సత్తా చాటిన కోల్‌కతా బౌలర్లు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 153/9

Apr 29,2024 19:12 #Cricket, #kkr, #Sports

న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న ఢిల్లీ.. సొంత వేదికపై భారీస్కోర్‌ చేయడంలో విఫలమైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 153పరుగులు చేసింది. తొలుత పేసర్లు టాపార్డర్‌ను కూల్చగా.. మిస్టరీ వరుణ్‌ చక్రవర్తి(3/16) ఇక తన వంతు అన్నట్టు మిడిలార్డర్‌ పని పట్టాడు. అయితే.. చివర్లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (35నాటౌట్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ పోరాడగలిగే స్కోర్‌ చేయగలిగింది. ఢిల్లీకి తొలినుంచే కష్టాలు మొదలయ్యాయి. వైభవ్‌ అరోరా, స్టార్క్‌ నిప్పులు చెరగడంతో ఓపెనర్‌ పథ్వీ షా(13), చిచ్చరపిడుగు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌(12), షారు హౌప్‌(7), యువకెరటం అభిషేక్‌ పొరెల్‌(18)లు డగౌట్‌కే చేరారు. ఆ తర్వాత స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తొలి బంతికే కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(27)ను బోల్తా కొట్టించాడు. వాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, వంద లోపే సగం వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న ట్రిస్టన్‌ స్టబ్స్‌(4), అక్షర్‌ పటేల్‌(15)లు సైతం స్వల్ప స్కోర్‌కే పెవిలియన్‌ చేరారు. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ కుమార్‌ కుశగ్ర(1)ను ఔట్‌ చేసిన చక్రవర్తి ఢిల్లీ భారీ స్కోర్‌ ఆశలకు గండి కొట్టాడు. అయితే.. రసిక్‌ దార్‌(8) అండగా కుల్దీప్‌(35) చివరి దాకా నిలబడి పంత్‌ సేనకు పోరాడగలిగే స్కోర్‌ అందించాడు. కోల్‌కతా బౌలర్లు వరణ్‌ చక్రవర్తికి మూడు, అరోరా, హర్షీత్‌ రాణాకు రెండేసి వికెట్లు దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి)సాల్ట్‌ (బి)అరోరా 13, ఫ్రేజర్‌ (సి)వెంకటేశ్‌ అయ్యర్‌ (బి)స్టార్క్‌ 12, పోరెల్‌ (సి)హర్షీత్‌ రాణా 18, హోప్‌ (బి)వైభవ్‌ అరోరా 6, పంత్‌ (సి)శ్రేయస్‌ అయ్యర్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 27, అక్షర్‌ (బి)నరైన్‌ 15, స్టబ్స్‌ (సి)సాల్ట్‌ (బి)చక్రవర్తి 4, కుశగ్ర (సి)సాల్ట్‌ (బి)చక్రవర్తి 1, కుల్దీప్‌ (సి)శ్రేయస్‌ (బి)హర్షీత్‌ రాణా 8, విలియమ్స్‌ (నాటౌట్‌) 1, అదనం 13. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 153పరుగులు.

వికెట్ల పతనం: 1/17, 2/30, 3/37, 4/68, 5/93, 6/99, 7/101, 8/111, 9/140 బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-43-1, అరోరా 4-0-29-2, హర్షీత్‌ రాణా 4-0-28-2, నరైన్‌ 4-0-24-1, చక్రవర్తి 4-0-16-3, రస్సెల్‌ 1-0-10-0.

➡️