తప్పు

Jan 28,2024 09:01 #Sneha, #Stories
sneha stories

రోహిణి ఇంట్లో నగలు పోయాయి. ఖరీదయినవే! జాగ్రత్త గల వ్యక్తే. అయినా ఎలా పోయాయో!. ఆమె భర్త ప్రభుత్వ కాలేజీ లెక్చరర్‌. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఊరికి అటు మూల ఒక ఫ్లాటు. ఇంకోమూల రెండు ఫ్లాట్లు కొనుక్కున్నారు. మరో ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. అయినా అద్దె ఇల్లు మాత్రం విడిచిపెట్టే ఉద్దేశంలో లేరు. వాళ్ళు ఉంటున్న వాటా బాగా కలసి వచ్చిందని వారి నమ్మకం.

ఆ సమీపంలో ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌తో పాటు పూర్తి రెసిడెన్సీ ఏరియాలు ఉన్నాయి. అయినా కాలేజీకి, నగరానికి దూరం కావడంతో ట్యూషన్లకు మంచి డిమాండ్‌. తెల తెల వారుతుండగా మొదలయ్యే బ్యాచ్లో ఇరవయి అయిదు మందికి పైగా పిల్లలు వస్తుంటారు. సెలవు రోజుల్లో అయితే క్లాసులు ఉదయం నుండి సాయంత్రం వరకు నడుస్తూనే ఉంటాయి.

రోహిణి వాళ్లు ఉంటున్న భవనాన్ని ఇల్లుగలాయన అమ్మితే కొనుక్కునే ఉద్దేశంతోనూ అక్కడే ఉంటున్నారు. అది ఇరవై ఐదేళ్లు కిందట కట్టింది. దాన్ని నాలుగు పోర్షన్లు ఉంటాయి.. గదులు విశాలంగా ఉంటాయి. చుట్టూ ప్రహరీగోడ. వెనుక భాగంలో ఇల్లుగలాయన, ఆయన భార్య ఉంటారు. వాళ్ళ వయసు అరవై ఐదు పైగానే ఉంటుంది. వాళ్ళ ఇద్దరు పిల్లలూ వేరేచోట ఉంటారు. వాళ్ళు ఇక్కడకు రావడమో, వీళ్ళు అక్కడకు వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది.

రెండో వాటాలో సుజాత వాళ్ళు ఉంటారు. మూడో వాటాలో మైథిలీ వాళ్లు ఉంటారు. రోహిణీ వాళ్ళు ఉండేది చివరి వాటాలో. పక్క పక్క ఇళ్లు కావడంతో వీరంతా కలిసిమెలిసి ఉండేవారు. ఏ పండగ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా అంతా కలిసి చేసుకునేవారు.

అద్దె కాస్త ఎక్కువే అయినా, రోహిణీ వాళ్ళాయన పనిచేస్తున్న కాలేజీకు దూరమైనా బాగా నచ్చడంతో అక్కడే ఉండిపోయారు. మైథిలీ పాత బస్టాండ్‌ దగ్గరున్న స్కూల్లో ఉర్దూ టీచర్‌గా పనిచేస్తోంది. ఇంటికి దూరమే.. సుజాత బి.ఇ.డి చేసింది. కానీ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇల్లుగల వాళ్ళతో సహా చాలా విషయాల్లో కలసిపోయి, ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా మెలగడం అలవాటయిపోయింది.

******************************

అంతా సజావుగా ఉన్న సమయంలో రోహిణీ నగలు పోయాయి మరి. రోహిణీ అందంగా ఉంటుంది. రెండు, మూడు రోజులకోసారి సున్నుపిండితో స్నానం చేస్తుంటుందని తానే అందరితో చెబుతుంటుంది. ఆమెకు ఇద్దరుపిల్లలు. ఒకడు పది, మరొకడు ఎనిమిది చదువుతున్నారు. అంత వయస్సు పిల్లలున్నారంటే ఎవరూ నమ్మరు. ఆవిధంగా తన వయస్సును కనిపించకుండా జాగ్రత్తలు పాటిస్తుంటుంది. రోహిణీకి పోయిన నగల కంటే నాలుగు రెట్లు ఎక్కువ నగలు బ్యాంకు లాకర్లో ఉన్నాయి. ఎప్పుడో కానీ అవి తీయదు.

ఇంట్లో ఏ ఖరీదైన వస్తువో కనబడనప్పుడో, పోయినప్పుడో ఎవరైనా అనుమానపడేది పనిమనిషినే! ఆ నాలుగు ఇళ్ళల్లో పనిచేసే వ్యక్తి సీతమ్మ. దొంగతనం జరిగిన రోజున ఇల్లుగలాయన, ఆయన భార్య ఊళ్ళోలేరు. వాళ్ల పెద్దకొడుకు దగ్గరకు వెళ్ళారు. రోహిణీ అనుమానం సీతమ్మ మీదకు మళ్లింది. మైథిలీతో అంది కూడా.

