నిజమైన భక్తి

May 5,2024 09:01 #Sneha

భక్తులు కొందరు రామాలయమున
భజనలు చేస్తూ వుండగా
అచటికి వెళ్ళెను ఓ రైతుకాళ్ళు
అతనికే తెలియకుండగా!!
అఆ ఇఈ అను అక్షరాలనే
ఆతడు చదువుచునుండెగా
అవియే పలుకుచు అదే భజనయని
ఆతడు అనుకొనుచుండెగా!!
భక్తులందరూ ప్రసాదాలు తిని
బయటికి వెళ్ళుచునుండగా
రైతుకు బాహ్యస్పృహ లేకున్నా
రామభజన చేస్తుండగా!!
దరికి వెళ్ళి పూజారి రైతునూ
తట్టి లేపుతూ వుండగా
ఏడీ నా రాముడనీ రైతూ
ఎగాదిగా చూస్తుండగా!!
రాముడేమిటని పూజారప్పుడు
రైతును ప్రశ్నిస్తుండగా
రాముడు కనిపించాడూ తనకని
రైతూ వివరిస్తుండగా!!
అన్నాడా పూజారీ ఇట్టుల
ఆనందం మది నిండగా
కనిపించాడూ రాముడు నీకే
కన్న కలలన్ని పండగా!!
మంత్రాలెన్నో చదివాం
రాముడు మాకు కనిపించకుండెగా
అక్షరమంత్రాల్‌ చదివిన నీకే
సాక్షాత్కరించుచుండెగా!!
ప్రతిరోజూ మేం పూజ చేసినా
ఫలితమేమి లేకుండెగా
నిజమైన భక్తి నీదేనయ్యా
నీదు పుణ్యమూ పండెగా!!

అలపర్తి వెంకట సుబ్బారావు
9440805001

➡️