జోరు సాగేనా?!

Mar 26,2024 07:18 #2024 ipl, #Cricket, #csk, #Gujarat Titans
  • సూపర్‌కింగ్స్‌తో టైటాన్స్‌ పోరు

చెన్నై : 2023 ఐపీఎల్‌ ఫైనల్‌ రీ మ్యాచ్‌ కాస్త ఆలస్యమైనా.. తొలి వారంలోనే అభిమానుల ముందుకొచ్చింది. గత సీజన్‌ ఫైనలిస్ట్‌లు చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ నేడు చెపాక్‌ వేదికగా ముఖాముఖి తలపడనున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌పై విజయంతో చెన్నై సూపర్‌కింగ్స్‌… ముంబయి ఇండియన్స్‌కు షాకిచ్చి గుజరాత్‌ టైటాన్స్‌ సీజన్‌ తొలి మ్యాచుల్లో విజయారంభం అందుకున్నాయి. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ గెలుపు జోరు కొనసాగించాలని ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో సూపర్‌కింగ్స్‌, టైటాన్స్‌ మ్యాచ్‌ నేడు.
అతడు బ్యాట్‌ పడతాడా? : సూపర్‌కింగ్స్‌ అభిమానులకే కాదు క్రికెట్‌ ప్రియులు అందరూ ఈ సీజన్‌లో మహేంద్రసింగ్‌ ధోని విన్యాసాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎం.ఎస్‌ ధోని ఆఖరు ఐపీఎల్‌ సీజన్‌గా భావిస్తున్న ఏడాదిలో అతడు బ్యాట్‌తో మునుపటి మహిని తలపిస్తే చూడాలని అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాట్‌ పట్టాల్సిన అవసరం రాలేదు. లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన సూపర్‌కింగ్స్‌కు ధోని టెయిలెండర్లతో పాటు వస్తున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనైనా ధోని బ్యాటింగ్‌కు వస్తే అభిమానులకు అదే పండుగ!. ఇక కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌, శివం దూబె సహా రవీంద్ర జడేజా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, దీపక్‌ చాహర్‌లతో కూడిన పేస్‌ దళం బాగుంది. అచ్చొచ్చిన చెపాక్‌ స్టేడియంలోనే మ్యాచ్‌ కావటంతో సహజంగానే చెన్నై సూపర్‌కింగ్స్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
టైటాన్స్‌కు సవాల్‌ : గుజరాత్‌ టైటాన్స్‌ తొలి రెండు సీజన్లు ఫైనల్స్‌కు చేరి ఐపీఎల్‌ అగ్రజట్లలో ఒకటిగా నిలిచింది. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్‌ ఓటమి కోరల్లోంచి బయటకొచ్చి మరీ విజయం సాధించింది. బ్యాట్‌తో, బంతితో టైటాన్స్‌ వాస్తవానికి అంచనాలు అందుకోలేదు. కానీ బౌలర్లు డెత్‌ ఓవర్లలో ఆకట్టుకున్నారు. ఒత్తిడి కనిపించినా.. బ్యాటర్లను క్రమం తప్పకుండా వెనక్కి పంపారు. ఆఖరు ఓవర్లోనూ ఉమేశ్‌ యాదవ్‌పై ఒత్తిడి పడినా.. మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆఖరు వరకు పోరాడేతత్వమే టైటాన్స్‌ను విజేతగా నిలిపింది. ఇదే ఫార్ములాను నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తోనూ టైటాన్స్‌ పాటించనుంది. స్పిన్‌ ప్రభావం చూపే చెపాక్‌లో మాయగాడు రషీద్‌ ఖాన్‌ టైటాన్స్‌కు కీలకం కానున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, డెవిడ్‌ మిల్లర్‌, సాయి సుదర్శన్‌లు గుజరాత్‌ కీలక ఆటగాళ్లు.

➡️