అందని ద్రాక్షలు

May 19,2024 08:37 #Sneha, #Stories

పదేళ్ళ తరువాత నేను హైదరాబాద్‌ నుంచి మా ఊరు వెళ్ళాను. మాది విజయనగరం దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అక్కడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకూ చదివాను. అప్పుడు మా హైస్కూలు ఆటల్లో జిల్లాకే ప్రథమ స్థానంలో ఉండేది. అప్పట్లో ఎక్కువగా వాలీబాల్‌ పోటీలు బాగా జరిగేవి.
జిల్లాలో మొత్తం 40 హైస్కూళ్ళ నుంచీ వాలీబాల్‌ జట్లు ఆ పోటీల్లో పాల్లొనేవి. మా హైస్కూల్‌ జట్టుకి సూర్యం స్టార్‌ స్పైకర్‌. సూర్యం బాల్‌ని స్పైక్‌ చేస్తే ఇంకెవ్వరూ ఎత్తలేరు. సూర్యం ఉంటే ఎదుటి జట్టు తలవాల్చాల్సిందే. సూర్యం తండ్రి ఓ పేద సన్నకారు రైతు. పైగా అతనికి నలుగురు పిల్లలు. వాడిలో సూర్యం ఆఖరివాడు.
మా నాన్నగారు మా ఊరి హైస్కూల్లోనే సైన్స్‌ టీచరుగా పనిచేసేవారు. అప్పట్లో నాన్నగారికి సైన్స్‌, లెక్కలు బాగా చెప్తారన్న మంచి పేరుండేది.
మా ఊరి హెడ్మాష్టర్‌ రామారావు గారు. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పటి నుంచీ ఆయనే మా హైస్కూల్‌కి హెడ్మాష్టర్‌. అతని అన్నయ్య మా నియోజకవర్గ ఎమ్మెల్యే, అతని బావ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కావడంతో అతన్ని మా ఊరి స్కూలు నుంచి బదిలీ చేసే సాహసం ఎవ్వరూ చేసేవారు కాదు. చేసినా క్షణాల్లో ఆ బదిలీ రద్దయ్యిపోయేది. రామారావు మాష్టారికి మంచి పేరుండేది కాదు. అందరూ ఆయన్ని చెడ్డగా చెప్పుకునే వారు. తన మాట వినని టీచర్లను తన అన్నయ్యతోనూ, బావతోనూ చెప్పి, బదిలీ చేయించేవాడు. తన దగ్గరకు ట్యూషన్లకు రాకపోతే ఆ పిల్లలకు మార్కులు తక్కువ వేసేవాడు. పైగా ఆ ట్యూషన్లు చెప్పే ఉపాధ్యాయుల్ని బెదిరించేవాడు. అందువల్ల అతని బాధ పడలేక చాలామంది ఇష్టం లేకపోయినా ఆయన వద్ద ట్యూషన్లు చెప్పించుకునేవారు.
రామారావు మాష్టారు కొడుకు ఆనంద్‌ మా క్లాసుమేట్‌. హెడ్మాష్టర్‌ గారి కొడుకు కాబట్టి బాగా పొగరుగా ఉండేవాడు. అమ్మాయిలను ఏడిపిస్తూ ఉండేవాడు. ఏ మాష్టారైనా వాడికి తక్కువ మార్కులు వేస్తే వాళ్ళ నాన్నకి చెబుతాననీ, ఆ మాష్టార్‌ని బెదిరించేవాడు. ఆయన బాధపడలేక ప్రతి టీచరూ వాడు పరీక్ష బాగా రాయకపోయినా మంచి మార్కులు వేస్తూ ఉండేవారు.
మా క్లాసు ఫస్ట్‌ సూర్యం. గ్రహింపు ఎక్కువ. సైన్స్‌, లెక్కలు వాడికి ఇష్టమైన సబ్జెక్టులు. లెక్కల్ని మాష్టారు కంటే ముందే చేసేసేవాడు. టీచరు సైన్స్‌ పాఠం చెబుతుంటే బ్లాక్‌ బోర్టు మీద దానికి సంబంధించిన బొమ్మలను సూర్యమే వేసేవాడు. అలా సూర్యం అంటే అందరి టీచర్లకు బాగా ఇష్టం. ఒక హెడ్మాష్టరుకి తప్ప. మా హెడ్మాష్టరుకి తన కొడుకు ఆనంద్‌ని క్లాస్‌ ఫస్ట్‌ చెయ్యాలని బాగా కోరికగా ఉండేది.. కానీ సూర్యం ఎప్పుడూ అడ్డుపడుతుండేవాడు. సూర్యం తరువాత నాకు ఎక్కువ మార్కులు వచ్చేవి. ఆనంద్‌కి పదవ ర్యాంకు. అదీ మాష్టర్లు మార్కులు ఉదారంగా వెయ్యడం వల్ల వచ్చేది.
