ఆంతర్యం

May 5,2024 08:27 #kadha

ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే కంగుతిన్నాడు గోపాలరావు. మంచానికి ఎదురుగా ఉన్న ఇనుప బీరువా తలుపు బార్లా తెరిచి ఉంది. ఆయన గుండె గుభేలుమంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చటుక్కున మంచం దిగి, బీరువా దగ్గరకు వెళ్లి, సొరుగు లాగి చూశాడు. నిన్న సాయంత్రం తాను అందులో పెట్టిన పది లక్షల రూపాయల బ్యాగ్‌ కనపడలేదు. కింది అరలో ఉన్న వెండి వస్తువులు భద్రంగానే ఉన్నాయి. లాకర్‌వైపు చూశాడు. అదీ క్షేమంగానే ఉన్నది. ‘సీక్రెట్‌ కోడ్‌ ఉండబట్టి, దొంగ వెధవకు అది లొంగలేదు’ అనుకున్నాడు.
కంగారుగా ‘జానకీ.. జానకీ..’ అంటూ భార్యను తట్టి పిలుస్తూ నిద్ర లేపాడు. ఆమె బద్దకంగా లేస్తూ ‘అబ్బబ్బా.. ఏమిటండీ మీకు అప్పుడే తెల్లారిందా’ అన్నది. నాకు తెల్లారడంకాదే వెర్రిముఖమా.. మన బతుకే తెల్లారి పోయేటట్లున్నది. బీరువాలో నిన్న నేను పెట్టిన డబ్బు కనపడటంలేదు. నవ్వేమైనా తీశావా?’ అడిగాడు ఆదుర్దాగా.
‘ఏ డబ్బులండీ.. నాకేమీ తెలియదు. నేనెందుకు తీస్తాను? అయినా డబ్బు వ్యవహారం అంతా మీరే చూసుకుంటారు గదా.. నన్నడుగుతున్నారేమిటీ..’ అన్నది అయోమయంగా.
‘నేను లేచేసరికి బీరువా తలుపు బార్లా తెరిచి ఉంది. సొరుగులో డబ్బు లేదు’ ఆయాసంతో రొప్పుతున్నాడు గోపాలరావు.
వీళ్ళ మాటలకు ‘ఏమయింది కంగారు పడుతున్నారేంటి’ అంటూ వచ్చారు కొడుకు, కోడలు కుడివైపు గదిలో నుండి. ‘ఏం జరిగింది? అంత గాబరా పడుతున్నారు అంటూ కూతురు, అల్లుడు ఎడమవైపు గదిలోంచి వచ్చారు.
‘నిన్న సాయంత్రం నాన్నగారు ఈ బీరువాలో పెట్టిన పదిలక్షలు కన్పించడం లేదు’ అన్నది ఏడుపు గొంతుతో జానకి.
‘సరిగ్గా చూశారా నాన్నగారూ.. మీరు ఇంకెక్కడయినా పెట్టి మర్చిపోయారేమో.. గుర్తుతెచ్చుకోండి’ అన్నాడు కొడుకు గోవిందు.
‘లేదురా.. నాకు బాగా గుర్తుంది. ప్రకాశరావు మామయ్య తెచ్చిచ్చిన బ్యాగు నేను అలాగే ఈ సొరుగులో పెట్టాను. ఇప్పుడు బ్యాగూ లేదు. డబ్బూ లేదు. ఏమయిపోయాయో అర్థంకావడం లేదు’ చెప్పాడు గోపాలరావు.
‘డబ్బు ఎలా పోయిందంటారు మామయ్యా, మీరు బీరువాకి జాగ్రత్తగా తాళం వేశారు గదా.. తాళం చేతులు ఎక్కడ పెట్టారు..?’ అరా తీశాడు అల్లుడు అరవింద్‌.
‘అమ్మో.. నా నగలు.. వెండి వస్తువులు ఏమయ్యాయో..?’ కోడలు రజని గబగబా బీరువా దగ్గరికి వచ్చింది గుండెలమీద చేతులు వేసుకుని.
‘అవన్నీ క్షేమంగానే ఉన్నాయి. నా డబ్బే..’ నీళ్ళు నమిలాడు గోపాలరావు.
