గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత

Apr 13,2024 12:54 #MGNREGA, #Wages, #workers

న్యూఢిల్లీ :   మోడీ ప్రభుత్వం తన పదవీ కాలం ప్రారంభంలో యుపిఎ ప్రభుత్వ (2004-14) వైఫల్యాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ను సాక్ష్యంగా పేర్కొంది.  అయితే ఈ చట్టం మూడు అంశాలతో తీవ్రంగా ప్రభావితమైందని లిబ్‌టెక్‌ ఇండియా సీనియర్‌ పరిశోధకుడు చక్రధర్‌ బుద్ధ పేర్కొన్నారు. మొదటిది బట్టెట్‌ కేటాయింపులు, రెండు సాంకేతిక మార్పులు . ముఖ్యంగా సరైన పర్యవేక్షణ లేకుండా మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)ను ప్రవేశపెట్టడంతో పలు సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో అడ్డంకులు సృష్టించిందని అన్నారు. మూడవది. ఉపాధి పనుల గుర్తింపు, ప్రక్రియలో పారదర్శకత లోపించడం సహా పలు రాష్ట్రాలపై కేంద్రం ధోరణి ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు.

కరోనా సమయంలో పరిస్థితి
కరోనా సమయంలో ఈ చట్టానికి మరింత ప్రోత్సాహం అందింది. లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోసం లక్షలాది మంది కార్మికులు నగరాల నుండి గ్రామాలకు వలస వచ్చారు. నివేదిక ప్రకారం.. 2020-21, 2021-22 సంవత్సరాలలో దాదాపు 11 కోట్ల మంది కార్మికులు ఉపాధి చట్టంలో కార్మికులుగా చేరారు. 2006లో ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఏడాదిలోనే కార్మికులు పెరగడం అత్యధికం. కరోనాకి ముందు 2020 ప్రారంభంలో ఏడాదికి ఈ పథకం కింద సగటున 60-75 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందారు.

బడ్జెట్‌ కేటాయింపులను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2020-21లో ఆల్‌టైమ్‌ గరిష్టంగా రూ.లక్ష కోట్లను కేటాయించింది. అయితే మరుసటి ఏడాదే బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధించడం గమనార్హం. 2021-22లో బడ్జెట్‌ కేటాయింపులు కేవలం రూ. 96,000 కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు తగ్గడంతో కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఆర్థిక సంవత్సరం 2024లో 8 కోట్ల మంది ఉపాధి చట్టం కింద పనిచేశారు. ఈ సంఖ్య కరోనా ముందు కన్నా అధికం. అదే సమయంలో కార్మికుల పనిగంటలు కూడా 2023 ఆర్థిక సంవత్సరం కన్నా అధికంగా ఉన్నాయి.

ఉపాధి హామీ కార్మికులు పెరగడమంటే (ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో ప్రజలు చిన్న ఉద్యోగాలు కోరడం) కరోనా తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదని అర్థమని ప్రముఖ ఆర్థిక వేత్త అమిత్‌ బసోల్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు ఉపాధి కల్పించడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ మోడీ ప్రభుత్వం కార్మికులకు పనిచూపకపోగా, బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను బలవంతంగా పేదరికంలోకి నెట్టేస్తోంది.

ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎలో సాంకేతిక మార్పులు
2014 నుండి ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎలో కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను పూర్తిగా మార్చివేసింది. ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్‌) నుండి యాప్‌ ఆధారిత హాజరుకి మారింది. పదేళ్లలో డ్రోన్‌ పర్యవేక్షణ; డిజిటల్‌ జోక్యం అనేక రెట్లు పెరిగింది. ఈ మార్పుతో ప్రయోజనం కన్నా నష్టమే అధికంగా ఉందని కార్మికులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చట్టంలో పారదర్శకత కోసం డిజిటల్‌ జోక్యం, సాంకేతికత తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ.. వేతనాల్లో కోత విధించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని కార్మికులు వెల్లడిస్తున్నారు. అయితే డిజిటల్‌ జోక్యం యంత్రాంగం మార్పు ఈ చట్టాన్ని క్లిష్టతరం చేశాయని పలువురు కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజమైన కార్మికులను తొలగించడం, వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నాయి.

నిధుల నిలిపివేత ..
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) అధికారంలోకి రావడంతో అతిపెద్ద సమస్య ఎదురైంది. 2022 మార్చి 9 నుండి ఈ రాష్ట్రానికి నిధులు నిలిచిపోయాయి. పశ్చిమబెంగాల్‌లో పరిస్థితిని అంచనావేసేందుకు నిజ నిర్థారణ కమిటీ ఆ రాష్రంలో పర్యటించింది. ఈ పథకానికి నిధులు నిలిచిపోవడంతో పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిందని స్పష్టం చేశాయి.పనిచేసేందుకు కార్మికులు ముందుకువచ్చినప్పటికీ గతేడాది ఆర్థిక సంవత్సరంలో వారికి ఉపాధి చూపించలేదని కార్మికులు వెల్లడించినట్లు కమిటీ తెలిపింది. ఒకవేళ ఉపాధి పొందినా 12 రోజుల పనిని ఆరు రోజుల్లో చేయాల్సి వుంది. చాలా మంది కార్మికులు ముఖ్యంగా ఒంటరి మహిళలు వేతనాలు చెల్లించలేదని తెలిపారు. దీంతో జీవనో పాధిపై ప్రభావం పడిందని, భోజనం మానేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఒక్క పశ్చిమబెంగాల్‌లో మాత్రమే కాదని బిజెపియేతర రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

➡️