ఒకసారి ఆనంద్‌ హాఫ్‌యర్లీ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో మరీ ముఖ్యంగా లెక్కల్లో ఫెయిలయ్యాడు. ఆ విషయం తెలిసి హెడ్మాష్టరు రామారావు గారు ఆ ఫెయిల్‌ చేసిన లెక్కల మాష్టారు గారి మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. వెంటనే మార్కులను పెంచి, పాస్‌ చెయ్యకపోతే శంకరగిరి మాన్యాలు పట్టిస్తాననీ ఉక్రోషం వెళ్ళగక్కాడు. ఇంక చేసేదేంలేకకిందా మీదా పడి, లెక్కల మాస్టారు వాడిని పాస్‌ చేశారు.
ఇక ఆటల్లో కూడా సూర్యమే ఫస్ట్‌. వాలీబాల్‌, కబడ్డతోీ పాటు బాల్‌ బాడ్మింటన్‌ బాగా ఆడేవాడు. అప్పట్లో హైస్కూళ్ళలో ఎక్కువగా షటిల్‌ బాడ్మింటన్‌ బదులు, బాల్‌ బాడ్మింటన్‌ ఆడేవాళ్ళం. ఇక వాలీబాల్లో జిల్లాలోనే మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్యం. ఆనంద్‌కి వాలీబాల్‌ ఆట బాగా రాలేకపోయినా హెడ్మష్టర్‌ బాధ పడలేక మా డ్రిల్లు మాష్టారు కేశవరావు గారు వాడిని జట్టులోకి బలవంతంగా తీసుకున్నారు. వాడు ఏ స్థానంలో ఉన్నా బాల్‌ని సరిగ్గా ఎత్తేవాడు కాదు. వాడి ఆటను కూడా నేనో, సూర్యమో, మిగతా వాళ్లో ఆడి, జట్టుని గెలిపించేవాళ్ళం. వాడి వల్ల మేము ఓటమి అంచుదాకా వెళ్ళి, సూర్యం వీరోచిత పోరాటం వల్ల గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాడి ఆటను చూసి ప్రత్యర్థి జట్ల వాళ్ళు ”ఇతన్ని ఎలా మీ జట్టులో పెట్టుకున్నారు?” అపి మమ్మల్ని ఆశ్చర్యంతో అడుగుతుంటే, సమాధానం చెప్పలేక మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. వాడిని జట్టుకు నష్టం అయినా తప్పక మోసేవాళ్ళం.
రాను రాను హెడ్మాష్టరు రామారావు గారి అసూయకు హద్దుల్లేకుండా పోయింది. ఆటల్లో సూర్యాన్ని, నన్ను బాగా ప్రోత్సహిస్తున్నాడనీ మా డ్రిల్లు మాష్టారు కేశవరావు గారిని ఎక్కడో ఏజన్సీకి దగ్గరల్లోని హైస్కూలుకి బదిలీ చేయించాడు. ఇక తన కొడుకు ఆనందుకి మార్కులు వెయ్యటం లేదనీ, అతని మాట వినటం లేదనీ మా నాన్నగారిని కూడా ఆ హైస్కూలు నుంచి తన పలుకుబడితో వేరే స్కూలుకి బదిలీ చేయించాడు.
మా నాన్నగారుకి బదిలీ కావడంతో మేము ఆ ఊరు వదిలి వేయవలసి వచ్చింది. అప్పటికి పదవ తరగతి పరీక్షలు అయిపోవడంతో నాన్నగారు మా కుటుంబాన్ని మా చదువుల నిమిత్తం విజయనగరానికి మార్చి, తాను అక్కడ నుంచి స్కూలు ఉన్న ఊరికి బస్సులో వెళ్ళి వస్తుండేవారు. అలా ఆ ఊరితో నాకు రుణం తీరిపోయింది. ఆ తరువాత కాలచక్ర భ్రమణంలో నేను ఇంజనీరింగ్‌ చదవడం, ఆ తరువాత హైదరాబాద్‌లో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం రావడంతో నేను ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశాను. ఈ లోగా నాకు వివాహం కావడం, పిల్లలు పుట్టడం జరిగింది.
నాన్నగారు పదవీ విరమణ చేసి విశాఖపట్నంలో స్థిరపడటంతో నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం కుదరలేదు. ఎప్పుడైనా సంక్రాంతికి విశాఖపట్నం వచ్చినా సెలవు లేకపోవడంతో వెంటనే హైదరాబాదు వెళ్ళిపోయేవాడిని.
