సంఘ్ జీన్స్‌లోనే స్త్రీ వ్యతిరేకత

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌), దాని రాజకీయ విభాగం భారతీయ జనతాపార్టీ (బిజెపి) మహిళల పట్ల అనుసరించే వైఖరి మనువాద భావజాలాన్ని బరితెగింపు ధోరణితో ముందుకు తీసుకెళ్లడమే. అందువల్లే వారి మాటలు, చేతలు, సోషల్‌ మీడియా వేదికగా మహిళలను తీవ్రంగా కించపరిచే వ్యాఖ్యలు మన ముందుకు వస్తూనే ఉంటాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శ్రేణులు నేడు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మొదలైన సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలు, అర్ధసత్యాలను అలవోకగా వ్యాపింపజేస్తున్నాయి. ‘ఇంటి పనుల కోసమే ఇల్లాలు.. భర్తను ఆమె సుఖపెట్టాలి.. ఆమె అవసరాలు భర్త తీర్చాలి. ఇది సామాజిక ఒప్పందం.. దీనికి కట్టుబడి ఉన్నంత వరకే కాపురం.. ఉల్లంఘిస్తే భర్త భార్యను విడిచిపెడతాడు.’ ఇది ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్య. వంటింటి కుందేళ్లుగా మహిళలను ఆర్‌ఎస్‌ఎస్‌ పోల్చే తీరిది.

ఆయనే 2022లో ‘జనాభా నియంత్రణతోపాటు మత ప్రాతిపదికన జనాభా సమతుల్యతా ముఖ్యమైన అంశం, దీనిని విస్మరించలేం’ అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతోందంటూ విషప్రచారం చేస్తున్నాయి. 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటనంపై మరింత చర్చ, అవగాహన అవసరం. కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తూ, ఒక సెక్షన్‌ దేశభక్తిని చాటుకుంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కలలు, ఆకాంక్షలను నెరవేర్చగలరా? కొత్త జీవితానికి మద్దతు ఇవ్వగలరా? అనే దానిపై తీవ్రంగా ఆలోచించాలి. ఇప్పటికీ ఈ కోణంలో ఆలోచించని ఒక సెక్షన్‌కు స్ఫూర్తినివ్వాలి’ అని అన్నారు. ఇదంతా ముస్లిం మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కంటారనే ఆర్‌ఎస్‌ఎస్‌ విష ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని ఎవరికైనా అర్థమవుతుంది.

మరో అడుగు ముందుకేస్తూ.. ‘నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు అనే భావన మనదేశంలో పనిచేయదు. హిందూ మతాన్ని రక్షించడానికి ఒక హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలను కనవలసిన సమయం ఆసన్నమైంది. వారిలో ఒకరిని సరిహద్దుకు పంపండి, ఒకరిని మాకు ఇవ్వండి’ ఇది 2015లో అప్పటి ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ బిజెపి ఎంపి సాక్షి మహరాజ్‌ చేసిన వ్యాఖ్య.

2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం సంతానోత్పత్తికి సంబంధించి హిందూ మహిళలకు 1.94 % మంది పిల్లలు, ముస్లిం మహిళలకు 2.36 % మంది పిల్లలు. వ్యత్యాసం 0.42 శాతం మాత్రమే. 1992లో హిందూ మహిళల కంటే ముస్లిం మహిళల సంతానోత్పత్తి 1.1 శాతం అధికంగా ఉండేది. వాస్తవానికి గత రెండు దశాబ్దాలలో హిందూ సంతానోత్పత్తి రేటు 30 శాతం తగ్గితే, ముస్లింలలో సంతానోత్పత్తి రేటు 35 శాతం తగ్గింది. అందుబాటులో ఉన్న జనాభా లెక్కల ప్రకారం 1971లో దేశ జనాభాలో 2.6 శాతంగా ఉన్న క్రైస్తవులు- 2001 నాటికి 2.3 శాతానికి పడిపోయారు. కాబట్టి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల వ్యాఖ్యలన్నీ అబద్ధాలే!