‘అవేవీ ముట్టుకోకుండా కేవలం మీ డబ్బే పట్టుకెళ్ళాడా నాన్నగారూ దొంగ..? సిఐడిలా ప్రశ్నించింది కూతురు కుముద.
‘అయితే ఇది తప్పకుండా సుందరం బాబాయి పనే అయ్యింటుంది. నిన్న ప్రొద్దున ఊరి నుంచి వచ్చినవాడు రాత్రికే కంగారుగా వెళ్ళిపోయాడు’ అన్నాడు కొడుకు గోవిందు.
‘పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దాం.. వాళ్ళు నాలుగు ఉతికితే అన్నీ బయట పడతాయి’ అన్నాడు అల్లుడు.
‘ఛ..ఛ.. వాడెందుకు అలాంటి పని చేస్తాడు? అన్నాడు గోపాలరావు బాధపడుతూ.
‘మీరే చెప్పారుగా నాన్నా.. గతంలో మన బంధువుల ఇళ్ళల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయని.. కచ్చితంగా ఇది బాబాయి పనే..’ అన్నది కుముద.
‘అయితే ఇప్పుడే పోలీసులకు ఫోన్‌ చెయ్యండి..’ అన్నది రజని ఆవేశంగా.
‘ఆగండి.. తొందరపడకండి.. ఆ డబ్బు దొరుకుతుందేమో చూద్దాం..’ అన్నాడు గోపాలరావు తలపట్టుకుని, మంచం మీద కూలబడుతూ.
‘తొందరపడకుండా ఎలా ఉండమంటారు.. ఒకటా.. రెండా.. పది లక్షలు..’ అన్నది కోడలు.
‘నిజమేనమ్మా.. కానీ ఇది మన పరువుకి సంబంధించిన విషయం. ఒకవేళ వాడు గనుక ఆ డబ్బు తియ్యకపోతే చాలా బాధపడిపోతాడు.. వద్దు.. పోలీసులకు ఫోన్‌ చెయ్యొద్దు..’ అన్నాడు గోపాలరావు.
‘మీకు ఇంకెవరిమీదయినా అనుమానం ఉందా మామయ్య గారూ..?’ అడిగాడు అల్లుడు.
‘నాకు ఇంకెవరిమీదా అనుమానం లేదు అరవింద్‌..’ అని గోపాలరావు అంటుండగా పెరటి తలుపు తీసి వున్నది. ఎవరు తీశారు?’ అడిగింది కుముద అటు వెళ్ళి వస్తూ.
‘మేమెవరం తియ్యలేదు’ అన్నారు అందరూ.
జానకికి కోపం వచ్చింది. ‘మీరెప్పుడూ ఇంతే.. మీ బంధువుల మీద ఈగ కూడా వాలనివ్వరు. అల్లుడు అన్నట్లు పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దాం’ అన్నది జానకి.
గోపాలరావు ఉస్సూరని నిట్టూరుస్తూ పడక కుర్చీలో కూలబడ్డాడు.

ఆ మధ్యాహ్నం ఎస్సైగారు ఎంక్వయిరీకి వచ్చారు. అన్ని వివరాలూ అడిగారు. అందరినీ బోలెడు ప్రశ్నలు వేశారు. కొడుకు, అల్లుడు ఏమి ఉద్యోగాలు చేస్తున్నారు..? కూతురు, అల్లుడు ఏ ఊళ్ళో ఉంటారు? వాళ్ళిక్కడికి ఎప్పుడు వచ్చారు? లాంటివి.
‘ఇంతకీ అంత డబ్బు మీకు ఎక్కడిది..?’ గోపాలరావుని అడిగాడు ఎస్సై.
‘అది నా రిటైర్మెంట్‌ సొమ్ము. బ్యాంకులో వేద్దాం అని నేను అనుకుంటున్నప్పుడు నా స్నేహితుడు ప్రకాశరావు ఇల్లు కొనుక్కుంటూ ఒక ఆరునెలల్లో ఇస్తాను. డబ్బు ఇవ్వమని అడిగాడు. ఇచ్చాను. అతను నిన్ననే తిరిగిచ్చాడు. నేను వెంటనే బీరువాలో పెట్టాను’
‘నిన్న మీ ఇంటికి కొత్తవాళ్ళు ఎవరైనా వచ్చారా..?’ కొత్తవాళ్ళు ఎవరూ రాలేదు కానీ పొద్దున్నే పెరటి తలుపు తీసి ఉన్నట్లు చూశాం. ఆ దొంగ వెధవ ఎవరోగానీ పెరట్లోంచి పారిపోయి ఉంటాడు. వాణ్ణి ఎలాగైనా సరే మీరు పట్టుకోవాలి..’ అన్నాడు గోపాలరావు భార్య తెచ్చిన కాఫీ కప్పు ఎస్సైకి ఇస్తూ.
