భారత్‌లో బిజెపి విధానాల ఫలితం : ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ నివేదిక

  • మైనారిటీలపై పెరిగిన హింస
  • మానవ హక్కులపై ప్రభావం
  • జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విమర్శకులపై దాడులు

న్యూఢిల్లీ : గతేడాది దేశంలో బిజెపి ప్రభుత్వ వివక్షాపూరిత పాలన, విభజన విధానాలతో మైనారిటీలపై హింస పెరిగింది. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. దీంతో ఇవి ప్రభుత్వ విమర్శకులపై ప్రభావాన్ని చూపాయి. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన తన ప్రపంచ నివేదికలో ఈ విషయాలను హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ తన 34వ ఎడిషన్‌లో వెల్లడించింది. ఈ నివేదిక 740 పేజీలను కలిగి ఉన్నది. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ 100 కంటే ఎక్కువ దేశాలలో మానవ హక్కుల పద్ధతులను సమీక్షించింది.ఈ నివేదిక సమాచారం ప్రకారం.. మోడీ ప్రభుత్వం నిరంతర వివక్షాపూరిత పద్ధతుల ద్వారా దేశ ప్రపంచ నాయకత్వ ఆకాంక్షలను బలహీనపరిచింది. అధికార, మానవ హక్కుల దుర్వినియోగానికి సంబంధించి అధికారులను బాధ్యులను చేయటానికి చూసింది. ఈ చర్యలను ప్రశ్నించే ఎవరినైనా హింసించే చర్యలు జరిగాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ ఆసియా డిప్యూటీ డైరెక్టర్‌ మీనాక్షి గంగూలీ అన్నారు. అలాగే, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విమర్శకులపై పలు విధాలుగా దాడులు జరిగాయి. విదేశీ నిధులను నియంత్రించే విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో ప్రభుత్వేతర సంస్థలకు వేధింపులు ఎదురయ్యాయి.

బిబిసిపై దాడులు

దేశంలో ముస్లింలకు భద్రత కల్పించడంలో ప్రధాని మోడీ వైఫల్యాన్ని బిబిసి ఎత్తిచూపింది. దీంతో మోడీ సర్కారు బిబిసి పై ప్రతీకార చర్యలకు దిగింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ, ముంబయిలలోని బిబిసి కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దేశంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించి కేంద్రం గతేడాది జనవరిలో భారత్‌లో బిబిసి డాక్యుమెంటరీని నిరోధించిన విషయం విదితమే.

మైనారిటీలపై దాడులు

మతపరమైన, ఇతర మైనారిటీల పట్ల కేంద్రం వివక్షాపూరితమైన పద్ధతులను ఎత్తిచూపుతూ ఈ నివేదిక అనేక సంఘటనలను జాబితా చేసింది. ‘జులై31న హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో హిందూ ఊరేగింపు సందర్భంగా మతపరమైన హింస చెలరేగింది. అది వేగంగా అనేక పక్క జిల్లాలకు వ్యాపించింది. అయితే, హింసను అణచివేసే చర్య పేరుతో వందలాది ముస్లిం ఆస్తులు చట్టవిరుద్ధంగా కూల్చివేయబడ్డాయి. అనేక మంది ముస్లింలను అధికారులు నిర్బంధించారు.’ అని నివేదిక పేర్కొన్నది. హర్యానాలోనీ బిజెపి రాష్ట్ర ప్రభుత్వం తీరును పంజాబ్‌ మరియు హర్యానా హైకోర్టు తప్పుబట్టిన విషయాన్నీ ఇది స్పష్టం చేసింది. ఈశాన్య భారత్‌లోని మణిపూర్‌ జాతి హింసను సైతం నివేదిక ఉటంకించింది. ఈ అల్లర్లలో వందలాది మంది గాయాలపాలు కాగా.. 200 మందికి పైగా మరణించారని వివరించింది. వేలాది మంది తమ ఇండ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని నివేదిక పేర్కొన్నది.

జమ్మూకాశ్మీర్‌లో హక్కులకు పరిమితులు

జమ్మూ కాశ్మీర్‌లో భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, ఇతర హక్కులను భారత అధికారులు నిరంతరం పరిమితం చేశారని నివేదిక ఎత్తి చూపింది. భద్రతా బలగాలు చట్టవిరుద్ధమైన హత్యల సంఘటనలు ఏడాది పొడవునా కొనసాగాయని వివరించింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్ల ఆరోపణలను సైతం పట్టించుకోని మోడీ సర్కారు తీరును నివేదిక ఎత్తి చూపింది.

➡️