ఈశాన్యం గాలి ఎటు వైపో!

  • ఎన్నికల్లో ప్రభావం చూపనున్న మణిపూర్‌ మారణహోమం
  • సిఎఎ, యుసిసి, ఎఎఫ్‌ఎస్‌పిఎ రద్దు
  •  కార్పొరేట్ల ప్రకృతి విధ్వంసం
  •  సరిహద్దు సమస్యలు

ఒకపక్క సరిహద్దు సమస్యలు.. మరోపక్క మతపరమైన భౌతిక దాడులతో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల మణిపూర్‌లో చోటుచేసుకున్న అల్లర్లే అందుకు తార్కాణం. కొన్ని రాష్ట్రాల్లో బిజెపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉన్నా.. సిఎఎ, యుసిసి, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 19న అస్సాం, మణిపూర్‌, మేఘాలయా, నాగాలాండ్‌, మిజోరాం రాష్ట్రాల తొమ్మిది లోక్‌సభ స్థానాలకు తొలిదశలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం ప్రాంతీయ పార్టీల వెంట బిజెపి, సామాన్య ప్రజలకు చేరువగా ఇండియా కూటమి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్యంలో గెలుపు ఎవరిది…?


శాంతి కోసం పరితపిస్తున్న కుకీలు..
మణిపూర్‌ 1967 నుంచి 2018 వరకు కాంగ్రెస్‌ పాలనలో కొనసాగింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని 2019లో బిజెపి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి జాతుల మధ్య వివాదం రగులుతూనే ఉంది. 2023 మేలో మొయితీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కుకీలపై నేటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయినా పట్టించుకునే నాధుడే లేక కుకీలు తల్లడిల్లిపోయారు. మహిళలను వివస్త్రలను చేసి నడివీదుల్లో తిప్పడం, అత్యాచారాలు, ఇళ్లు, చర్చీలను తగలబెట్టడం, గృహ దహనాలు, హత్యలు.. మొదలైనవాటితో నేటికీ ఘర్షణలు వెల్లువెత్తుతున్నా మోడీ మణిపూర్‌ వైపు కన్నెత్తైనా చూడలేదు సరికదా, నోరు కూడా మెదపలేదు. బిజెపి మోడీ ప్రభుత్వం మణిపూర్‌లో శాంతిని నెలకొల్పలేకపోయింది. యాభై వేల మందికిపైగా నిరాశ్రయులు సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. వారిని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ గాంధీని సైతం అడ్డుకున్నారు. మణిపూర్‌ మారణహోమం ప్రభావం ఈశాన్య రాష్ట్రాలన్నింటిపైనా చూపనుంది. మణిపూర్‌లో రెండు పార్లమెంటు స్థానాలకుగాను ఇన్నర్‌ మణిపూర్‌కు ఏప్రిల్‌ 19న, ఔటర్‌ మణిపూర్‌ స్థానానికి ఏప్రిల్‌ 26న ఎన్నికలు జరగనున్నాయి.

అస్సాంలో పౌరసత్వ వివాదం
అస్సాం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సి), సిఎఎ, సరిహద్దు వివాదం వంటివి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు. బిజెపి తెర తీసిన ఎన్‌ఆర్‌సిలో పేర్ల నమోదుకు ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత ఎదురైంది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోడానికి స్థానికులు, వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు చెందినవారిగా అనుమానించబడిన వ్యక్తులు, విదేశీయులుగా గుర్తించబడిన వారు, అనుమానాస్పద ఓటర్లు ఇతర కారణాల వల్ల ఈ రిజిష్టర్‌లో పేరు నమోదుకాని వారిని ప్రత్యేక నిర్భంధ కేంద్రాల్లో ఉంచారు. వీటిని 2010 నుంచి నిర్వహిస్తున్నా, కనీస సౌకర్యాలకు నోచుకోక ఇబ్బందిపడుతున్న వారు ఎందరో. ఈ మధ్య తెర మీదకు వచ్చిన సిఎఎకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలకు భయపడి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్సాం పర్యటనను రద్దు చేసుకున్నారంటే దాని తీవ్రత ఎంతలా ఉందో అర్థంచేసుకోవచ్చు. సరిహద్దు వివాదాలను చక్కబెట్టంలో సిఎం హిమంత బిశ్వశర్మ విఫలమయ్యారు. పైగా కులాల మధ్య విద్వేషాలను రగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూటమి గెలుపొందింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. ఈ సారి కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలే ఎక్కువ.

మేఘాలయా
మేఘాలయాలో కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలే కొనసాగుతున్నాయి. తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌ 19న షిల్లాంగ్‌, ఏప్రిల్‌ 26న తురా నియోజకవర్గాలకి ఎన్నికలు జరగనున్నాయి. షిల్లాంగ్‌ సీటుకు ఇంతకుముందు కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు గెలిచిన విన్‌సెంట్‌ పాలా ఈసారి పోటీ చేస్తున్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌పీపీ ఒక్కో స్థానాన్ని గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తలపడేందుకు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి బిజెపి మద్దతు తెలిపింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్‌ సాధించినప్పటికీ కావాల్సిన మెజారిటీ రాకపోయేసరికి రెండు సీట్లు గెలుపొందిన బిజెపి, ఎన్‌పీపీ, పీడీపి, హెచ్‌ఎస్‌పిడి, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

యుసిసి వద్దు
నాగాలాండ్‌లోనూ ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పోటీ పడుతోంది. నాగాలాండ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి తొలివిడత ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ స్థానానికి ఎన్‌డిపిపి మెజారిటీ పొందగా, కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. 2004, 2014లో ఎన్‌పిపి గెలుపొందింది. యుసిసి ని రాష్ట్రంలోని అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. యుసిసిని పార్లమెంటు ఆమోదించినా, నాగాలాండ్‌లో మినహాయించాలని కోరుతున్నాయి. దీనిపై శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. మిలిటెంట్లుగా భావించి, సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరపటంతో 14 మంది పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఎప్పటి నుంచో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) రద్దు డిమాండ్‌ వినిపిస్తోంది.

ఒకేఒక్క సీటు
మిజోరాంలో ఒకేఒక్క లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ గెలుపొందింది. ఐదుగురు ఎంఎన్‌ఎఫ్‌ నుంచి వలాల్‌వెనా, కాంగ్రెస్‌ నుంచి లాల్‌బైగ్జమా, జడ్‌పిఎం నుంచి రిచర్డ్‌, ఎంపిసి నుంచి రిటా మాల్‌సౌమి, స్వతంత్ర అభ్యర్థి లాల్హ్రియాత్రేంగా ఛంగ్తే పోటీ పడుతున్నారు. భారత, మయన్మార్‌ సరిహద్దులో కంచె నిర్మించాలన్న కేంద్ర నిర్ణయాన్ని మిజో అసెంబ్లీ వ్యతిరేకించింది.

➡️