ఆస్కార్‌ ఓటింగ్‌ మొదలైంది

Jan 13,2024 19:10 #askar, #movies

96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక మార్చి 10న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. శుక్రవారం నుండి ఓటింగ్‌ మొదలుపెట్టినట్లు ఆస్కార్‌ అకాడమీ వెల్లడించింది. జనవరి 12న మొదలైన ఈ ఓటింగ్‌ జనవరి 16 సాయత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఆస్కార్‌ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరూ వారికి కేటాయించిన విభాగాల్లోని వారికి ఓటు వేస్తారు. అకాడమీలో సభ్యులుగా ఉన్న యాక్టర్స్‌ యాక్టింగ్‌ విభాగానికి మాత్రమే ఓటు వేస్తారు. అలాగే మిగతా విభాగాల వారు కూడా ఓటింగ్‌లో పాల్గంటారు. 23 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డుల విజేతలను ప్రకటిస్తారు. ‘ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’, ‘డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌’, ‘డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగాలకు చెందిన ఓటింగ్‌కు మాత్రం ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నెల 23న ఆస్కార్‌ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే పది విభాగాల్లోని షార్ట్‌ లిస్ట్‌ జాబితాను ప్రకటించారు. ఈ ఏడాది తొలిసారిగా రామ్‌ చరణ్‌, ఎన్‌టిఆర్‌లు ఆస్కార్‌ ఓటింగ్‌లో పాల్గననున్నారు. గతేడాది వీరిద్దరినీ ఆస్కార్‌ కమిటీ సభ్యులుగా ప్రకటించారన్నది తెలిసిందే.

➡️