గణనీయమైన తేడాలున్నాయి

Jan 30,2024 11:03 #Comments, #Israel
  • కాల్పుల విరమణ చర్చలపై ఇజ్రాయిల్‌ వ్యాఖ్యలు
  • ఈ వారం కూడా కొనసాగుతాయంటూ వెల్లడి

రఫా : ఆదివారం అమెరికా, కతార్‌, ఈజిప్ట్‌లతో కాల్పుల విరమణపై చర్చలు జరిగిన తర్వాత ఇంకా గణనీయమైన అంతరాలు వున్నాయని ఇజ్రాయిల్‌ తెలిపింది. అయితే చర్చలు నిర్మాణాత్మకంగానే జరిగాయని వ్యాఖ్యానించింది. ఈ వారంలో కూడా చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. అయితే ఆ గణనీయమైన అంతరాలు ఏమిటనే వివరాలను ఆ ప్రకటన వెల్లడించలేదు. ఇతర పక్షాల నుండీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన బందీలను కూడా విడుదల చేస్తే అందుకు ప్రతిగా హమాస్‌పై సైనిక చర్యను ఇజ్రాయిల్‌ ఆపడానికి ఒప్పందం కుదిరే అవకాశాల దిశగా పురోగతి వుండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ జరిపిన సైనిక చర్యలో 26,422 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఆదివారం జరిగిన కాల్పుల విరమణ చర్చల్లో సిఐఎ డైరెక్టర్‌ బిల్‌ బర్న్స్‌, మొసాద్‌ అధిపతి డేవిడ్‌ బర్నియా, కతార్‌ ప్రధాని మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహమాన్‌ అల్‌ థాని, ఈజిప్ట్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అబ్బాస్‌ కామెల్‌ పాల్గొన్నారు.సమావేశానంతరం బైడెన్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ఇరువురు మాట్లాడుతూ, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు వున్నాయని, ఇది రెండు దశల్లో అమలు కావచ్చని, మొదటి దశలో 30రోజుల విరమణలో భాగంగా మహిళలు, వృద్ధులు, గాయపడిన బందీలను విడుదలవుతారని తెలిపారు.

తక్షణమే నిధులు అందించాలి

గాజాలోని ప్రజలకు మానవతా సాయమందించేందుకు తక్షణమే పాలస్తీనా శరణార్ధుల సంస్థకు నిధులను అందించాల్సిందిగా అమెరికా ఇతర దేశాలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి చివరికల్లా గాజాలో తమ మద్దతును అందించే కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందంటూ పాలస్తీనా శరణార్ధుల సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ జూలియట్‌ టోమా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుటెరస్‌ విజ్ఞప్తి వెలువడింది. దాడికి మాదే బాధ్యతన్న ఇరాక్‌ గ్రూపుజోర్డాన్‌-సిరియా సరిహద్దుల్లో గల అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు అమెరికన్‌ సైనికులు మృతి చెందగా, 34మంది గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యత అంటూ ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ ఇన్‌ ఇరాక్‌ అనే గ్రూపు ప్రకటించింది. కాగాఈ దాడితో తమకెలాంటి సంబంధం లేదని ఇరాన్‌ ప్రకటించింది.

ముగ్గురు పౌరులు మృతి

మరోవైపు దక్షిణ గాజాలో ప్రజలతో ప్రమాదకరంగా కిక్కిరిసిపోయిన రఫా నగరంలోకి మరింత మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ బలవంతంగా నెట్టివేస్తోంది. ఖాన్‌ యూనిస్‌ నగరంపై దాడులతో ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. ఈ నగరంలోని అల్‌ అమల్‌ ఆస్పత్రికి సమీపంలో ముగ్గురు పౌరులను ఇజ్రాయిల్‌ బలగాలు కాల్చి చంపాయి. వరుసగా 8 రోజులుగా నాజర్‌, అ ల్‌ అమల్‌ ఆస్పత్రులను ఇజ్రాయిల్‌ సైన్యం చుట్టుముట్టి దాడులు చేస్తోంది.

➡️