పింఛన్‌ ‘ముప్పు’

May 1,2024 03:02 #AAP Government, #Pension
  •  బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందేనా!
  •  బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయిపోతే!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సామాజిక భద్రత పింఛను తీసుకునే లబ్ధిదారులకు మరోమారు ఇబ్బందులు తప్పేటట్లులేవు. ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డిబిటి (డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) నిర్ణయంతో పింఛనుదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెలలో పింఛను కోసం సచివాలయాలకు వెళ్లి 33 మంది వృద్ధులు మరణించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం తీరు మార్చుకోకుండా, ఈసారి ఏకంగా పింఛనుదారులు తమ పింఛను నగదు కోసం మండుటెండలో రెండు చోట్లకు వెళ్లి, వేచి చూసేలా ఆదేశాలిచ్చింది. మే నెలకు సంబంధించిన పింఛను నేరుగా ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దానికనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఏ పింఛనుదారుడుకు బ్యాంకు ఖాతాలో నగదు పడుతుంది? ఏ పింఛనుదారుడుకు బ్యాంకు ఖాతా లేదు? ఏ లబ్ధిదారుకు ఇంటింటికి వచ్చి ఇస్తారు? తదితర అంశాలన్నీ తెలుసుకోవాలంటే మళ్లీ.. లబ్ధిదారులందరూ సచివాలయ బాట పట్టాల్సిందే. తదనంతరం అక్కడ వివరాలు సేకరించి, అక్కడ నుంచి బ్యాంకులకు పరుగులుపెట్టి, బ్యాంకుల్లో నుంచి నగదు డ్రా చేసుకుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మండుటేసవిలో సచివాలయానికి వెళ్లేందుకే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పింఛనుదారులు, మళ్లీ అక్కడ నుంచి బ్యాంకులకు వెళ్లి, అక్కడ క్యూలో నుంచోని లేదా ఎటిఎం సెంటర్లకు వెళ్లి అక్కడ వెయిట్‌ చేసి నగదు తీసుకునే సరికే వారు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యే అవకాశం కనపడుతోంది. దీంతో పింఛను కోసం వెళితే ముప్పు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని పింఛనుదారులు వాపోతున్నారు.
డబ్బులు మొత్తం పడతాయా? కట్‌ అవుతాయా?
ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తే.. డబ్బులు మొత్తం వస్తాయా? లేక ఏమైనా కట్‌ అవుతాయా? అనే ఆందోళన కూడా పింఛనుదారుల్లో నెలకొంది. చాలా బ్యాంకులు ప్రస్తుతం మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాలని చెబుతున్నాయి. ఒకవేళ మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఖాతాలో లేకపోతే మైనస్‌ బ్యాలెన్స్‌ చూపిస్తున్నాయి. బ్యాంకు ఖాతాలో నగదు పడిన వెంటనే ఆ మైనస్‌ బ్యాలెన్స్‌ కట్‌ అయిపోయి మిగిలిన నగదు మాత్రమే ఖాతాలో చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జమ చేయనున్న పింఛను సొమ్ము నుంచి బ్యాంకులు మెయింటేనెన్స్‌, మైనస్‌ బ్యాలెన్స్‌ల రూపేణా నగదును కట్‌ చేసుకుంటాయేమోననే ఆందోళన పింఛనుదారుల్లో ఉంది. దీనిపై అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు బ్యాంకులకు రాలేదు.

➡️