పంచుకోవడం పిల్లలకు నేర్పాలి..

Mar 10,2024 11:16 #Children, #Parenting, #Sneha

పిల్లలు తమకు కొనిపెట్టేవి.. వండిపెట్టేవి ఏమైనా.. తమకే సొంతం అనుకుంటారు.. అవి ఆట వస్తువులైనా, తినేవైనా.. ఎవరికన్నా ఇవ్వడానికి.. కాసేపు ఆడుకోవడానికి సైతం ఏమాత్రం ఇష్టపడరు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలి. ఎదుటివారు ఇస్తే మాత్రం చటుక్కున లాగేసుకున్నట్లే తీసేసుకుంటారు. మరి అలాంటప్పుడు మనమూ అవతలివారికి ఇవ్వాలనేది నేర్పాలి. ఇది మంచి అలవాటు కాదు.. భవిష్యత్తులో ప్రవర్తనాలోపం గల వ్యక్తులుగా తయారవుతారని నిపుణులు చెప్తున్న మాట.

మా చిన్నప్పుడు స్కూల్లో.. తెచ్చినదాన్నే కాకి ఎంగిలి అంటూ గౌను కింద అంచులో తెచ్చుకున్న తాయిలం పెట్టి నోటితో కొరికి, స్నేహితులకు పంచేవాళ్లం. ఇప్పుడు అలాంటి అలవాట్లు లేవు.. అసలు పంచుకోవాలనే ఆలోచనే ఉండటం లేదు. ఇది తర్వాతర్వాత సమాజానికీ నష్టమే. పిల్లలు సహజంగానే అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా పక్కింటి పిల్లలకు తమ బొమ్మలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అయితే అలా ఇవ్వాలనే ఆలోచన కలగడానికి, పంచుకునేలా చేయాలంటే అందుకు తగ్గ వాతావరణం ఉండాలి. నలుగురితో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి. అందరూ తమ తమ బొమ్మలను ఒకరికొకరు ఇచ్చుకునేలా ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల తన బొమ్మ పక్కింటి అమ్మాయి తీసికెళ్లిపోతుందనే భయం ఉండదు. అలాగే తన దగ్గర లేని బొమ్మలు వేరే వారి దగ్గర ఉంటే, వాటితో ఆడుకునే అవకాశం వచ్చినందుకు సంబరపడిపోతారు. ఇలా ఒకరికొకరు బొమ్మల్ని పంచుకునే మంచి అలవాటు ఏర్పడుతుంది.

  • తినేవి ఇచ్చేలా..

పిల్లలు బొమ్మల్నే కాదు. తినేవాటినీ ఎదుటివారికి ఇవ్వడానికి ఇష్టపడరు. అందుకే తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలతో అలాంటి అలవాటు మాన్పించేందుకు చిన్న చిన్న కార్యక్రమాలు పెద్దలే క్రియేట్‌ చేయాలి. తల్లిదండ్రులు పిల్లలు ఎవరితో అయినా నలుగురితో ఆడటానికి వెళుతున్నప్పుడు మన అమ్మాయికో / అబ్బాయికో మాత్రమే తినేవి ఇవ్వడం కాకుండా.. ఆ నలుగురికీ తినేలా ఇచ్చి పంపాలి. అప్పుడు వాళ్లు తమకే కాకుండా వాళ్లకీ అమ్మ ఇచ్చిందనో, నాన్న కొనిచ్చారనో వాళ్లకి పంచిపెడతారు. వాళ్లు కూడా ‘అరే మీ అమ్మకీ / నాన్నకీ థ్యాంక్స్‌ రా!’ అని చెబితే.. పిల్లల కళ్లల్లో చెప్పలేని సంతోషం. అదో మంచిపని అనే అభిప్రాయం కలుగుతుంది. అలా తినేవి వారికి ఇవ్వడానికీ ఇష్టపడతారు. అదో అలవాటుగా మారి, మంచి వ్యక్తిత్వం గల వారిగా తయారవుతారని నిపుణులు చెప్తున్నారు.

  • సహాయంగా ఉండేలా..

పిల్లలు ఒకరికొకరు సహాయపడటం ఒక్కోసారి కొందరు పిల్లలు చేస్తుంటారు. వాళ్లని చూస్తే భలే ముచ్చటగా అనిపిస్తుంది. అది అందరి పిల్లల్లో ఉంటే వాళ్లు ఎంత మంచి పౌరులుగా తయారువుతారో ఊహించవచ్చు. కానీ చాలామంది పిల్లలు తమకు పట్టనట్లే వ్యవహరిస్తుంటారు. ఇంట్లో అమ్మ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ కష్టపడుతున్నా.. నాన్నా పట్టించుకోకుండా ఉంటే, అదే పిల్లలకూ అలవాటవుతుంది. కానీ అది కేవలం అమ్మ పని కాదు.. మన ఇంటిపని.. అమ్మ మాత్రమే కష్టపడుతుంది. అందరం వీలయినంత సహాయపడాలనే ఆలోచన పెద్దలు చేస్తే.. పిల్లలూ అలవాటు చేసుకుంటారు. ఇలాంటివి బాల్యంలోనే నేర్పిస్తే.. వాళ్లకు పదే పదే చెప్పాల్సిన అవసరం ఉండదు. అదొక బాధ్యతగా చెప్పకుండానే చకచకా ఆయా సందర్భాలలో స్పందిస్తూ, సహాయం చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు.

  • విద్యలోనూ..

పిల్లలు ఎక్కువసేపు ఉండేది పాఠశాలలోనే. ప్రవర్తనాపరమైనవి పిల్లలు అక్కడే ఎక్కువ ప్రభావితులవుతారు. అందువల్ల పిల్లల్ని తీర్చిదిద్దాల్సినది పాఠశాలల్లోనే. చదువులో కొందరు పిల్లలు ముందుంటారు. మరికొందరు పిల్లలు వెనకబడిపోతుంటారు. ఇది ఉపాధ్యాయులు పట్టించుకోవడం, వాళ్లను మెరుగుపరచడం ఒక మేరకు జరుగుతుంది.. జరగాలి. అయితే పిల్లలు కూడా తమకన్నా చదువులో వెనకబడిపోతున్న వారికి చేయందించేలా ప్రోత్సహించాలి. చాలా సందర్భాల్లో తక్కువ మార్కులు వచ్చినవారు గేలి చేయబడతారు. ఎక్కువ వచ్చిన వారు బడాయి పోతుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎక్కువ మార్కులొస్తే గొప్పగా ఫీలవుతారు.. తక్కువొస్తే చెయ్యి చేసుకోవడం, అవమానకరంగా మాట్లాడటం చేస్తుంటారు. ఇవన్నీ పిల్లల్లో ఆత్మనూన్యతను కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే పిల్లల్లోనే ఒకరికొకరు విద్య విషయంలోనూ సహకరించుకునే అలవాటు చేయడం ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగించడమే అంటున్నారు. తమకు తెలిసిన విషయాలు పిల్లలూ పిల్లలూ అయితే అర్థమయ్యేలా, ఎలాంటి బెరుకూ లేకుండా అవగాహన చేసుకుంటారు.. అడిగి తెలుసుకుంటారు.. ఇలాంటి షేరింగ్‌ అలాంటి పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.

➡️