అందరకీ తెలుసు సీతమ్మ అలాంటి మనిషి కాదని. ఐదేళ్లుగా వారి ఇళ్లల్లో పనిచేస్తుంది. వస్తువులు పోయినట్లు ఫిర్యాదులు లేవు. ఒకరింట మాటలు మరొకరికి చెప్పే మనస్థత్వమూ లేదు. నిజానికి సీతమ్మ.. రోహిణీ వాళ్ళింట్లోనే ఎక్కువసేపు ఉండేది. చనువుగానూ మాట్లాడుకుంటుంటారు. రోహిణీ నగలు ఉదయం పోతే ఆ వార్త అందరికీ తెలిసేసరికి సాయంత్రం అయింది. ఆమె తమ పడక గదిలోని డ్రెస్సింగ్‌ టెబుల్‌ సొరుగులో రెండు జతల బంగారపు గాజులు, తాళిబొట్టు తాడు, రెండుపేటల గొలుసు, ఉంగరం పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చేసరికి కనిపించలేదు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడు. అతను ఇల్లు దాటి ఏ పని అయినా బయటకు వెళ్ళాలంటే రోహిణీ ఎదురురావాలి. ఆమె ఎదురొస్తే తన పనిలో ఎటువంటి అవాంతరాలు రావని అతని నమ్మకం. అందుకని ఆగాడు.

ఆమె భర్త వరండాలోని మడత కుర్చీలో కూర్చుని ఉన్న సమయంలో సీతమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఇల్లు ఊడ్చి, తడిగుడ్డతో తుడిచింది. తడి ఆరడానికి రెండు గదుల్లోని ఫ్యాన్లు వేసింది. షింకులోని అంట్లు తోముతున్నప్పుడు రోహిణీ స్నానాల గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె వచ్చిన కొద్దిసేపటికి అతను కాలేజీకి వెళ్ళిపోయాడు. సీతమ్మ పని పూర్తిచేసుకుని వెళ్ళిపోయాక డ్రెస్సింగ్‌ టేబుల్‌ సొరుగు తీస్తే నగలు లేవు. ఆ రోజు పండుగ కావడంతో ఎవరూ బయటకు వెళ్ళలేదు. మైథిలీ స్కూలుకు వెళ్ళలేదు.

ఈ విషయాలన్నీ రోహిణీ అందరికీ చెప్పి, ‘ఇది సీతమ్మ పనే అయి ఉంటుంది’. అంది.

అందరకీ తెలిసి సీతమ్మ దొంగబుద్ధి ఉన్న మనిషేమీకాదు. మైథిలీ ‘నగలు కనిపిస్తుంటే ఎవరికయినా కళ్ళు కుట్టవా?’ అంది.

అప్పటికే రోహిణీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ‘పోలీస్‌ రిపోర్టిస్తాను’ అంది.

బావుంటుందా.. అని అందామని అనుకున్నా ఎవరూ బయటకు అనలేదు.’దానికి ముందు అన్నీ మరోసారి వెతుకు’ అంది మైథిలీ.

‘డ్రెస్సింగ్‌ టేబులే కాదు, బీరువాలు, అన్ని సొరుగులూ ఒక్కసారి కాదు మూడు నాలుగుసార్లు వెతికాను. ప్చ్‌.. లేవు నా ఖర్మ’ అని చేత్తో తలకొట్టుకుంది.

కొద్దిసేపు ఆగి, భర్తకు ఫోన్‌ చేసింది. అరగంటలో అతను వచ్చారు. ఇద్దరూ కలసి కంప్లెయింట్‌ చేయడానికి బండి మీద స్టేషన్‌కు వెళ్ళారు.

గంట తర్వాత పోలీసులు వచ్చి సీతమ్మని, ఆమె భర్తను స్టేషన్‌కి తీసుకు వెళ్ళారు. ఆ సంఘటన ఆ నాలుగు కుటుంబాలను కలచివేసింది. పోలీసులు రావటం, అక్కడ అందరనీ విచారించడం బాధగా అనిపించింది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎవరికీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు.

మరుసటి రోజు ఆదివారం. పిల్లలకు స్కూలు లేదు. క్యారేజీలు కట్టే పని ఉండదు. దాంతో ఇంకాస్త సమయం పడుకునే ప్రయత్నం చేశారు. మెలకువ వచ్చేసరికి ఉదయం పది కావస్తోంది. అందరూ నిద్రపోతున్నారు. మైథిలీ మరి కొంతసేపు నిద్రపోయి ఉండేదే. తలుపు ఎవరో తడుతుంటే మంచం దిగక తప్పలేదు. గడి తీసి తలుపు తెరిచింది. ఎదురుగా సుజాత నిలబడి ఉంది. ముఖం సంతోషంతో నిండి ఉంది.

