కాకినాడలో ఉత్కంఠ పోరు

Apr 19,2024 03:50 #2024 election, #Kakinada
  • జనసేనపై ముద్రగడ ప్రభావం ఎంత?
  • పదేళ్ల తర్వాత బరిలోకి పల్లంరాజు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : కాకినాడ జిల్లాలో పిఠాపురం కేంద్రంగా జనసేన పవనాలు వీస్తున్నాయి. పవనాలు కాదు తుపానులైనా అడ్డుకుంటామంటూ అధికార వైసిపి ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దింపింది. వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో ఓ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మరో పక్క కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పదేళ్ల అనంతరం తిరిగి బరిలోకి దిగుతున్నారు. ఆయన ఎవరి ఓట్లను కొల్లగొడతారోననే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాలను వైసిపి కైవశం చేసుకుంది. పెద్దాపురంలో మాత్రమే టిడిపి గెలిచింది.
కాకినాడ జిల్లాలో కాకినాడ పార్లమెంటు స్థానం, 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి త్రిముఖ పోరు నెలకొంది. అధికార వైసిపి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌ పోటీలో ఉన్నారు. ఈయన గత మూడుసార్లు మూడు పార్టీల నుంచి ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాలుగోసారి ఇదే స్థానం నుంచి ఆయన వైసిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి జనసేన నేత తంగేళ్ల ఉదరు శ్రీనివాస్‌ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎన్నికల బరిలోకి దిగడం కొత్త, యువతకు తప్ప మిగిలిన వర్గాలకు దగ్గర కాలేకపోవడం ప్రతికూల అంశం. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజును ఆ పార్టీ అధిష్టానం ఇటీవలే ప్రకటించింది. ఆయన మూడుసార్లు ఎంపిగా నెగ్గి, రెండుసార్లు కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. సౌమ్యుడుగా, అభివృద్ధి ప్రదాతగా పేరు ఉంది. పార్లమెంటు పరిధిలో బంధు వర్గం కూడా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.

అందరి చూపు.. పిఠాపురం వైపు
పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. అయితే పవన్‌ గెలుపు అంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసిపి నుంచి కాకినాడ ఎంపి వంగా గీత పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

తెరమీదికి ముద్రగడ
వైసిపి నేత ముద్రగడ పద్మనాభం పోటీలో లేకున్నప్పటికీ చరిష్మాను అడ్డుపెట్టుకుని కాపు సామాజిక తరగతికి చెందిన ఓట్లను కొల్లగొట్టాలని, లేదా ఓటర్లు జనసేన వైపు మరలకుండా చూడాలనే ఎత్తుగడలో వైసిపి ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ముద్రగడ ఆయా నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులను కలుస్తున్నారు.

ముగ్గురు సిట్టింగులకు దక్కని టికెట్లు
జిల్లాలో ఒక్క ముద్రగడపైనే ఆధార పడకుండా వైసిపి గెలుపు కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే అభ్యర్థులను సైతం మార్పు చేసింది. జిల్లాలో ఏకంగా ముగ్గురు సిట్టింగులను ఈ ఎన్నికల్లో పక్కన బెట్టింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ను తొలగించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు సీటు కేటాయించింది. పిఠాపురం సిట్టింగు ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని కాకినాడ ఎంపి వంగా గీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును పక్కనబెట్టి మాజీ మంత్రి తోట నరసింహంకు సీటును కేటాయించింది.

అనంతబాబుపై వ్యతిరేకత
ప్రత్తిపాడులో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసిపి నుంచి బరిలో ఉన్నారు. టిడిపి నుంచి సమీప బంధువైన వరుపుల రాజా భార్య సత్యప్రభ పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో అవినీతి, అక్రమాలు బయటపడటంతో అధిష్టానం అతన్ని కాదని సుబ్బారావుకు అవకాశం ఇచ్చింది. అయితే దళిత యువకుడ్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుకు సుబ్బారావు సమీప బంధువుగా ఉన్నారు. అనంతబాబే అక్కడ అన్నీ తానై చూడటంతో వ్యతిరేకత ఉంది. స్థానికులను కాదని అనంతబాబుకు పెత్తనం ఇవ్వడాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అనంతబాబు వల్ల దళిత వర్గం దూరమవుతుందనే సాంకేతాలు కనిపిస్తున్నాయి.
జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం వైసిపి నుంచి పోటీలో నిలవగా, కూటమి అభ్యర్థిగా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ బరిలో ఉన్నారు. గ్రూపు తగాదాలు తోటకు తలపోటుగా మారాయి. సిట్టింగు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం తోట నరసింహంకు పూర్తిగా సహకరించని పరిస్థితి నెలకొంది. పెద్దాపురంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మూడోసారి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు వైసిపి నుంచి బరిలో ఉన్నారు.

భంగపడ్డ యనమల కృష్ణుడు
కాకినాడ సిటీలో అధికార పక్షం నుంచి సిట్టింగు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి బరిలో ఉండగా, కూటమి అభ్యర్థిగా టిడిపి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పోటీ చేస్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా ఉన్న కొండబాబు ద్వారంపూడిని బలంగా ఢకొీట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని టిడిపి, జనసేన, బిజెపి శ్రేణుల్లో కనిపిస్తోంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో వైసిపి నుంచి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలో ఉన్నారు. జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేస్తున్నారు. తుని నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా మంత్రి దాడిశెట్టి రాజా బరిలో ఉండగా, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తొలిసారి పోటీలో నిలుచున్నారు. అయితే యనమల సోదరుడు యనమల కృష్ణుడు టిడిపి టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఆయన అసంతృప్తితో ఉన్నారు.

➡️