ఆయన తీరుబడిగా కాఫీ తాగి ‘మేము ఎంక్వైరీ చేస్తాం లెండి’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

నాలుగు రోజుల తర్వాత వచ్చిన ఎస్సై ‘దొంగ దొరికాడు’ అన్నాడు.
‘దొంగ దొరికాడా..’ ఆత్రంగా అందరూ ఒకేసారి ప్రశ్నించారు.
‘ఆ దొంగను స్టేషన్‌లో పెట్టారా.. మేము చూడచ్చా..?’ అడిగింది కూతురు.
‘ఆ దరిద్రుణ్ణి చూసేదేమిటి.. అటువంటి వాళ్ళను చూసినా పాపమే..’ అన్నది జానకి.
‘మా డబ్బు మొత్తం దొరికింది గదా సార్‌’ అడిగింది కోడలు.
అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఎస్సై జవాబు కోసం.
‘అసలు డబ్బు పోతే గదా.. దొరికేందుకు..! ఆ డబ్బంతా క్షేమంగా మీ ఇంట్లోనే ఉంది. దొంగ కూడా మీ ఇంట్లోనే ఉన్నాడు’
‘మా ఇంట్లోనా..?’ ఆశ్చర్యంతో అందరి నోళ్ళూ తెరుచుకున్నాయి.
‘దొంగ మీ ఇంటి వాడయినప్పుడు మీ ఇంట్లోనే ఉంటాడు గదా..’
‘మా ఇంటివాడా..? ఎవరు సార్‌..?’ అందరూ అనుమానంగా మిగిలిన వాళ్ళను చూశారు. మమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టి చంపకుండా దొంగ ఎవరో త్వరగా చెప్పండి’ అన్నారు అందరూ కోరస్‌గా.
‘ఏం సార్‌… చెప్పమంటారా..’ నవ్వుతూ గోపాలరావును చూశాడు ఎస్సై.
‘చెప్పండి. వాళ్ళకు తప్పక తెలియాలి’ అన్నాడు గోపాలరావు.
అందరూ ఎస్సైనీ, గోపాలరావునీ వింతగా చూశారు.
‘ఆ దొంగ మీ నాన్నగారేనయ్యా..’
‘మా నాన్నగారా..’ మరోసారి అందరూ నోళ్ళు తెరిచారు.
‘ఈయన చేసిన పనివల్ల మాకు టైమూ, డబ్బూ రెండూ ఖర్చయ్యాయని కోపం వస్తోంది. కానీ, ఈ పని వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని గమనించాక ఈయన్ను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోయాను. అలాగే మీరు కూడా మీనాన్నగారి దారిలో నడవాలని కోరుకుంటున్నాను.’
‘కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్‌’ అన్నాడు గోవిందు సస్పెన్స్‌ భరించలేక.
‘ఏమీ లేదయ్యా.. అంతా మీకు తెలిసిన విషయమే.. ఇప్పటివరకూ ఈయన ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్దచేశారు. చదువులు చెప్పించారు. పెళ్ళిళ్ళు చేశారు. మీరూ మంచి ఉద్యోగాలు సంపాదించారు. పిల్లా పాపలతో అందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు మీకు దేనికీ లోటు లేదు. అవునా?
అవునన్నట్లుగా అందరూ తలలూపారు. కానీ దొంగ ఎవరో చెప్పమంటే ఈయన ఈ సోది చెబుతున్నాడేమిటని విసుగ్గా చూస్తున్నారు.
