ఆ స్వేచ్ఛ నాకు ఉంది..

Feb 11,2024 06:53 #Actress, #Film Industry, #Profiles
profile about lavanya tripathi
  • చాలామంది హీరోయిన్లు సినిమా ఇండిస్టీకి ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా పెళ్లి తర్వాత నటించలేరు. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటారు. కొందరు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవ్వగా మరికొంతమంది హీరోయిన్లు కేవలం లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠీ తనకు కండిషన్స్‌ ఏమీ లేవని, సినిమాల విషయంలో ఆ స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఆమెకు, మెగా హీరో వరుణ్‌తేజ్‌తో పెళ్లి అయిన సంగతి తెలిసిందే. లావణ్య లీడ్‌రోల్‌గా నటించిన ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ వెబ్‌ సిరీస్‌ ఈ మధ్య విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విలేకర్లతో తన మనసులోని మాటలను పంచుకున్నారు.

తెలుగు ఇండిస్టీలో లావణ్య త్రిపాఠి నటించిన అన్ని సినిమాలకూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు మెగా కుటుంబంలోని కోడలు. ఇప్పటివరకూ తన సినిమాల గురించి మాట్లాడని లావణ్య ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్ల సమయంలో మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఆమె తన సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడూ అచితూచి వ్యవహరిస్తూనే ఉంటానని.. ఎక్కువ సినిమాలు చేయాలనే ఆరాటం తనకు లేదని తెలిపారు. అలాగే పెళ్లి తర్వాత తన కెరీర్‌లో వచ్చిన మార్పులపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం.. నవంబర్‌ 1న, ఇటలీలో కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

‘పెళ్లి తర్వాత కెరీర్‌ పరంగా ఎలాంటి మార్పులూ రాలేదు. మెగా కుటుంబంలోకి కోడలిగా వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలి అని నాకు ఎవరూ కండిషన్స్‌ పెట్టడం లేదు. కెరీర్‌ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్‌తేజ్‌ రూపంలో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించాడు. ఇంతకంటే ఏం కావాలి. మా వరకు మేమైతే గతంలోలాగే ఉన్నాం. నా ప్రాజెక్ట్స్‌ విషయంలో వరుణ్‌ పెద్దగా కలుగజేసుకోడు. ఎప్పుడైనా నేను ఎంచుకున్న స్క్రిప్ట్‌ గురించి చెబితే వింటాడు. తను ఈ సిరీస్‌ చూసి చాలా బాగుందని ప్రశంసించాడు’ అని లావణ్య  అన్నారు.

లావణ్య ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్లో పెరిగారు. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. మార్షల్స్‌లో స్కూల్‌ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్ళి, రిషి దయారాం నేషనల్‌ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తిచేసి, తరువాత మోడలింగ్‌లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించారు. 2006లో ఆమె మిస్‌ ఉత్తరాఖండ్‌ కిరీటం గెలుచుకున్నారు.

‘అందాల రాక్షసి’తో 2012లో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘నాకు త్వరగా పెళ్లి చేయండి నాన్నా..’ అంటూ అమాయకంగా చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి.. అభిమానులను మెప్పించాయి. ఈ చిత్రం తరువాత ‘రాధా, మిస్టర్‌, సోగ్గాడే చిన్నినాయన, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తూ శుభమస్తు, భలే భలే మగాడివోయి, దూసుకెళ్తా, ఇంటిలిజెంట్‌, యుద్ధం శరణం, అంతరిక్షం, అర్జున్‌ సురవరం, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్‌డే వంటి సినిమాల్లో వరుసగా నటించారు. ‘హీరోయిన్‌గా ఎక్కువ చిత్రాలు చేయాలని పరుగు తీయడం లేదు. సంవత్సరానికి ఒకటి చొప్పున చేస్తూ, ప్రశాంతంగా కెరీర్‌లో ముందుకెళుతున్నా. అందులో కొన్ని చిత్రాలైనా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయి’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య వీరిద్దరూ ‘మిస్టర్‌’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ 2017లో విడుదలైంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరిగింది. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. వీరి అభిరుచులు కలవటం, ఒకరంటే మరొకరికి నచ్చడంతో స్నేహం ప్రేమగా చిగురించింది. తర్వాత ‘అంతరిక్షం’ చిత్రంలోనూ కలిసి నటించారు. ఈ సినిమాతో మరింత దగ్గరయ్యారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.

పేరు : లావణ్య త్రిపాఠి, లవ్‌

జననం : 1991 డిసెంబరు 15

నివాసం : హైదరాబాద్‌

వృత్తి : నటి, మోడలింగ్‌

➡️