అటువంటిది పదిరోజుల క్రితం నా స్నేహితుడు రాజు ఉత్తరం రాసి, ఊళ్ళో అమ్మవారి పండుగ జరుగుతోందనీ, వాలీబాల్‌ పోటీలు కూడా జరుగుతున్నాయనీ చెప్పడంతో- మా ఊరు వెళ్ళాలనీ నిర్ణయించుకున్నాను. నా శ్రీమతి మృదుల టీచరు. ఆమెకు సెలవులు లేకపోవడంతో నేనొక్కడినే బయలుదేరి వచ్చాను.
నేను బొబ్బిలిలో రైలు దిగగానే రాజు, మా మిగతా మిత్ర బృందమంతా స్టేషన్లో నాకు స్వాగతం పలికారు. ఆ తరువాత కార్లో మా ఊరు చేరుకున్నాం. మా ఊరుని చూడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఆ ఊరుని చూస్తుంటే మేము పుట్టి పెరిగిన ఊరేనా అన్న అనుమానం కలిగింది. మా ఊరిని చూసిన తరువాత నాలో ఉత్సాహం సన్నగిల్లింది. కాంక్రీటు వీధులు, మోటారు సైకిళ్ళ రణగొణ ధ్వనులు, మంచి మంచి రంగులతో కట్టిన ఇళ్ళను చూసిన తరువాత ఆనందించాలో, లేక మేము పెరిగిన వూళ్ళో మట్టివాసన లేకపోవడం వల్ల బాధపడాలో అర్థం కాలేదు. అయినా కాలచక్ర భ్రమణంలో మార్పులు అనివార్యం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనకిష్టం వున్నా లేకపోయినా కాలం తన పని తాను చేసుకుపోతుంది.
గ్రామ దేవత పండుగ కావడంతో ఊరికి జనం విపరీతంగా వచ్చారు. ప్రతి ఇల్లూ చుట్టాలతో నిండిపోయి ఉంది. నేను మేము గతంలో ఉండే ఇంటికి వెళ్ళాను. అదిప్పుడు పూర్తిగా మారిపోయి కనిపించింది. ఆనాటి బావి గానీ, పెరట్లోని నేరేడు చెట్టు కానీ కనిపించలేదు. భోజనాల తరువాత వాలీబాల్‌ పోటీలను చూడటానికి వెళ్ళాము. ఊరికి దూరంగా ఉన్న మా హైస్కూలు ఆవరణలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆ స్కూలుని చూడగానే నాకు గతం గుర్తుకొచ్చింది. నేనీ రోజు ఇలా ఉండటానికి ఆ పాఠశాలే కారణం. కానీ అదిప్పుడు పూర్తిగా మారిపోయి కనిపిస్తోంది. పాత భవనాల స్థానంలో కొత్త బిల్డింగులను కట్టారు.
ఆ వాలీబాల్‌ పోటీలను చూడటానికి మా డ్రిల్లు మాష్టారు కేశవరావు గారు కూడా వచ్చారు. ఆయన రెండేళ్ళ క్రితమే పదవీ విరమణ చేసి, బొబ్బిల్లో ఉంటున్నానని చెప్పారు. రెండు గంటల పాటు ఆ పోటీలను మా స్నేహితులందరం కేశవరావు మాష్టారుతో కలిసి వీక్షించాము. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆ టోర్నమెంటుకి అతిథ్యం ఇచ్చిన మా హైస్కూలు జట్టు ఓడిపోయింది. ఒకప్పుడు జిల్లాలో పేరుపడ్డ మా హైస్కూలు జట్టు ఎందుకిలా అయిందనీ కేశవరావు మాష్టార్ని అడిగాను.
ఆయన కొద్దిసేపు మౌనం దాల్చి ‘మూర్తీ! సూర్యం తోటే ఈ స్కూలు జట్టు ప్రాభవం పోయింది. వాడు, మీరందరూ ఉన్నప్పుడు ఆ వైభవం వేరు. జిల్లాలోని అన్ని జట్లనూ అవలీలగా ఓడించేది ఈ స్కూలు జట్టు. కానీ ఇప్పుడది గత వైభవం’ అని చెప్పారు.
నేను ఆయన మాటలకు ఆశ్చర్యపోతూ ‘మాష్టారూ! అన్నట్లు సూర్యం ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాను.
‘ఇంకెక్కడుంటాడు. వాళ్ళ ఊళ్ళో చదువు మానేసి, హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు’ అని చెప్పారు.
‘స్కూలు ఫస్ట్‌ ర్యాంకర్‌ అయిన సూర్యం వ్యవసాయం చేసుకుంటున్నాడా? కారణం?’ అని అడిగాను.
