తిరిగి తెరపైకి సోనాలీ

May 12,2024 10:58 #Cancer, #Sneha, #sonali bindre

‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాలీ బింద్రే. పెళ్లి తర్వాత ఇండిస్టీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే సిరీస్‌తో తెరపై కనిపించారు. దానికి కొనసాగింపుగా వస్తున్న ‘ది బ్రోకెన్‌ న్యూస్‌ 2’ లోనూ నటించి, ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.

సోనాలి బింద్రే మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆమెకు ఓ అక్క, చెల్లి ఉన్నారు. ఆమె తండ్రి జిత్‌ బింద్రే సివిల్‌ సర్వెంట్‌. తల్లి రూప్సి బింద్రే గృహిణి. బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో సోనాలీ పాఠశాల విద్యను చదివారు. ముంబైలోని రామ్‌నారాయణ్‌ రుయా కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆమె తండ్రి సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడంతో రెండు, మూడేళ్లకోసారి ఏదో ఒక నగరానికి బదిలీ అవుతుండేవారు. దాంతో సోనాలికి దీర్ఘకాల స్నేహితులు లేకపోయారు.
ఆమె మోడలింగ్‌ చేయాలని ఎప్పుుడూ అనుకోలేదు. తన కాలేజీలో జరిగిన ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌ చేయాల్సిన అమ్మాయి ఆ రోజు రాలేదు. ఆమె స్థానంలో సోనాలీని చేయమని స్నేహితులు కోరారు. అప్పటి వరకూ ఆమె ఎప్పుడూ అటువంటి డ్రస్‌లు ధరించలేదు. అయినా ఆమె బాగా చేసి, మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమెకు మోడలింగ్‌ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కానీ సోనాలీకి డ్యాన్స్‌ కూడా పెద్దగా రాదు. దాంతో ఆమెకు మొదట్లో ఇండిస్టీల్లో అవకాశాలు రాలేదు. ‘డ్యాన్స్‌ రాకపోతే కథానాయికగా రాణించలేమన్నది అప్పట్లో అందరి అభిప్రాయం. డ్యాన్స్‌లో నైపుణ్యం లేదని ఎంతోమంది కొరియోగ్రాఫర్లతో దర్శకులు చీవాట్లు పెట్టేవారు. అది భరించలేక పోయాను. తర్వాత నాకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా డ్యాన్స్‌ నేర్చుకునేదాన్ని.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాలీవుడ్‌ చిత్రం ఆగ్‌ (1994) సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోనాలీ ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. తమిళ చిత్రం (కధలర్‌ ధీనం), కన్నడ చిత్రం ప్రీత్సే, తెలుగు చిత్రం ‘మురారి’, ‘అనాహత్‌’ మరాఠీ చిత్రాల ద్వారా అన్ని ఇండిస్టీల్లోనూ అవకాశాలు సంపాదించారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు. ‘క్యా మస్తీ క్యా ధూమ్‌’ అనే టీవి ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించారు. సోనాలీ బింద్రే సర్ఫరోష్‌, హమ్‌ సాథ్‌ సాథ్‌ హై వంటి హిట్‌ సినిమాల్లో నటించి, పేరు తెచ్చుకున్నారు. ఇండియాస్‌ బెస్ట్‌ డ్రామెబాజ్‌, డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ వంటి రియాల్టీ షోలకూ న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.
‘బొంబాయి’ సినిమాలో ‘హమ్మా.. హమ్మా’ పాటలో సోనాలీకి అవకాశం వచ్చింది. ఎలాగైనా ఈ పాటకు మంచి గుర్తింపు సంపాదించాలన్న పట్టుదలతో డ్యాన్స్‌ మాస్టర్‌ రాజు సుందరంతో కలిసి బాగా ప్రాక్టీసు చేశారు. ఆ ప్రదర్శన ఎవరికీ నచ్చకపోతే ఇక ఎప్పటికీ ఇండిస్టీకి రాకూడదనుకున్నారు. కానీ ఆ పాట విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ పాట సోనాలీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

క్యాన్సర్‌తో పాఠాలు..
సోనాలీకి హై-గ్రేడ్‌ మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు 2018లో నిర్ధారణ అయింది. ‘క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న వారి జీవితాలు క్యాన్సర్‌కు ముందు.. క్యాన్సర్‌ తర్వాత అన్నట్లుగా ఉంటాయి. నా శరీరంపై సర్జరీ గాయం అలాగే ఉంది. శరీరంలో వచ్చే మార్పులను స్వీకరించాలి. మనిషి తన జీవితంలో ఏదో ఒక దానివల్ల పాఠాలు నేర్చుకోవాలి. నేను క్యాన్సర్‌ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇది లక్ష్యం మాత్రమే కాదు, ఒక ప్రక్రియ. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్‌మెంట్‌ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నేను ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్యులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరంగా ఇంటికి పంపుతామని తెలిపారు’ అంటూ క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు సోనాలి.
వైద్యం తర్వాత కూడా 49 ఏళ్ల వయస్సులోనూ సినిమాలో నటిస్తున్నారు. ‘ప్రస్తుతం మహిళా ప్రాధాన్య చిత్రాల సంఖ్య పెరుగుతోంది. ఈ వయసులో కూడా నాకు మంచి పాత్రలు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ”ది బ్రోకెన్‌ న్యూస్‌ 2” లో అమీనా ఖురేషిగా నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని తాను చేసిన పాత్ర గురించి చెప్పారు.

పేరు : సోనాలీ బింద్రే
పుట్టిన తేది : 1 జనవరి 1975
వృత్తి: నటి, మోడల్‌, రచయిత
భర్త : గోల్డీ బెహ్ (పారిశ్రామికవేత్త)
కొడుకు : రణవీర్‌ బెహ్

➡️