బుగ్గనపైనే భారం

ప్రజాశక్తి – కడప ప్రతినిధి రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 సమర్పణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి బుధవారం ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, పారిశ్రామికం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌పై ఆశలపై అందరి దృష్టీ నిలిచింది. ఏడాదిన్నర్రగా పారిశ్రామికానికి మౌలిక వసతుల కల్పనలో కదలిక వచ్చినప్పటికీ పరిశ్రమల ఏర్పాటు నానాటికీ ఆలస్యమవుతోంది. ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అవుతుందని చెప్పవచ్చు. జిల్లా ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌ యంత్రాంగం ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతేడాది తరహాలోనే సుమారు రూ.2,700 కోట్ల కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు అందజేసింది. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 ప్యాకేజీ పనులు, కుందూ-పెన్నా, కాలేటివాగు ఎత్తిపోతలు, రాజోలు, జొలదరాశి, యురేనియం బాధిత గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో కేటాయింపులు చేయాల్సి ఉంది. పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తామనే గడువు ముగిసినప్పటికీ శంకుస్థాపనల దశలోనే కొట్టు మిట్టాడుతోంది. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2 కాంట్ర ాక్టుల రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఎటువంటి పురోగతీ లేకుండా పోయింది. ఇటీవల జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 ప్యాకేజీ-3 పనులకు టెండర్లు నిర్వహించడం మినహా మిగిలిన ప్యాకేజీ-4, ప్యాకేజీ-5, ప్యాకేజీ-6, ప్యా కేజీ-7 పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. రూ.1357 కోట్లతో రాజోలి, రూ.1312 కోట్లతో జొలదరాశి, రూ. 564 కోట్లతో కుందూ-పెన్నా ఎత్తి పోతల, రూ.5 వేల కోట్లతో కాలేటివాగు ఎత్తిపోతల పథకం పనులకు భూసేకరణ, అడ్డంకుల కారణంగా ముందుకు సాగడం లేదు. పులివెందుల నియోజకవర్గ పరిధి లోని యురేనియం బాధిత గ్రామాలకు తాగునీటి పైప్‌లైన్‌ పనులు సాకారానికి నోచుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనల సందర్భంగా ఆయా పనుల పురోగతిని ఏకరువు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడం తెలిసిందే. అయినప్పటికీ ఆశించిన పురోగతి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా గండికోట, సోమశిల, పైడిపాలెం నిర్వాసితుల సంగతిని పట్టించుకోవడం లేదు. గండికోట నిర్వాసితులకు పెంచిన పరిహారం ఎప్పటికి అందుతుందో తెలియడం లేదు. తెలుగుగంగ, చిత్రావతి, సర్వరాయసాగర్‌ రిజర్వాయర్ల లీకేజీ పనులు దశాబ్దాల తరబడి నిరీక్షి స్తుండడం తెలిసిందే. తెలుగుగంగ ఇంజనీరింగ్‌ యంత్రాంగం తాజాగా రూ.125 కోట్ల మేరకు ప్రతిపాదనలు పంపించింది. జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2, టిజిపి ప్రతిపాదనల్లో ఏమేరకు కేటాయింపులు ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.

➡️