ఎన్నికల బరిలో జెఎన్‌యు విద్యార్థి నేతలు

Apr 23,2024 04:50 #2024 election, #jntu, #leaders, #SFI, #students
  • ముగ్గురూ ఇండియా ఫోరం నుంచే
  •  సెరంపూర్‌లో సిపిఎం నుంచి దీప్సితాధర్‌
  •  ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్‌ తరఫున కన్నయ్య కుమార్‌
  •  నలంద స్థానంలో సిపిఐ(ఎంఎల్‌’ అభ్యర్థిగా సందీప్‌ సౌరభ్‌

న్యూఢిల్లీ ప్రతినిధి : దేశానికి రాజకీయ నేతలను, ప్రజాప్రతినిధులను అందించిన విశ్వవిద్యాలయాల జాబితాలో జెఎన్‌యు అగ్రస్థానంలో ఉంది. గత 50 ఏళ్లలో జెఎన్‌యుకు చెందిన పలువురు విద్యార్థి నేతలు రాజకీయాల్లో ప్రవేశించి రాణించారు. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా లోక్‌సభకు చేరుకోలేకపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌, సిపిఎం నేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్‌ కరత్‌, సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌, జెడియు నేత కెసి త్యాగి, కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపి సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌ వంటి వారు రాజకీయాల్లో ఉన్నారు. వారిలో కొంత మంది రాజ్యసభ సభ్యులుగా వెలుగొందారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా జెఎన్‌యుకు చెందిన ముగ్గురు విద్యార్థి సంఘం మాజీ నేతలు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్నయ్య కుమార్‌, నలంద నుంచి సందీప్‌ సౌరభ్‌, సెరంపూర్‌ నుంచి దీప్సితా ధర్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఇండియా ఫోరం అభ్యర్థులే.

ఎస్‌ఎఫ్‌ఐ నేత దీప్సితా ధర్‌
జెఎన్‌యు ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి నేత దీప్సితా ధర్‌ పశ్చిమ బెంగాల్లోని సెరంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టిఎంసి నేత కళ్యాణ్‌ బెనర్జీ ఇక్కడ సిట్టింగ్‌ ఎంపి. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీప్సీత పోటీ చేశారు. సిపిఎం ఆమెను బాలి స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఆమె ఓటమి చెందారు. 1993 ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పిజూష్‌ ధర్‌, దీపికా ఠాకూర్‌ చక్రవర్తి దంపతులకు దీప్సితా ధర్‌ జన్మించారు. ఆమె ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దక్షిణ కోల్‌కతాలోని అసుతోష్‌ కళాశాల నుండి భూగోళశాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. ఆమె న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి జాగ్రఫీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఎంఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం జెఎన్‌యులో పాపులేషన్‌ జియోగ్రఫీలో పిహెచ్‌డి చేస్తున్నారు. కేరళలో తన ఫీల్డ్‌వర్క్‌ను పూర్తి చేశారు. దక్షిణ కోల్‌కతాలోని అసుతోష్‌ కాలేజీలో స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరారు. ఎస్‌ఎఫ్‌ఐ కాలేజ్‌ యూనిట్‌కి తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఆ తర్వాత కోల్‌కతా జిల్లా కమిటీ సభ్యురాలుగా పని చేశారు. 2013లో జెఎన్‌యులో చేరారు. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కి కౌన్సిలర్‌ అయ్యారు. జెఎన్‌యులో ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్‌ కార్యదర్శిగా, ఎస్‌ఎఫ్‌ఐలో పలు హోదాల్లో పని చేశారు. 2015లో ఇండియాలోని బ్రిటన్‌ హైకమిషన్‌ తీసుకెళ్లిన భారతదేశం నుండి ఎనిమిది మందితో కూడిన విద్యార్థి రాజకీయ ప్రతినిధి బృందంలో దీప్సిత ఒకరు. ‘జస్టిస్‌ ఫర్‌ రోహిత్‌ వేముల’ ఉద్యమంతో సహా రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నందుకు ఆమె ఢిల్లీ పోలీసుల దాడిని ఎదుర్కొన్నారు. ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లో సిఎఎ వ్యతిరేక నిరసనలలో కీలక పాత్ర పోషించారు. 2020 అక్టోబర్‌ 2న జరిగిన గ్లోబల్‌ ఇండియన్‌ ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌లోని ప్యానెలిస్ట్‌లో ఆమె ఒకరు.

సందీప్‌ సౌరభ్‌
జెఎన్‌యు స్టూడెంట్స్‌ యూనియన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి సందీప్‌ సౌరభ్‌ బీహార్‌లోని నలంద సీటు నుంచి ఇండియా ఫోరంలో సిపిఐ(ఎంఎల్‌) అభ్యర్థిగా బరిలోకి దిగారు. సందీప్‌ సౌరభ్‌ రాజకీయాల్లో పనిచేయడం కోసం 2017లో హిందీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు. జెఎన్‌యులో పిహెచ్‌డి చేసిన సందీప్‌ 2013లో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పాలిగంజ్‌ నుండి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి జెడియుకు చెందిన కౌశలేంద్ర కుమార్‌ ఎంపిగా ఉన్నారు. జెడియు ఈసారి కూడా ఆయననే బరిలోకి దింపింది. సందీప్‌ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.


కన్నయ్య కుమార్‌
జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ ఇండియా ఫోరంలోకాంగ్రెస్‌ పార్టీ తరపున ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కన్నయ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌ లోని బెగుసరారు నుంచి సిపిఐ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత సిపిఐకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. కన్నయ్య ప్రస్తుతం కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐకి ఇన్‌ ఛార్జ్‌ గా ఉన్నారు. బీహార్‌లోని బెగుసరారు నివాసి కన్నయ్యపై 2016లో దేశద్రోహం ఆరోపణలు రావడంతో ఆయన వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్‌ పై ఉన్నారు. 2015-16లో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేసిన కన్నయ్య కుమార్‌ ప్రస్తుతం బిజెపి అభ్యర్థి మనోజ్‌ తివారీపై పోటీ చేస్తున్నారు. తివారీ 2014 నుంచి ఇక్కడ ఎంపిగా కొనసాగుతున్నారు.

➡️