మోడీ పర్యటనపై టిడిపిలో ఆందోళన

May 4,2024 23:24 #2024 elections, #ap tour, #PM Modi
  •  హోదా, విభజన హామీలు, ‘ఉక్కు’ పై స్పందిస్తారా?
  •  హామీ ఇవ్వకపోతే ఇబ్బంది అంటున్న నేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంపై టిడిపి నాయకుల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్‌కు ఐదు రోజులు ముందు పర్యటన ఉండటంతో నేతల్లో ఉత్కంఠకు గురవుతున్నారు. సాధారణంగా జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారానికి వస్తే తమకు కొంత బలం వస్తుందని రాష్ట్రస్థాయి నేతలు ఆశిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా మోడీ పర్యటనపై టిడిపి నాయకులతో పాటు జనసేన నాయకులు స్పందిస్తున్నారు. టిడిపి-జనసేనతో బిజెపి కలిసిన తరువాత మార్చి 17వ తేదిన ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. నరేంద్రమోడీతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఈ సభకు హాజరయ్యారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వంటి వాటిపై కొన్ని హామీలను మోడీ ప్రకటిస్తారని మూడు పార్టీల నాయకులు భావించారు.
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రోడ్‌ మ్యాప్‌ను ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూశారు. అయితే ఈ అంశాల జోలికే వెళ్లకపోవడంతో కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు మోడీ పర్యటన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలతో పాటు రాష్ట్రానికి ఇస్తున్న జలజీవన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలను గురించి మాట్లాడటం తప్ప పదేళ్ల నుంచి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేకపోయారు. పసలేని మోడీ ప్రసంగాన్ని ప్రజలు, తమ పార్టీ కార్యకర్తలు మార్చిపోవడానికి చాలా సమయం పట్టిందని టిడిపి అంటున్నారు. ఇప్పుడు పోలింగ్‌కు ఐదు రోజుల ముందు మోడీ పర్యటన ఖరారు కావడంతో వారిలో ఆందోళన నెలకొంది. రాష్ట్రవిభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రాజధాని అమరావతి అంశాలపై ఈ సారైనా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తమకు నష్టం కలుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిజెపితో పొత్తు వల్ల తమకు మైనార్టీలు దూరమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో తమకు సహకారం ఉంటుందనే ఆశతో బిజెపితో పొత్తు పెట్టుకున్నామని అంటున్నారు. జగన్‌కు మేలు చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, అదేవిధంగా డిజిపి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వీరిద్దరని బదిలీ చేయాలని తాము అనేకసార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదని చెబుతున్నారు.

➡️