Rice : తెలుగు రాష్ట్రాల్లో బియ్యం సేకరణకు కేంద్రం భారీగా కోత

Apr 2,2024 22:17 #Food corporation of india, #rice

– దేశవ్యాప్తంగా ఏడుశాతం తగ్గుదల
– ఆంధ్రప్రదేశ్‌లో 36 శాతం, తెలంగాణలో 28 శాతం తగ్గుదల

దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలోనే వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉంటే.. పండిన బియ్యాన్ని సేకరించడంలో కూడా కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోంది. అందునా ప్రత్యేకించి ఆంధ్రా, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ధాన్యం సేకరణకు కేంద్రం భారీగా కోత విధిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బియ్యం కొనుగోళ్లలో కూడా భారీ వ్యత్యాసముంది. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో 36 శాతం, తెలంగాణాలో 28 శాతం మేర బియ్యం కొనుగోలు పడిపోయిందని స్వయానా ఎఫ్‌సిఐ నివేదికే వెల్లడిచింది. కేంద్రం తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందనడానికి ఈ నివేదికే సాక్ష్యంగా నిలుస్తోంది.

ఈ ఏడాది బియ్యం సేకరణ విషయాలకొస్తే.. (2023-24 ఖరీఫ్ మార్కెట్ సీజన్ ప్రారంభమైన అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31)కి 45.44 మిలియన్‌ టన్నుల బియ్యం మాత్రమే సేకరించినట్లు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ) తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది బియ్యం సేకరణ 7.3 శాతం తగ్గింది. గతేడాది 49.01 మిలియన్‌ టన్నులు సేకరిస్తే ఈ ఏడాది టాప్‌గా 45.44 మిలియన్‌ టన్నులను  మాత్రమే సేకరణ జరిగింద ఎఫ్‌సిఐ తెలిపింది. అయితే ప్రభుత్వ  52.5 మెట్రిక్ టన్నుల లక్ష్యం గా ఉంది.
చత్తీస్‌గఢ్‌ ఫిబ్రవరి 4నాటికి 8.3 మిలియన్‌ టన్నుల సేకరించిందని ఎఫ్‌సిఐ తెలిపింది. గతేడాది 5.87 మిలియన్‌ టన్నులు సేకరించిన చత్తీస్‌గఢ్‌… ఈ ఏడాది తన లక్ష్యాన్ని మించి, 7.82 మిలియన్‌ టన్నులు సేకరించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బియ్యం కొనుగోళ్లను పరిశీలిస్తే.. ప్రతి ఏడాది పశ్చిమ బెంగాల్‌ ప్రధాన బియ్యం ఉత్పత్తి గల రాష్ట్రంగా ఉంటుంది. కాగా, గతేడాది 2.07 మిలియన్‌ టన్నులు సేకరణ అయితే, ఈ ఏడాది 0.78 మిలియన్‌ టన్నులకు పడిపోయింది.
పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాలతోపాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో డిసెంబర్‌ చివరి నాటికి బియ్యం సేకరించగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జనవరి 31, తూర్పు యుపిలో ఫిబ్రవరి 29 కల్లా బియ్యం సేకరణ జరిగింది. దీన్నిబట్టి ఎఫ్‌సిఐ లెక్కల ప్రకారం… పంజాబ్‌లో 12.41 మిలియన్‌ టన్నులు సేకరణ అయినట్లు తెలుస్తోంది. హర్యానా 12.19 మిలియన్‌ టన్నులతో గతేడాది కంటే ఈ ఏడాది రెండు శాతం పెరిగిందని ఎఫ్‌సిఐ తెలిపింది. హర్యానాలో 2022-23లో 3.95 మిలియన్‌ టన్నులు  కాగా.. ఇప్పుడు 3.94 మిలియన్‌ టన్నులే సేకరణ అయిందని ఎఫ్‌సిఐ పేర్కొంది.

ఏపీలో భారీ అంతరం
కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో 3.61 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని సేకరించింది. అయితే ఇది గతేడాది కంటే బాగా తక్కువ. గతేడాది 4.39 మిలియన్‌ టన్నుల్ని సేకరించగా.. ఇప్పుడు 3.61 టన్నులకి పడిపోయింది. ఇక తెలంగాణాలో బియ్యం కొనుగోలు బాగా పడిపోయింది. 4.36 మిలియన్‌ టన్నులు నుంచి 3.17 మిలియన్‌ టన్నులకి పడిపోయింది. ఒడిశాలో కూడా బియ్యం ఉత్పత్తి బాగా తగ్గింది. గతేడాది 4.42 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 3.95 మిలియన్‌ టన్నులు మాత్రమే సేకరించారు.
ఈ రాష్ట్రాలన్నిటితో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. కేంద్ర బియ్యం సేకరణ ముగిసేనాటికి ఏపీలో దాదాపు 36 శాతం తగ్గింది. గతేడాది 2.1 మిలియన్‌ టన్నులు సేకరించగా, ఈ ఏడాది 1.34 మిలియన్‌ టన్నులకి పడిపోయింది.
2022-23 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖరీఫ్‌, రబీ, జైడ్‌ సీజన్లలో కలిపి 56.87 మిలియన్‌ టన్నులను కొనుగోలు చేసింది. వ్యవసాయ ఆరోగ్యమంత్రిత్వశాఖ అంచనా ప్రకారం… ఖరీఫ్‌, రబీ సీజన్లతో కలిపి గతేడాది కంటే ఈ ఏడాది ఒక శాతం తగ్గిందని అంచనా వేసింది. 2022-23లో 125.52 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి కాగా… 2023-24 (జూలై- జూన్‌) నాటికి 123.82 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జైడ్‌ (దాల్వా) సీజన్‌లో వచ్చే పంట ఉత్పత్తిని అంచనా వేయలేదు. 2022-23వ సంవత్సరంలో జైడ్‌ సీజన్లో సుమారు 10.24 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అయింది.

 

➡️