  • ముస్లిం మహిళలకు శాశ్వత భర్తలను ఇచ్చారట!

కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో హనుమాన్‌ జయంతి సందర్భంగా హిందూ జాగరణ వేదిక గత ఏడాది డిసెంబర్‌ 24న నిర్వహించిన సంకీర్తన యాత్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కల్వడ్క ప్రభాకర్‌ ముస్లిం మహిళలపై విషం చిమ్మాడు. ‘ముస్లిం మహిళలకు ప్రతిరోజూ శాశ్వత భర్త లేడు. మోడీ ప్రభుత్వం శాశ్వత భర్తలను ఇచ్చింది. లవ్‌ జీహాద్‌ ద్వారా ముస్లిం పురుషులే కాదు, ముస్లిం మహిళలూ మోసపోతున్నారు. మీకు (మీ కమ్యూనిటీలో) పురుషులు, మహిళలు లేరా?’ అని ప్రశ్నించారు. ఇంతగా ఊగిపోయిన ఇతనిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైనా, అరెస్టు చేసేందుకు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

కర్ణాటకలో అప్పటి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కర్ణాటక మత స్వేచ్ఛ రక్షణ బిల్లు -2021’ ప్రకారం మైనర్లు, మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి, స్వీయ నిర్ణయం తీసుకోలేని మానసిక అస్వస్థులను మత మార్పిడి చేస్తే, మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించాల్సి ఉంది. ఈ బిల్లులో ప్రతి నేరం నాన్‌ బెయిలబుల్‌. స్వీయ నిర్ణయం తీసుకోలేని మానసిక అస్వస్థులు, మైనర్లతో సమానంగా మహిళలు, దళితులు, ఆదివాసీలను అప్పటి కాషాయ సర్కారు నిర్వచించింది. ఇదండీ మహిళలు, ఎస్‌సి, ఎస్‌టిల పట్ల బిజెపికి ఉండే ఎనలేని గౌరవం!

ఇక క్షేత్రస్థాయిలో మహిళల పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల వ్యవహార శైలి ఎంత నీచంగా ఉంటుందో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలం పనిచేసిన పోరెడ్డి విజయశంకర్‌ రెడ్డి ‘దేశభక్తి ముసుగులో..’ పేరిట రాసిన పుస్తకంలో కళ్లకు కట్టారు. ‘భూపాలపల్లిలో బ్రాహ్మణుడైన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తకు ఓ పాఠశాల ఉంది. ఓ రోజు ఆ స్కూల్‌లో పనిచేసే దళిత యువతిని పిలిచి.. తనకు తలనొప్పిగా ఉందని జండుబామ్‌ రాయాలని కోరాడు. తలనొప్పి కదా అని ఆమె జెండూబామ్‌ రాసింది. అతను మరుసటి రోజు కూడా ఆ అమ్మాయిని పిలిచి, అత్యాచారం చేయబోయాడు. ‘సార్‌, ఇది తప్పు కదా’ అని ప్రశ్నించింది. ‘తప్పు కానేకాదు. బ్రాహ్మణులం, లోకజ్ఞానం కలవాళ్లం. నాతో కలిస్తే నీకు జ్ఞానవంతులైన పుత్రులు జన్మిస్తారు’ అని అన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అడిగింది. దీనికి ‘మీరొక వేస్ట్‌ పేపర్‌ లాంటి వాళ్లు, వాడుకొని వదిలేయడమే మా పని. మా సుఖాలు తీర్చడానికే మీరున్నారు బానిసలుగా’ అన్నాడు. ఆ అమ్మాయి స్కూలు మానేసింది. ఆమె ఓ స్వయం సేవకుడి చెల్లెలు. అతను ఆ బ్రాహ్మణుడిని కొట్టాడు. అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు వచ్చి, ‘ఇంత చిన్న విషయానికే కొడతారా?’ అని దళిత యువతి సోదరుడినే తిట్టారు. ‘జరిగిన విషయమంతా నాతో చెప్పాడు. అన్నా హిందువులంతా సమానమే అన్నావు. ఎక్కడ సమానం?’ అని ప్రశ్నించాడు. ‘ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాన’ని ఆయన రాశారు. ఆయనే కాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌లోని ఎవరూ నిజాయితీగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు కదా!

