3 జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు

  • శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరులకు చోటు

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. వీటిలో శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాకు ఏకంగా మూడు మంత్రి పదవులు వచ్చాయి. గుంటూరు నుంచి టిడిపి తరఫున ఎంపిగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా రెండు రోజుల క్రితం ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఏర్పాటైన రాష్ట్ర మంత్రి వర్గంలో మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌ (టిడిపి), తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ (జనసేన)లకు చోటు లభించింది. తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి 91 వేలకుపైగా ఆధిక్యతతో గెలిచిన నారా లోకేష్‌ రెండోసారి మంత్రి అయ్యారు.

శ్రీకాకుళం నుంచి బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ మంత్రులే…
శ్రీకాకుళం జిల్లాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడుకు కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్‌డిఎ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్‌ హోదా దక్కింది. ఎర్రన్నాయుడు మరణం తర్వాత ఆయన వారసునిగా 2012లో రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేసిన రామ్మోహన్‌నాయుడు తొలిసారి టిడిపి నుంచి 2014లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎంపిగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లోనూ, తాజా ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఎర్రన్నాయుడు సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు మంత్రివర్గంలో మరోసారి మంత్రి అయ్యారు. ఆయన టెక్కలి నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున 2014 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 2014లో అప్పటి చంద్రబాబు మంత్రివర్గంలో తొలుత కార్మిక శాఖ, ఆ తర్వాత రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపిగా బిజెపి తరఫున గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో టిడిపికి చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చోటు దక్కించుకున్నారు. ఆయన 2014 ఎన్నికల్లో తొలిసారి టిడిపి తరఫున పాలకొల్లు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ, తాజా ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

➡️