పిడుగుల వాన -ఏడుగురు మృతి

May 8,2024 08:39 #heavy rains, #lost crops

-ఈదురుగాలులతో అరటి, మామిడికి తీవ్ర నష్టం
-తడిచిపోయిన మొక్కజన్న, ఎరడుమిర్చి
ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగుల వాన కురిసింది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరటి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. పిడుగుపాట్లకు ఐదుగురు, వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు… మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో మొక్కజన్న చేలో పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు బందల నాగేంద్రం (52), ఆమె కుమార్తె యండ్రపల్లి నాగరాణి (25) మరణించారు. అదే మండలం కుందిరివానిపాలేనికి చెరదిన ఆవుల కోటేశ్వరరావు (45), బాపట్ల జిల్లా సంతమావులూరు గ్రామానికి చెందిన ఆయన మేనల్లుడు గోపి (25) గొర్రెలను మేపుతుండగా పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు. కొబ్బరి చెట్టు విరిగి మీదపడడంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన రైతు నిమ్మల శ్రీనివాస్‌ (45) అక్కడికక్కడే మృతి చెందారు. వర్షానికి ధాన్యం తడిసిపోకుండా బరకా కప్పేందుకు మోటార్‌ సైకిల్‌పై తన బాబారు ఇంటికి వెళ్లి బయట నుంచి ఆయనను పిలుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆచంటకు చెందిన కౌలు రైతు కంకిపాటి శివయ్య (56) వర్షానికి ధాన్యం బస్తాలు తడవకుండా బరకాలు కప్పుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆచంటలోని సిహెచ్‌సికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లిలో పశువులు మేపేందుకు వెళ్లిన పరస రామారావు (41) పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈదురు గాలులకు కృష్ణా జిల్లా గుడివాడలో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో, ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. బస్టాండ్‌ పూర్తిగా మునిగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో అరటి చెట్లు, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయపురం, లావేటిపాలెం, జిజి వలస, లావేరు, సంతవలసలో అరటి, బప్పాయి చెట్లు, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో అరటి చెట్లు విరిగిపడ్డాయి. కృష్ణా జిల్లా బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, అవనిగడ్డ, నాగాయలంక తదితర మండలాల్లో వర్షానికి, ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొలాల్లో ఎండబెట్టిన మొక్కజన్న, కళ్లాల్లో ఎండబెట్టిన ఎండు మిర్చి తడిచిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గంటన్నరపాటు భారీ వర్షం కురవడంతో రైల్వే స్టేషన్‌ రోడ్డు, తాడి తోట, శ్యామలా సెంటర్‌, కంబాల చెరువు ప్రాంతాలు నీట మునిగాయి. హైటెక్‌ బస్టాండ్‌ జలమయమైంది. కడియంలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కాకినాడ జిల్లాలో శంఖవరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎన్‌టిఆర్‌ జిల్లా వీరులపాడు, రెడ్డిగూడెంలో వృక్షాలు నేలకొరిగాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.

➡️