అంతేకాదు.. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపకుడైన హెడ్గేవార్‌ పూర్వీకుల గ్రామం రేంజర్‌ మండలం కందకుర్తిలో స్వయం సేవకులే చాలామంది మహిళలపై అత్యాచారం చేశారని, రెండు గ్లాసుల పద్ధతి సహా దళితుల పట్ల అమానవీయ పరిస్థితి ఉందని.. ఇవన్నీ చూశాకా.. ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపం అర్థమైందని రాశారు. అంతేకాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శ్రేణులు (ప్రధాని మోడీని ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు) తమను వ్యతిరేకించే వారిని సోషల్‌ మీడియాలో మహిళలను, సెలబ్రిటీలను పచ్చిబూతులతో వేధించడం మరో ఘోరం. ఇక కేంద్రమంత్రి వికె సింగ్‌ మీడియాను ‘ప్రెస్‌టిట్యూట్స్‌’ (పత్రికా సానులు) అని వ్యాఖ్యానిస్తున్నారు. ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలిచ్చే సోషల్‌ మీడియా సైన్యం ‘మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచంగా పోస్టులు పెడుతుంది. ఈ మానసిక హింస భరించలేక ఏ లుటిన్‌సిన్‌ సైడర్‌ పేరిట నడుపుతున్న అనామక ఖాతాదారుపై దక్షిణఢిల్లీ ప్రాంతంలోని వసంత్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బహుశా దేశంలోనే మొదటిసారి ఓ మహిళా జర్నలిస్టు ఇలాంటి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా.. పెద్దల అండదండలు నిందితులకు ఉండటంతో చర్యలు మాత్రం పోలీసులు తీసుకోలేదు. రకరకాల బెదిరింపులతో ట్విట్టర్‌ ఖాతాలో పోస్టులు, వందలాది అసభ్యకర నోటిఫికేషన్లు రోజూ దర్శనమిచ్చేవి. కాశ్మీర్‌లో పెల్లెట్‌ గన్‌ల వినియోగం వల్ల శాశ్వత అంధులుగా మారుతున్న యువత గురించి రాసినందుకు స్వాతి చతుర్వేదికి ఎదురైన అనుభవమిది. ఇదండీ ‘భారతమాతాకీ జై’ అనే సంఘీయులకు మహిళల పట్ల ఉండే అభిప్రాయం!

  • మహిళా సర్పంచ్‌ల భర్తలకు శిక్షణ

మమతా బెనర్జీ ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీలలో సర్పంచ్‌లుగా ఉన్న మహిళలు పేరుకే అధికారంలో ఉంటున్నారు. వారి భర్తలు లేదా కుటుంబసభ్యులే పెత్తనమంతా చేస్తున్నారని, అక్రమార్జనకు పాల్పడుతున్నారని, కొన్నిసార్లు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.

అలా ఫిర్యాదులు అందితే, ఓ మహిళా సిఎంగా మమతా బెనర్జీ ఆ అంశంపై దృష్టిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అందరూ ఆశిస్తారు. అందుకు భిన్నంగా 138 మహిళలకు, వారి భర్తలకు, కుటుంబసభ్యులకు ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీ వరకూ తూర్పు మేధినీపూర్‌ జిల్లా తమ్లూఖ్‌లోని నిమ్‌టౌరిలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యాన శిక్షణ ఇప్పించారు. మహిళా రిజర్వేషన్లను అపహాస్యం చేస్తూ.. వారి కుటుంబసభ్యులకు పెత్తనం చేసేందుకు లైసెన్సు ఇవ్వడమే కదా!

  • పి.మోహన సిద్ధార్థ్‌, 9490099123
➡️