అంతరిక్షంలో ఆమె

Mar 3,2024 11:58 #Sneha

సాంప్రదాయకంగా పురుష గుత్తాధిపత్యంగా ఉన్న అంతరిక్ష అన్వేషణ సామ్రాజ్యపు నిలువెత్తు గోడల్ని అద్భుతంగా దాటి, విశ్వం పట్ల మన అవగాహనను మెరుగుపరచిన మహిళామణులకు వందనం. సోవియట్‌ వ్యోమగామి వాలెంటినా తెరేష్కోవా, 1963లో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మహిళ. ఆమె ప్రయాణించిన అంతరిక్ష నౌక ఆకాశపు హద్దులతో పాటు, ఈ రంగంలోని పురుషాధిక్యాన్ని కూడా చెరిపివేసి, మహిళల సామర్థ్యాలను ప్రపంచానికి చూపించారు. సాలీ రైడ్‌ 1983లో స్పేస్‌ షటిల్‌ ఛాలెంజర్‌లో అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి అమెరికన్‌ మహిళ. ఆమె సైన్స్‌ విద్యకు గణనీయంగా దోహదపడ్డారు. మహిళలు, బాలికలకు స్టెమ్‌ (ూుజువీ) అవకాశాల ఆవశ్యకత కోసం వాదించారు.

పెగ్గి విట్సన్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్‌ఎస్‌ (×ూూ)లో మొత్తం 665 రోజులు గడిపిన అమెరికన్‌ వ్యోమగామి. మైక్రోగ్రావిటీలో సంచలనాత్మక పరిశోధనలు నిర్వహించి, అంతరిక్షంలో మానవ ఆరోగ్యంపై అవగాహనకు తోడ్పడ్డారు. 2019లో క్రిస్టినా కోచ్‌ ఐఎస్‌ఎస్‌లో 328 రోజులు గడిపి, సుదీర్ఘమైన సింగిల్‌ స్పేస్‌ఫ్లైట్‌ను పూర్తిచేసిన మహిళ. మానవ శరీరంపై దీర్ఘకాల అంతరిక్షయాన ప్రభావాలపై విలువైన సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడ్డారు. మే జెమిసన్‌ 1992లో స్పేస్‌ షటిల్‌ ఎండీవర్‌లో అంతరిక్షానికి ప్రయాణించిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ. ఆమె వైద్యురాలిగా, ఇంజనీర్‌గా, న్యాయవాదిగా స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో మైనారిటీ మహిళల ఆశాజ్యోతి ఆమె. కల్పనా చావ్లా అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళ. ఆమె ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ సంపాదించి, శాస్త్రవేత్తగా పనిచేస్తూ 1994లో నాసా (NASA) వ్యోమగామిగా ఎంపికై స్పేస్‌ షటిల్‌ కొలంబియాలో రెండు అంతరిక్షయాత్రలు చేశారు. ఫిబ్రవరి 1, 2003న భూమికి తిరిగి ప్రవేశించే సమయంలో దురదృష్టవశాత్తూ స్పేస్‌ షటిల్‌ కొలంబియా పేలి, కల్పనాచావ్లాతో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది మరణించారు. సునీతా విలియమ్స్‌ సుదీర్ఘమైన అంతరిక్షయానం చేసిన మహిళ. విలియమ్స్‌ యు.ఎస్‌. నావికాదళంలో చేరి, టెస్ట్‌ పైలట్‌గా చేసి, 1998లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఎక్కువసేపు ఉండడంతో సహా పలు అంతరిక్ష యాత్రలలో ఆమె పాల్గొన్నారు. అంతరిక్ష రంగం అంటే, కేవలం శాస్త్రీయ అవగాహన, అభిరుచి మాత్రమే కాదు, గుండెల నిండా ధైర్యం, అపార ఆత్మవిశ్వాసం, అచంచల మానసిక స్థైర్యం అవసరం. వాటితో పాటు కుటుంబ సహకారం, ప్రోద్బలం మద్దతు మెండుగా ఉండాలి. ఇవి ఉన్న అబల అనుకునే ‘ఆమె’ ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో స్వైరవిహారం చేశారు. మరెందరో అమ్మాయిలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. మన బిడ్డల్ని కూడా, వారికి ఉత్సాహం, ఆసక్తి ఉన్న రంగాల వైపు ప్రోత్సహిద్దాం. ఏమో, రేపు మీ బిడ్డే చంద్రుడిపై కాలుపెడుతుందేమో, అంగారకగ్రహంపై ఆడుకుంటుందేమో!

అంతరిక్షంలో తెలుగు అమ్మాయి

గుంటూరులో జన్మించి, టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో పెరిగిన శిరీష బండ్ల, జూలై 11, 2021న, యూనిటీ 22 మిషన్‌లో భాగంగా వర్జిన్‌ గెలాక్టిక్‌ యొక్క విఎస్‌ఎస్‌ (Vూూ) యూనిటీ స్పేస్‌ప్లేన్‌లో అంతరిక్షానికి వెళ్లింది. భారత సంతతికి చెందిన మహిళగా, అంతరిక్షంలోకి ఆమె ప్రయాణం భవిష్యత్‌ తరాలకు, ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఏరోస్పేస్‌, స్టెమ్‌ రంగాల్లో కెరీర్‌ను కొనసాగించేందుకు స్ఫూర్తిదాయకం.

11 శాతం మహిళలే

మొత్తం 634 మంది అంతరిక్ష యాత్రికులలో 73 మంది మహిళలు ఉన్నారు. ఫ్రాన్స్‌, ఇటలీ, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుండి ఒక్కొక్కరు; కెనడా, చైనా, జపాన్‌ నుండి ఇద్దరు; సోవియట్‌ యూనియన్‌ / రష్యా నుండి ఆరుగురు, అమెరికా నుండి 56 మంది పాల్గొన్నారు. మొత్తంగా చూసినప్పుడు అంతిరక్ష యాత్రలో మహిళలు 11 శాతం మంది ఉన్నారు.

కాకర్లమూడి విజయ్

9849061159

➡️