గిట్టుబాటు కాని వ్యవసాయం 

Feb 16,2024 09:07 #Agriculture Sector
Subsistence agriculture
  • దళారులు నిర్ణయించిందే ధర!
  • కానరాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : ఏటేటా వరి సాగు అన్నదాతల పాలిట ఉరితాళ్లవుతున్నాయి.. రైతే రాజు..దేశానికి పట్టెడన్నం పెట్టేది రైతన్నేనంటూ గొప్పలు చెప్పడమే తప్ప కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) ప్రకటించే కనీస ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం శ్రమ అప్పుల పాలవుతోంది. ధాన్యానికి గిట్టుబా టు ధర లేక దళారుల చేతుల్లో రైతు దగా పడాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితులను, ప్రకృతి విపత్తులను తట్టుకుని..కష్టాన్నే నమ్ముకుని పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సరైన సమయంలో కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నకు ఈ పరిస్థితి దాపురిస్తోంది.

  • దళారులు నిర్ణయించిందే ధర!

ఏటా పెట్టుబడి, కూలీలు, ఎరువుల ఖర్చులు పెరుగుతున్నాయే తప్ప రైతు పండించిన ధాన్యానికి మాత్రం గిట్టుబాటు ధర మాత్రం పెరగడం లేదు. పదేళ్ల కిందట ఎకరా పొలంలో వరిని పండించేందుకయ్యే ఖర్చు రూ.10 వేలు కాగా ఇప్పుడు రూ.35 వేలకు చేరుకుంది. అయితే 75 కిలోల ధాన్యం బస్తాకు చెల్లిస్తున్న గిట్టుబాటు ధర మాత్రం రూ.1700 లోపే ఉంటోంది. గతేడాది గ్రేడ్‌-1 పరిధిలోకి వచ్చే వరి రకాలకు రూ.1727, సాధారణ రకాలకు రూ.1512 చెల్లిస్తానని చెప్పింది. అయితే మిల్లర్లు, దళారీలు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు చెల్లిస్తున్న ధర మాత్రం రూ.1400 నుంచి రూ.1550 వరకు ఉంటోంది.

ఈ ఏడాది జనవరిలో గ్రేడ్‌-1 వరి రకం 80 కిలోలకు రూ.2500 మద్దతు ధర పలికింది. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకోవడంతో దళారీలు సిండికేట్‌గా ఏర్పడి మద్దతు ధరను ఏకంగా రూ.2100కు తగ్గించేశారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక పోయినా వేరే దారి లేక దళారులు నిర్ణయించిన ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది.

త్వరలోనే ఏర్పాటు చేస్తాం: రమేష్‌బాబు, ఏడీఏ, శ్రీకాళహస్తి

రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు ప్రభు త్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. తూర్పు మండలాల్లో ఎక్కువ మంది డిసెంబరు, జనవరి నెలల్లో మాత్రమే వరి నాట్లు వేస్తారు. అవి మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కోతకు వస్తాయి. ఈ ఏడాది మార్చి నెలలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. మద్దతు ధర కూడా రైతులకు గిట్టుబాటయ్చే అవకాశాలే అధికంగా ఉంటాయి. రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదు.

➡️