పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘనలో మోడీ సర్కార్‌ ఘనాపాటి

Feb 12,2024 10:44 #Modi government, #Parliament
Modi Sarkar is famous for violating parliamentary traditions
  • ఉప సభాపతి లేకుండానే సమావేశాల నిర్వహణ
  • చర్చలు, సంప్రదింపులకు దక్కని చోటు
  • పౌర సమాజ గ్రూపుల ఛార్జిషీట్‌

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలు, విలువలను ఉల్లంఘించడంలో ఘనాపాటిగా నిలిచిందని పౌర సమాజ గ్రూపులు, హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మోడీ సర్కారుపై ఘాటైన పదజాలంతో ఛార్జిషీటు విడుదల చేశారు. డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే లోక్‌సభ సమావేశాలను నిర్వహించడం, పార్లమెంటును అతి తక్కువ సార్లు సమావేశపరచడం, ఆర్డినెన్సులపై ఆధారపడడం, కీలకమైన బిల్లులపై అరకొరగా చర్చలు జరపడం వంటి ఉదంతాలను ఆ ఛార్జిషీటులో ప్రస్తావించారు. ఛార్జిషీటును ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సందర్భంగా అహ్మదాబాద్‌కు చెందిన హక్కుల కార్యకర్త సెడ్రిక్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ వివిధ అంశాలపై తమ ఆందోళనల్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఈ ఛార్జిషీటును ప్రజల ముందు ఉంచుతున్నామని, భయం కారణంగానే వారు తమ అభిప్రాయాలను బయటకు చెప్పడం లేదని అన్నారు.

  • ఛార్జిషీటులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి….

డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయకుండానే…

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93కు విరుద్ధంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని భర్తీ చేయకపోవడం అసాధారణం. ఈ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలన్న సంప్రదాయాన్ని కూడా విస్మరించారు. తద్వారా పార్లమెంటరీ పద్ధతులకు స్వస్తి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లోక్‌సభలో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులను భర్తీ చేయాలని ఆర్టికల్‌ 93 నిర్దేశిస్తోంది. స్వాతంత్య్రానంతరం ఉప సభాపతి లేకుండానే లోక్‌సభ పదవీకాలం ముగియడం ఇదే మొదటిసారి. సాధారణంగా స్పీకర్‌ అధికార పక్షానికి చెందిన వారై ఉంటారు. సంప్రదాయకంగా డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు కేటాయిస్తారు. అయితే మోడీ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది.

తక్కువ సిట్టింగ్స్‌తో సరి…

మోడీ పాలనలో పార్లమెంట్‌ సమావేశాలు జరిగే రోజులు తగ్గిపోతున్నాయి. ఇటీవలి చరిత్రలోనే 17వ లోక్‌సభ అత్యంత తక్కువ సార్లు సమావేశమైంది. ఈ సమావేశాలు 2024 బడ్జెట్‌ సమావేశాలతో కలిపి సుమారు 278 రోజులు జరిగాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన సమావేశాలు (1999-2004 మధ్య 13వ లోక్‌సభ) 423 రోజుల పాటు కొనసాగాయి. దానితో పోలిస్తే ఇప్పుడు 34% తక్కువ రోజులు పార్లమెంట్‌ సమావేశమైంది. గత సమావేశాలతో పోల్చినప్పటికీ ఈ తగ్గుదల స్పష్టంగా కన్పిస్తోంది. సమావేశాల్లో చర్చలు సరిగా జరగలేదన్న విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది. ఆర్డినెన్సులపై ఎక్కువగా ఆధారపడడం, తక్కువ సమయంలో చర్చ ముగించి బిల్లుల్ని ఆమోదించడం, పార్లమెంటరీ అజెండాలను తారుమారు చేయడం వంటి ఉదంతాలు కూడా చోటుచేసుకున్నాయి.

ఇవేం సంప్రదింపులు?

2009-14 మధ్య 71% బిల్లుల్ని స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు నివేదిస్తే 2019 నుండి కేవలం 16% బిల్లుల్ని మాత్రమే ఈ కమిటీకి పంపారు. 2014-2021 మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టిన 301 బిల్లుల్లో కేవలం 74 బిల్లుల్ని…అంటే 24.5% బిల్లుల్ని మాత్రమే సంప్రదింపుల కోసం సభ్యులకు పంపిణీ చేశారు. వీటిలో కూడా కనీసం 40 బిల్లుల్ని నిర్ధారిత సమయమైన 30 రోజుల ముందుగా సభ్యులకు అందజేయలేదు. మూడు క్రిమినల్‌ బిల్లులపై స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రజల నుండి వ్యాఖ్యలను ఆహ్వానించలేదు. దీనిపై పలువురు ప్రతిపక్ష ఎంపీలు తమ అసమ్మతిని తెలియజేస్తూ నోట్‌ అందజేశారు. 2014 తర్వాత కేవలం ఐదు బిల్లులు మాత్రమే సంయుక్త పార్లమెంటరీ కమిటీల ముందుకు వెళ్లాయి. 2016-2023 మధ్యకాలంలో 79% బడ్జెట్‌ ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన బడ్జెట్లను పరిశీలించేందుకు స్టాండింగ్‌ కమిటీలకు గతంలో 40 రోజుల సమయం ఇచ్చే వారు. దానిని 2021లో 20 రోజులకు కుదించారు.

ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నల తొలగింపు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నుండి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంతో వారు లేవనెత్తిన సుమారు 290 ప్రశ్నలను తొలగించారు. వాస్తవానికి సస్పెన్షన్‌కు గురైన సభ్యుల ప్రశ్నలను తొలగించే నిబంధన ఏదీ అమలులో లేదు. కీలక బిల్లుల ఆమోదంలో చూపిన తొందరపాటు ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసింది. జవాబుదారీతనం లోపించింది. అసాధారణ రీతిలో సమావేశాల నుండి 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం ఇదే తొలిసారి. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ తర్వాత క్రిమినల్‌ బిల్లులు, టెలికం బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు వంటి కీలక బిల్లుల్ని ఉభయసభల్లో ఆమోదించారు. ఏదేమైనా సభ నుండి సస్పెండ్‌ అయిన సభ్యుల ప్రశ్నలను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2015, 2020, 2023లో కూడా ఇలాగే జరిగిందని పౌర సమాజ బృందాలు విడుదల చేసిన ఛార్జిషీటు ఎత్తిచూపింది.

➡️