‘వాడి జీవితం అలా కావడానికి అప్పటి మన హెడ్మాష్టర్‌ రామారావు గారు కారణం. చదువుల్లోను, ఆటల్లోను సూర్యం ప్రతిభ చూసి, అసూయపడ్డాడు ఆయన. సూర్యం ఉంటే తన కొడుకు ఆనంద్‌కి పేరు రాదనీ, వాడు వెనకబడిపోతాడన్న అక్కసుతో సూర్యం వాళ్ళ నాన్నని బెదిరించాడు. సూర్యం వాళ్ళ నాన్నకి ఎప్పుడో తాను అప్పిచ్చిన డబ్బు ఇవ్వకపోతే పొలం స్వాధీనం చేసుకొంటాననీ బెదిరించాడు. ఆయన బాధ పడలేక సూర్యం తండ్రి సన్యాసి కొడుకు చదువు మానిపించేశాడు. నువ్వు, సూర్యం స్కూలు నుంచి ఒకేసారి వెళ్లిపోయిన తరువాత అతని కొడుక్కు అడ్డు అదుపూ లేకుండా పోయింది. అతనే అన్నింట్లో ఫస్ట్‌ వచ్చాడు అనేకన్నా, వచ్చినట్లు చేశాడు. చదువు మానేసిన సూర్యం వ్యవసాయం చేస్తూ కాలం గడుపుతున్నాడు.’ అని చెప్పి చెమర్చిన కళ్ళను తుడుచుకున్నారు కేశవరావు మాష్టారు.
నాకు ఆయన మాటలు విన్న తరువాత చాలా బాధ కలిగింది.
ఆ మర్నాడు నేను, నా స్నేహితుడు రాజు పక్కనే ఉన్న సూర్యం ఊరు వెళ్ళి, కలిశాము.
ఇప్పుడు వాడిలో చాలా మార్పు కనిపిస్తోంది. లుంగీ, బనీను కట్టుకొని, గెడ్డంతో ఎక్కవ వయసున్నవాడిలా కనిపించాడు.
మమ్మల్ని చూడగానే ఆనందించాడు. ప్రేమగా వాళ్ళింటిలోకి తీసికెళ్లారు. అతని భార్య సావిత్రి అంగన్‌వాడీ టీచరుగా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారని చెప్పాడు.
‘సూర్యం! మన స్కూలు టాపర్‌వి నువ్వు. ఇక వాలీబాల్‌ ఆటతో పాటు అన్ని ఆటల్లో ఫస్ట్‌ వచ్చినవాడివి. అర్ధాంతరంగా చదువు ఎందుకు మానేసేవు?’ అని అడిగాను.
నా మాటలకు వాడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తడి నీటిబొట్టుగా మారి బయటికి రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది.
‘మూర్తీ! దేనికైనా మందుంది కానీ మనిషి అసూయకూ, ద్వేషానికీ మందు లేదు. మన హెడ్మాష్టరు రామారావు గారి అసూయ నా పతనానికి కారణమైంది. పులి తిరుగుతున్న అడవిలో లేళ్ళు బతకలేవు. తెగించి ఉన్నా దానికి ఆహారం అవక తప్పదు. అందుకే నేను చదువు మానేశాను. దాంతో అతని అసూయ తగ్గి, మమ్మల్ని వదిలేశాడు. అప్పుడు నాకు తత్వం బోధపడింది. మా నాన్న ఓ సన్నకారు రైతు. పూట గడవడమే కష్టం అవుతున్నప్పుడు ఇక చదువు ఎక్కడ చెప్పు? అందుకే వ్యవసాయంలో దిగాను. ఇది కూడా ఒక అవకాశం అనుకుని, చేసుకుంటూ వెళుతున్నాను’. అనీ తత్వం మాట్లాడాడు సూర్యం.
‘పోనీ దూరవిద్య ద్వారా చదవలేకపోయావా? అయినా వాలీబాల్‌ ఆటనెందుకు వదిలేశావు? నువ్వు దాన్ని కొనసాగించి ఉంటే రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ ఆటగాడివి అయ్యేవాడివి అన్నాను.
‘చదువు, ఆటలు, పేరు, కీర్తి, డబ్బు ఇవన్నీ ధనవంతులకే సూర్యం. మాలాంటి పేదవాళ్ళకు అందని ద్రాక్షలు. వాటి గురించి ఆశపడటం తప్పు. పేదవాడిని ఈ సమాజం ఎదగనివ్వదు’ అని చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పాడు సూర్యం.
వాడి మాటలు నాలో అలజడి రేపాయి. వాటి పరమార్థం నా అంతఃచ్ఛక్షువుల్ని తెరిపించింది. ఇక అక్కడ ఉండలేక వెంటనే వాడి పిల్లల చేతిలో కొంత డబ్బు ఉంచి, వెనుతిరిగాను. నేను వెళ్ళిపోతూ వాడివైపు చూశాను. వాడి ముఖం మీద అరుణ కిరణాలు పడి, అది ఎర్రగా మారిపోయి కనిపిస్తున్నాయి. మార్పు రాక తప్పదు.. అది మంచివైపు జరగాలి అంతే..

– గన్నవరపు నరసింహమూర్తి, 9326735406

➡️