‘నీకు రెండు మంచి వార్తలు. మొదటిది సీతమ్మను, ఆమె భర్తను నిన్న రాత్రే ఎనిమిదింటికి వదిలిపెట్టేశారు. రెండోది రోహిణీ నగలు పోలేదు. వాళ్ళ స్నానాల గది గూట్లో పెట్టి మర్చిపోయిందట. ఈవేళ చూసుకుంటే పెట్టిన చోటే ఉన్నాయంట. చూడు సీతమ్మ మీద అనవసరంగా నెపం వేసి, పోలీస్టేషన్‌ వరకూ తీసుకెళ్ళింది. అన్యాయం కదూ? స్టౌ మీద పాలు పెట్టి వచ్చాను. కొద్ది సేపాగాక వస్తాను’ ఎంత త్వరగా చెప్పిందో, అంత త్వరగా వెళ్ళిపోయింది.

ఇంట్లో అందరూ సంతోషపడ్డారు. కానీ సీతమ్మ మీద అంత పెద్ద అపవాదు వేసినందుకు కలిగిన బాధ ఎవరిలోనూ తొలగిపోలేదు. మన వల్ల తప్పు జరిగినప్పుడు ఎదుటివాళ్ళ చేతులు పట్టుకుని క్షమించమని అడగడానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు. సీతమ్మ వస్తే.. క్షమించమని అడగాలని ఎవరి మనసుల్లో వారు అనుకున్నారు. సీతమ్మ వస్తుందనే నమ్మకం ఉంది. రోహిణీ ఏం చేస్తుందో చూడాలి అనుకున్నారు.

పన్నెండింటికి సీతమ్మ కాంపౌండ్లోకి వచ్చి సరాసరి మైథిలీ ఇంటికి వచ్చింది. స్టేషన్లో పోలీసులు కొట్టారనుకుంటాను.. చేతుల మీద దెబ్బలు ఉన్నాయి. ముఖం వాచిపోయి ఉంది. ఆమే మైథిలీ చేతులను చేతుల్లోకి తీసుకొని, కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది. మూడు నాలుగు నిమిషాలయ్యాక దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ‘ఇయాల్టి నుండి నేనెవరి ఇంట్లోనూ పనిచేయదల్చుకోలేదమ్మా మానేత్తున్నా’ అని కన్నీళ్ళు తుడుచుకుంది.

ఈ మాట అంటుందని ఊహించారు. సీతమ్మలాంటి పనిమనిషి దొరకడం కష్టం. ‘తప్పు చేసింది నీవు కాదుగా!’ అంటుంటే మైథిలీ మాటలకు అడ్డు తగులుతూ ‘పెద్ద దెబ్బె తగిలిందమ్మా నేనీడ ఉండలేను. మా ఊరెళ్ళిపోతాం!’ అంది సీతమ్మ.

‘నీ పిల్లల చదువో?’

‘మా ఊళ్ళో బళ్ళు లేవా? ఆడ చదువుకుంటారు. నాలుగు రాళ్ళు ఎనకేసుకుందామని పట్నానికి ఒత్తే ఎంత గోరం జరిగింది! ఈ బతుకు మాకొద్దమ్మా’.ఆ నెలలో వారం అయినా పని చేయకపోయినా అందరూ నెల జీతం ఇచ్చారు సీతమ్మకు. కొత్త చీర ఒకటి ఇచ్చారు. అక్కడ ఇంటి నుండి సుజాత వాళ్ళింటికి వెళ్ళి, అక్కడో పావు గంట ఉంది. సీతమ్మ రాక గమనించిన రోహిణీ ఇంటి బయటకు వచ్చి, నడుం మీద చేతులు వేసుకుని మెట్ల మీద నుంచుంది. ఆమె భర్త కూడా చివరికంటూ వచ్చి స్థంభానికి ఆనుకుని నిలబడ్డాడు. గాలి బిగుసుకు పోయి, నిశ్శబ్దంగా ఉంది. సీతమ్మకు రోహిణీతో మాట్లాడడం ఇష్టంలేక ముఖం తిప్పుకుంది.

సుజాత వాళ్ళింట నుండి గేటు వరకూ వెళ్లింది.

‘సీతమ్మా మాట’ అంది రోహిణి. మెయిన్‌ గేట్‌ వరకు వెళ్ళిన సీతమ్మ ఆగి, వెనక్కి తిరిగింది.

‘పొరపాటై పోయింది సీతమ్మా…’ అని రోహిణీ అంటుంటే సీతమ్మ కళ్ళనిండా నీళ్ళు నింపుకుంటూ కంఠస్వరం పెంచుతూ.. ‘పొరపాటు నీదికానే కాదే తల్లీ! నాది.. మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు శ్యాంబాబు మద్దేళపూట వస్తుంటే, నువ్విచ్చే వందా, రెండొందలకు కక్కుర్తిపడి గది బయట కాపలాగా కూర్చునేదాన్నే.. అదమ్మా నా పొరపాటు’ అంది ఏడుస్తూ. చప్పుడు కాకుండా చీకటి గుండె పగిలినట్లనిపించింది రోహిణీకి.

– ఈతకోట సుబ్బారావు, 94405 29785

➡️