అంది.
‘సరేనమ్మా! మీకు శ్రీరంగనీతులతో పాటు నా పనీ అక్కర్లేదు కదా! అలాగే కానివ్వండి!!’ అని చకచకా నడుచుకుని, పెరటివైపు వెళ్లింది. పెద్దావిడను చూసింది. పసిపాప మల్లే దీనంగా తనపై ప్రేమతో లాలనగా చూస్తుంది. కొంగు నడుంకి బిగించి, ‘అమ్మా! మీ కోసమే వచ్చానమ్మా!!’ అని నుదుట ముద్దు పెట్టింది.

– యల్‌. రాజా గణేష్‌
9247483700

➡️