జమ్మూలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

జమ్మూకాశ్మీర్‌లోని ఐదు నియోజకవర్గాల్లో ఉదంపుర్‌ స్థానానికి తొలివిడత ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. రెండోదశలో భాగంగా ‘జమ్మూ’ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. 2,416 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 1962లో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థానానికి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 9సార్లు కాంగ్రెస్‌ గెలుపొందింది. జమ్మూ లోక్‌సభ సీటు పరిధిలో జమ్మూ, సాంబ, రియాసి, రజౌరి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా బిజెపి ఎంపీ జుగల్‌ కిషోర్‌, జమ్మూకాశ్మీర్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామన్‌ భల్లా మధ్యే పోటీ నెలకొంది. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హౌదా, అభివృద్ధి, బోర్డర్‌లో ప్రశాంత వాతావరణం, నిరుద్యోగం వంటివి ప్రధానమైన సమస్యలు.

ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. ఒకవైపు కాంగ్రెస్‌ ప్రచారంలో బిజెపి వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. రాష్ట్ర హౌదా కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, నిరుద్యోగం, బిజెపి అవినీతి, నేరాలు వంటి వాటిపై దృష్టి సారించింది. ఉపాధి కల్పన హామీ ఇచ్చింది. మరోవైపు బిజెపి మతపరమైన అంశాలను ప్రకటిస్తోంది. దేవాలయాల నగరంగా పేరుగాంచిన జమ్మూలో హిందూ ఓటర్లను మభ్యపెట్టేందుకు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని బిజెపి ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. ఆర్టికల్‌ 370, 35ఎ రద్దు అనంతరం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రశాంతమైన సరిహద్దులు కల్పించామంటూ, త్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి వాటిని ప్రస్తావిస్తోంది. నిజానికి ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్‌లో నాయకులు, ప్రజానీకం పెద్దఎత్తున నిరసనలు ఆందోళనలు చేపట్టారు. ఆ వ్యతిరేకత ప్రపంచానికి తెలియకుండా అణచివేతకు గురిచేసింది కాషాయపార్టీ. ఇప్పుడు వాటినే గొప్పలుగా చెబుతున్నా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది. ఇంతకాలం అధికారంలో ఉన్నా జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేకపోయింది. పైగా ఎన్నికల ప్రచార తరుణంలో ఓటర్లను ఆకటు ్టకునేందుకు కేంద్రమంత్రి, ఉదంపుర్‌ అభ్యర్థి జితేంద్ర సింగ్‌ ప్రచారంలో పాల్గొని, అధికారంలోకి వస్తే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని హామీలను గుప్పిస్తోంది.

జమ్మూలో హిందువులు, ముస్లింలు సంవత్సరాలుగా సామరస్యంగా జీవిస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎన్నికల్లో మతపరమైన అంశాలపై దృష్టి పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, ఉద్యోగ కల్పన వంటి మౌలిక సదుపాయాలపై చర్చించే విధంగా ఉండాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో జమ్మూ అతలాకుతలమైంది. ఇది బిజెపి ప్రతిష్టను దెబ్బతీయొచ్చు. 2014, 2019 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జుగల్‌ కిషోర్‌ గెలిచారు. మూడోసారి పోటీలో ఉండగా జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేకప్రతిపత్తిపై దెబ్బతీసింతర్వాత ఈ ప్రాంతంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎటు ఓటు వేయనున్నారో వేచి చూడాలి.

మొత్తం ఓటర్లు 17,80,739
పురుషులు : 8,59,657
మహిళలు : 9,21,053
థర్డ్‌ జెండర : 28

➡️