1999 ఎన్నికలు – బిజెపితో దోస్తీ – మూడుముక్కలైన టిడిపి

1985, 1989, 1994 ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌.. వామపక్షాలను మిత్రులుగా చేసుకుని కాంగ్రెస్‌తో తలపడ్డారు. ఎన్‌టిఆర్‌ ప్రవచించిన లౌకికవాద విధానాలకు తిలోదకాలిచ్చి 1999 ఎన్నికల్లో చంద్రబాబు బిజెపితో జతకట్టి పోటీ చేశారు. 1996లో ఎన్‌టి రామారావు మరణించారు. 1999 ఎన్నికల నాటికి టిడిపి మూడు పార్టీలుగా చీలిపోయింది. ఒకటి : అధికారయుత టిడిపికాగా.. రెండోది : ఎన్‌టిఆర్‌ భార్య లక్ష్మీపార్వతి ‘ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ (ఎల్‌పి)’ని స్థాపించి ఎన్నికల గోదాలోకి దిగారు. మూడోది : బావ చంద్రబాబును వదిలేసి ఎన్‌టిఆర్‌ కుమారుడు హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించి వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. ఎన్‌టిఆర్‌ పదవీచ్యుతుడు అయ్యాక శాసనసభ్యుడుకాని హరికృష్ణను తన మంత్రివర్గంలో రవాణా శాఖా మంత్రిగా నియమించారు చంద్రబాబు. ఆరు నెలల్లోనే తిరిగి శాసనసభకు ఎన్నికయ్యేందుకు హరికృష్ణకు అవకాశం కల్పించకపోవడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో హరికృష్ణ తన బావ చేతిలోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేశారు. అయితే లక్ష్మీపార్వతి, హరికృష్ణల రెండు పార్టీలనూ రాష్ట్ర ప్రజలు ఆదరించలేదు. లక్ష్మీపార్వతి, హరికృష్ణ సైతం ఓడిపోయారు. వారి పార్టీలకు ఒక్క సీటు కూడా రాలేదు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి
1999 ఎన్నికల్లో 269 స్థానాలకు పోటీ చేసిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 180 స్థానాల్లో విజయం సాధించింది. ఈ పార్టీ 1,46,13,307 (43.87 శాతం) ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ 293 స్థానాలకు పోటీ చేసి 91 స్థానాల్లో గెలుపొందింది. ఈ పార్టీకి 1,35,26,309 (40.61 శాతం) ఓట్లు లభించాయి. ఈ రెండు పార్టీలకూ మధ్య తేడా కేవలం 3.26 శాతం మాత్రమే. టిడిపితో పొత్తుతో బిజెపి 24 సీట్లకు పోటీ చేసి 12 స్థానాలు గెలిచింది. 12,23,481 (3.67 శాతం) ఓట్లు పొందింది. సిపిఎం 48 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాలు గెలుపొందింది. ఈ పార్టీకి 5,67,761 (1.70 శాతం) ఓట్లు వచ్చాయి. ఎంఐఎం 5 స్థానాలకు పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాధించింది. దానికి 3,60,211 (1.08 శాతం) ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్లు 762 మంది పోటీ చేసి 5 సీట్లలో గెలిచారు. వీరికి 15,93,015 (4.78 శాతం) ఓట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్‌ నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఎన్నికయ్యారు. బిజెపి శాసనసభా పక్ష నేతగా నల్లు ఇంద్రసేనారెడ్డి, సిపిఐ(ఎం) శాసనసభా పక్ష నేతగా నోముల నరసింహయ్య ఎన్నికయ్యారు.

ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం
ఈ కాలంలో రాష్ట్రంలో చంద్రబాబు పాలన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. నాయకుల, అధికార యంత్రాంగంలో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు సాగాయి. తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టకపోవడం, ప్రపంచ బ్యాంక్‌తో ఒప్పందాల్లో భాగంగా విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచడంతో 2000 సంవత్సరం ఆగస్టులో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం రాజుకుంది. ఈ ఉద్యమంలో 25 వేల మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలు, వామపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు నిరాహారదీక్షలు నిర్వహించారు. దానిలో భాగంగానే ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్‌ వేర్వేరుగా ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపట్టాయి. ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటుచేసినా ప్రదర్శకులు ముందుకు కదిలారు. పోలీసులు గుర్రపు దళాలతో ప్రజలపై దౌడు తీస్తూ దారుణమైన లాఠీఛార్జి జరిపారు. జల ఫిరంగులను, భాష్ఫవాయు గోళాలను ప్రయోగించారు. అయినా ప్రదర్శకుల దీక్ష సడలకపోవడంతో బషీర్‌బాగ్‌ ఫైఓవర్‌ దిగువకు రాగానే పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు సిపిఎం, ఒక కాంగ్రెస్‌ కార్యకర్తను చంపివేశారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో చంద్రబాబు పాలనకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయినట్లయింది.

టిడిపి నుంచి కెసిఆర్‌ రాజీనామా
తరువాత కాలంలో.. 2001 ఏప్రిల్‌ 27న శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కె. చంద్రశేఖరరావు (కెసిఆర్‌) తన పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అదే రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టారు. అక్కణ్ణుంచి మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

– యు. రామకృష్ణ

➡️