హడావుడిగా ఉద్యోగుల బకాయిలు చెల్లింపు

Apr 19,2024 02:31 #Employees, #money

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల వేళ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థికశాఖ దృష్టి సారిస్తోంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావుడిగా ఆర్థికశాఖ చర్యలు ప్రారంభించిరది. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు. ఒకవైపు సామాజిక పింఛన్లు, వేతనాలకు నిధులు సమకూరుస్తూనే, మరోవైపు జిపిఎఫ్‌, మెడికల్‌ బిల్లులు వంటివి చెల్లించేందుకూ చర్యలు తీసుకుంటున్నారు.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేరదుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్‌డ్రాఫ్ట్‌కు కూడా వెళ్తున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా ఖజానా ఓడీలోనే ఉంది. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేరదుకే ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల్లోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే. వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీని ప్రభావం ఓటింగ్‌పైనా పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

➡️