కుటుంబం ఆత్మహత్యలపై కలెక్టర్‌ న్యాయవిచారణ చేపట్టాలి

Mar 26,2024 21:41 #enquiry, #Suicide

వామపక్ష పార్టీలు, రైతు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌
రూ.3 కోట్లు ఆర్థిక సాయం చేయాలి : బాలకృష్ణ
ప్రజాశక్తి – కడప అర్బన్‌, మంగళగిరి (గుంటూరు జిల్లా) :భూ సమస్య కారణంగా మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు, ఆయన భార్య, కుమార్తె ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని వామపక్ష, రైతు, వ్యవసాయ, కార్మిక, సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి రూ.మూడు కోట్లు ఆర్థిక సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు పి బాలకృష్ణ, కట్ట శివ దుర్గారావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలోని చేనేత కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. పాల సుబ్బారావు మగ్గంపై నేత పనిచేస్తూ జీవించేవారని తెలిపారు. అయన భూమి ఆన్‌లైన్‌లో రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేయడంతో తనపేరుతో మార్చాలని పలు మార్లు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన కుటుంబం మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. మరో కుమార్తె అనాధగా మిగిలిందని పేర్కొన్నారు. సుబ్బారావు మృతికి కారకులైన రెవెన్యూ అధికారులను బర్తరఫ్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
వైఎస్‌ఆర్‌ జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారికి నాయకులు వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు జి చంద్రశేఖర్‌, జి చంద్ర మాట్లాడుతూ సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, భూ అక్రమణకు పాల్పడిన అప్పటి తహశీల్దారు, రెవెన్యూ అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. న్యాయ విచారణ చేపట్టి మృతుని కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలని కోరారు. జిల్లా ఉన్నతాధికారులు అండగా నిలబడాలని, అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, అధ్యక్షులు సుబ్బారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌, అన్వేష్‌, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివ నారాయణ, రైతు సంఘం, సిపిఎం, సిపిఐ, ఎంఎల్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️