‘మీ చూపుల భావం నాకు అర్థమయింది. ఆ విషయానికే వస్తున్నాను. మీ నాన్నగారికి పదిలక్షల పైన రిటైర్మెంట్‌ డబ్బు వచ్చింది. ఆయన ఆ డబ్బు తన స్నేహితులు నిర్మిస్తున్న అంధ బాలల పాఠశాలకు విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ, మీ అమ్మగారికి అది ఇష్టంలేదు. మీకూ ఇష్టం లేదు. అందుకని మీ అందరికీ ఏవేవో అవసరాలు గుర్తొచ్చాయి. అందువల్ల మీరు ఆయన్ని డబ్బు ఇవ్వకుండా చేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టంలేక ఒకపక్కా.. ఆ పాఠశాలకు సాయం చెయ్యాలన్న తన ఆశను అణుచుకోలేక మరో పక్కా చాలా సతమతమయ్యారు. చివరికి ఈ విధంగా ప్లాన్‌ వేశారు. కానీ ఈయన చేసిన చిన్న పొరపాటు వల్ల ప్లాన్‌ బెడిసి కొట్టింది. దొంగతనం ఇంట్లో కాకుండా ఏ బజారులోనో పోయిందని చెప్పి వుంటే ఆయన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేది. ఆయన కోరిక తీరేది. ఇంట్లోనే పోయిందని చెప్పేసరికి దొరికిపోయారు. అదీగాక ఈ విషయం మాదాకా వస్తుందని ఈయన ఊహించలేదు. అయినా ఫర్వాలేదు. కథ సుఖాంతమే గదా..’ అంటూ లేచాడు ఎస్సై వెళ్ళిపోవడానికి.
‘మీరందరూ నన్ను క్షమించండి. అందర్నీ బాధపెట్టాను’ అన్నాడు గోపాలరావు తలవంచుకుని.
‘మీరే మమ్మల్ని క్షమించాలి నాన్నా.. మీ మంచి మనసును అర్థం చేసుకోకుండా.. మీరు చెయ్యబోయిన గొప్ప పనిని ప్రోత్సహించకుండా మేము అడ్డుపడ్డాము. మీరు అన్నట్లు మనకు అన్నీ ఉన్నాయి. హాయిగా, సుఖంగా ఉన్నాం ఏ లోటూ లేకుండా. కానీ, ఏమీ లేని ఆ అనాధ బాలలను మనలాంటి వాళ్ళమే ఆదుకోవాలి. అది మన ధర్మం. కర్తవ్యం కూడా.. ఆలోచన లేకుండా మేము చేసిన తప్పుకు మీరే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి నాన్నా..’ అన్నాడు గోవిందు తండ్రి చేతులు పట్టుకుని.
చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నట్లుగా కుటుంబ సభ్యులందరూ ఆయన చుట్టూ చేరారు. జానకి భర్త మనసును తాను కూడా అర్థం చేసుకోలేక పోయినందుకు చిన్నబోతూ ఆయన వంక చూసింది.
గోపాలరావు తేటపడిన మనసుతో నవ్వుతూ అందరినీ చూశాడు.
‘మా నాన్నగారే ఇదంతా చేశారని మీకు ఎలా తెలిసింది సార్‌..’ అడిగాడు గోవిందు వెళ్లిపోతున్న ఎస్సైని ఆపి.
‘ఆయనే చెప్పారయ్యా.. వస్తువు ఒకచోట ఉంటే అనుమానం పదిచోట్ల ఉంటుంది. అలా ఈ నింద ఇంకెవరి మీదయినా పడుతుందేమో.. వారిని అన్యాయంగా బాధ పెట్టడం అవుతుందని ఆయనే స్వయంగా నాకు చెప్పారు. అందువల్లే విషయం తొందరగా తేలిపోయింది. చివరికి మీరందరూ హ్యాపీనే కదా… ఎలాగైనా మీ నాన్నగారు గొప్ప మనిషయ్యా..’ అన్నాడు ఎస్సై.
‘నిజమే సార్‌.. కానీ, మేమే ఆయన్నీ, మిమ్మల్నీ కూడా ఇబ్బంది పెట్టాం.. క్షమించాలి సార్‌’ అన్నాడు గోవిందు.
‘ఇట్సాల్‌ ఓకే..’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు ఎస్సై.

కోపూరి పుష్పాదేవి
9440766375

➡️